ఓటీఎస్‌ కష్టాలు

ABN , First Publish Date - 2022-01-19T06:08:01+05:30 IST

ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నట్టుగా ఉంది మండలంలోని అధికారులు, ఉద్యోగుల పరిస్థితి.

ఓటీఎస్‌ కష్టాలు
అధికారులకు ఓటీఎస్‌పై అవగాహన కల్పిస్తున్న తహసీల్దార్‌ సోమశేఖర్‌ (ఫైల్‌)

అధికారులు, ఉద్యోగులకు తప్పని ఇబ్బందులు 

నెల రోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడి

స్వచ్ఛందమంటూనే ఇబ్బంది పెట్టేలా చర్యలు 


ఏలూరురూరల్‌, జనవరి 18 : ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నట్టుగా ఉంది మండలంలోని అధికారులు, ఉద్యోగుల పరిస్థితి. ఎప్పుడో పేదలు నిర్మించుకున్న గృహాలకు ఇప్పుడు రిజిస్ట్రేషన్‌ చేస్తామంటూ ప్రభుత్వం తీసుకువచ్చిన వన్‌టైం సెటిల్‌మెంట్‌ స్కీమ్‌ (ఓటీఎస్‌) అటు పేదలతోపాటు ఇటు అధికారులను కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈ పథకం స్వచ్ఛందం అంటూ ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నా అంతర్గతంగా మాత్రం ప్రభుత్వం నుంచి అధికారులకు తీవ్ర ఒత్తిడి వస్తోంది. ప్రతీరోజూ ఎంత వసూలు చేశారంటూ అడుగుతుండడంతో అధికారులు ఒత్తిడికి తట్టుకోలేక ఆ ప్రతాపాన్ని మండల, గ్రామస్థాయి అధికారులు, ఉద్యోగస్తులపై చూపిస్తున్నారు. ప్రతీ సచివాలయానికి టార్గెట్‌లు పెట్టి వసూలు చేయాలని ఒత్తిడి చేస్తూ ఈ పక్రియపై నిరంతరం సమీక్షిస్తున్నారు. దీంతో ఉద్యోగులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. క్షేత్రస్థాయి ఉద్యోగులు లబ్ధిఆరుల వద్దకు వెళ్తున్నప్పటికి ఓటీఎస్‌పై వారు పెద్దగా స్పందించడంలేదు. తమకు రిజిస్ట్రేషన్లు అవసరంలేదంటూ మెజార్టీ లబ్ధిదారులు తిరస్కరిస్తున్నారు. ఓటీఎస్‌కు డబ్బులు కట్టేందుకు పేదలు ముందుకు రాక అటు ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి వస్తుండడంతో ఉద్యోగులు, అధికారులు మానసిక వేదనను అనుభవిస్తున్నారు.


అధికార పార్టీలోనూ వ్యతిరేకత !

సంపూర్ణ గృహహక్కు పథకం ద్వారా ఓటీఎస్‌ కింద రిజిస్ట్రేషన్‌ చేసి పట్టాలు ఇస్తారు. కార్పొరేషన్‌లో రూ.20 వేలు, మునిసిపాలిటీలో రూ. 15 వేలు, పంచాయతీలో రూ.10 వేలు చెల్లించాలి. గుర్తించిన జాబితాను సచివాలయాలకు చేరవేశారు. ఒకటిన్నర నెలలుగా సచివాలయాల మండల కేంద్రాల్లోని అధికారులు ఈ పనిమీదే ఉన్నారు. ఇప్పటివరకు ఓటీఎస్‌ కింద మూడోవంతు మంది మాత్రమే ఆసక్తి చూపించారు. ఈ పథకంపై మొదట్లో అధికార పార్టీ నేతలు సానుకూలంగా వ్యవహరించి పలువురి చేత డబ్బులు కట్టించే బాధ్యత తీసుకున్నారు. కాని పేదల నుంచి వ్యతిరేకత వస్తుండడంతో వారు కూడా మిన్నకుండిపోతున్నారని తెలుస్తోంది. ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయిలో అధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిళ్లు వస్తుండడంతో ఓటీఎస్‌ ప్రోగ్రెస్‌ పెరిగేలా ప్రజాప్రతినిధులు సాయం చేయాల్సిందిగా అధికారులు గోడు వెళ్లబోసుకుంటున్నారు. కానీ  ఇప్పుడు వారి నుంచి వ్యతిరేకత వస్తుండడంతో ఏమీ చేయలేని పరిస్థితిలో అధికారులు ఉండిపోతున్నారు. ఓటీఎస్‌ పథకం గడువు పొడిగిపుంతో అధికారులు, ఉద్యోగులపై ఒత్తిడి మరింత ఎక్కువైంది. 

Updated Date - 2022-01-19T06:08:01+05:30 IST