రెండు లారీల ఓనరు.. దొంగయ్యాడు!

ABN , First Publish Date - 2022-01-18T10:07:09+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌తో రోడ్డున పడ్డ ఎంతో మందిలో అతడూ ఒకడు. పట్టుదలతో కృషి చేసి తిరిగి ఎదగాల్సిన స్థితిలో..

రెండు లారీల ఓనరు.. దొంగయ్యాడు!

లాక్‌డౌన్‌తో తీవ్రంగా నష్టపోయి.. ఆపై వ్యసనాలకు బానిసై..


కూకట్‌పల్లి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): కరోనా లాక్‌డౌన్‌తో రోడ్డున పడ్డ ఎంతో మందిలో అతడూ ఒకడు. పట్టుదలతో కృషి చేసి తిరిగి ఎదగాల్సిన స్థితిలో.. చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. చైన్‌ స్నాచర్‌గా మారాడు. చివరకు పోలీసులకు చిక్కి జైలుకు చేరాడు. ఏపీలోని కృష్ణా జిల్లా పన్మలూరు మండలం కానూరు గ్రామానికి చెందిన కుర్ర రాజేశ్‌ (34).. భార్య, కుమార్తెతో కలిసి హైదరాబాద్‌లోని మియాపూర్‌లో నివాసం ఉంటున్నాడు. 2020 ప్రారంభంలో ఉద్యోగం వదిలేసి బ్యాంకు రుణంతో రెండు లారీలు కొనుగోలు చేశాడు.


రెండు నెలలు తిరక్కుండానే కరోనా లాక్‌డౌన్‌ రావడంతో.. తీవ్రంగా నష్టపోయాడు. కిస్తీలు కట్టలేకపోవడంతో.. బ్యాంకు వాళ్లు లారీలు స్వాధీనం చేసుకున్నారు. క్రమంగా చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. రోడ్డు పక్కన నడుచుకొంటూ వెళ్లే మహిళలే లక్ష్యంగా గొలుసు దొంగతనాలకు పాల్పడేవాడు. ఈ క్రమంలో.. కూకట్‌పల్లి ప్రాంతంలో ఇటీవల ఇద్దరు మహిళల నుంచి రెండు చైన్లు లాక్కుని పారిపోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్న పోలీసులు.. ఆ ప్రాంతంలో నిఘా పెట్టారు. ఆదివారం సాయంత్రం రాజేశ్‌ను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేశారు.  

Updated Date - 2022-01-18T10:07:09+05:30 IST