ఓ వైపు కేసులు - మరో వైపు కరోనా పరీక్షలు

ABN , First Publish Date - 2021-05-07T06:43:13+05:30 IST

కరోనా బాదితులు రోజురోజుకు పెరుగుతున్నారు. దీంతో అటు అధికారుల్లోనూ, ఇటు ప్రజల్లో ఆందోళనగా ఉంది.

ఓ వైపు కేసులు - మరో వైపు కరోనా పరీక్షలు
కరోనా బాధితుల బారులు

పట్టణంలో 300కు పైగా కరోనా బాధితులు

కనిగిరి, మే 6: కరోనా బాదితులు రోజురోజుకు పెరుగుతున్నారు. దీంతో అటు అధికారుల్లోనూ, ఇటు ప్రజల్లో ఆందోళనగా ఉంది. ఓ వైపు కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతుండగా, మరో వైపు కరోనా పరీక్షల కోసం ప్రజలు పరీక్షా కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. దీంతో అధికారులు వైరస్‌ విస్తృతికి కారణాలు అన్వేషిస్తున్నారు. ఈ విషయంలో జిల్లా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు టెలీకాన్ఫెరెన్స్‌ ద్వారా నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. కరోనా ఆంక్షలతో 144 సెక్షన్‌ను పోలీసులు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. పోలీసులు విధి నిర్వహణగా భావించి రెండవ రోజు కూడా ఆంక్షలు అమలు చేయడంలో కఠినంగా వ్యవహరించారు.

సీహెచ్‌సీలో 150కి పైగా కేసులు నమోదు

కనిగిరి కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌లో ఇప్పటికే 150కి పైగా కరోనా కేసులు నమోదైనట్లు ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సునీత తెలిపారు. బాధితులు తప్పనిసరిగా వైద్యుల పర్యవేక్షణలో నిబంధనలు పాటిస్తూ, హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. లక్షణాలు తీవ్రంగా ఉన్నవారిని, వారితో పాటు హోం ఐసోలేషన్‌ ఇష్టపడని వారని కలాం డీఈడీ కళశాలలో ఏర్పాటు చేసిన కొవిడ్‌కేర్‌ సెంటర్‌కు తరలిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. వారికి అక్కడ వైద్యంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు.

ఇక మండలంలోని మాచవరం పీహెచ్‌సీలో ఇప్పటికే 70కి పైగా కేసులు నమోదుకాగా, గురవాజీపేట పీహెచ్‌సీలో 180 కేసులు దాకా నమోదైనట్లు మాచవరం, గురవాజీపేట పీహెచ్‌సీ వైద్యులు  ఇన్‌చార్జ్‌ వైద్యులు షరీఫ్‌, నాగరాజ్యలక్ష్మిలు తెలిపారు. కరోనా బాదితులను వారి అభీష్టం మేరకు హోం ఐసోలేషన్‌, కరోనా కేర్‌ సెంటర్‌కు తరలిస్తున్నామన్నారు.

అత్యధిక కేసులు ఈ గ్రామాల్లోనే

కనిగిరి నగర పంచాయతీ పరిధిలో 20 వార్డుల్లో ఇప్పటికే 300కి పైగా కేసులు నమోదుకాగా, 1, 20వ వార్డుల పరిధిలోని ఇందిరాకాలనీలో అత్యధికంగా ఇప్పటికే 79కి పైగా కేసులు నమోదయ్యాయి. ఇటీవల ఈ ప్రాంతంలో ఐదుగురు కరోనాతో మరణించారు. అదేవిధంగా నక్కలతిప్ప పరిధిలోని కాశిరెడ్డి బజారు, మందిరం వీధి, పాత ఎక్సైజ్‌ కార్యాలయం వీధిలో 50కి పైగా కేసులు నమోదయినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. మండలంలోని గానుగపెంట, చాకిరాల గ్రామాల్లో అత్యధిక కేసులు నమోదైనట్లు అధికారుల చెప్తున్నారు. గానుగపెంట గ్రామంల సర్పంచ్‌పాఛ్చాహుస్సేన్‌(బుడేసాహెబ్‌ ) గ్రామంలో పర్యటించి కరోనా నిబందనలపై అవగాహన కల్పిస్తున్నారు. బాధిత కుటుంబాలకు నిత్యావసరాలు అందిస్తున్నారు.

Updated Date - 2021-05-07T06:43:13+05:30 IST