మోదీ పర్యటనకు ముందు Jammu జిల్లాలో ఉగ్రవాదుల దాడి...జవాన్ మృతి

ABN , First Publish Date - 2022-04-22T12:41:36+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ జమ్మూ కశ్మీర్‌ పర్యటనకు ముందు శుక్రవారం తెల్లవారుజామున సుంజ్వాన్ ప్రాంతంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్...

మోదీ పర్యటనకు ముందు Jammu జిల్లాలో ఉగ్రవాదుల దాడి...జవాన్ మృతి

మరో నలుగురికి గాయాలు

జమ్మూ:  ప్రధానమంత్రి నరేంద్రమోదీ జమ్మూ కశ్మీర్‌ పర్యటనకు ముందు శుక్రవారం తెల్లవారుజామున సుంజ్వాన్ ప్రాంతంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది.జమ్మూ శివార్లలోని ఆర్మీ క్యాంపు సమీపంలో జరిగిన కాల్పుల్లో  భద్రతా దళానికి చెందిన జవాన్ వీర మరణం పొందారు. ఈ ఎదురుకాల్పుల్లో మరో నలుగురు గాయపడినట్లు పోలీసు అధికారులు తెలిపారు.జమ్మూ జోన్  ప్రాంతంలో పాకిస్థాన్‌కు చెందిన జైష్-ఏ-మహ్మద్ (జేఎం) సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారనే నిర్దిష్ట సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.ఉగ్రవాదులు సుంజ్వాన్ లోని ఓ ఇంట్లో దాక్కున్నారని సమాచారం అందడంతో తాము ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టామని, ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని పోలీసులు చెప్పారు.


 ఇంట్లో బహుశా ఇద్దరు జైషే ఉగ్రవాదులు చిక్కుకున్నట్లు భావిస్తున్నామని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఇద్దరూ ఉగ్రవాదులు విదేశీయులుగా భావిస్తున్నారు.పోలీసు స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, సీఆర్‌పీఎఫ్ ఈ ప్రాంతంలో సంయుక్తంగా గాలింపు ఆపరేషన్ ప్రారంభించినప్పుడు ఎన్‌కౌంటర్ ప్రారంభమైందని జమ్మూ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముఖేష్ సింగ్  చెప్పారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 24వతేదీన జమ్మూలోని సాంబా జిల్లాను సందర్శించాల్సి ఉంది.మరోవైపు ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో గత 22 గంటల నుంచి మరో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి, ఇందులో టాప్ లష్కరే తోయిబా  ఉగ్రవాద దళ కమాండర్ కూడా ఉన్నారు. పోలీసుల కార్డన్‌‌సెర్చ్‌లో మరో ఇద్దరు ఉగ్రవాదులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది.



జమ్మూలో శుక్రవారం 15 మంది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) సిబ్బందితో వెళ్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు.ఈ దాడిలో ఒక ఏఎస్ఐ ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారని సీఐఎస్ఎఫ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్  సిబ్బంది ఉగ్రవాదులను సమర్ధంగా తిప్పికొట్టడంతో వారు పారిపోయారు. శుక్రవారం నాడు కేంద్ర భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు.

Updated Date - 2022-04-22T12:41:36+05:30 IST