ఏదీ సెటిల్‌మెంట్‌

ABN , First Publish Date - 2022-05-26T05:52:47+05:30 IST

బడుగు బలహీన వర్గాలకు సొంతింటి కల సాకారం చేస్తూ ఎన్టీఆర్‌ హయాం దగ్గర నుంచి చంద్రబాబు పాలన వరకు వరుసగా పేదలకు పక్కా ఇళ్ళు సమకూర్చారు.

ఏదీ సెటిల్‌మెంట్‌

సంపూర్ణ గృహ హక్కు పథకంలో మతలబులెన్నో

ఓటీఎస్‌ పేరిట పేదల ముక్కు పిండారు

పైసలిస్తేనే రిజిస్ట్రేషన్‌ అంటూ ఊదర

ఇప్పటికీ వందల మంది కుయ్యో.. మొర్రో

గడప గడపకు వస్తున్న వారికి ఫిర్యాదులు

కట్టింది రూ.8 కోట్లు..కట్టాల్సింది రూ.16 కోట్లు


మీ ఇల్లు మీ సొంతం. కేవలం పది వేలు కడితే చాలు హక్కులన్నీ మీ చేతికొస్తాయి. ప్రభుత్వమే దగ్గరుండి మరీ రిజిస్ట్రేషన్‌ చేయిస్తుంది. అధికారులే మీ దగ్గరకు వస్తారు. బ్యాంకు రుణం కూడా సులువుగా పొందొచ్చు. రండి..తొందరపడండి.. సరిగ్గా ఏడు నెలల క్రితం జగన్‌ సర్కార్‌ పాడిన పాట ఇది. పేదలకు ఆశల వలలు విసిరారు. వన్‌టైం సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) పేరిట భారం మోపారు. అనేక మంది అప్పో సొప్పో చేసి సర్కారుకు చెల్లించారు. ఇంత చేస్తే ఇంకా వందలాదిమందికి  సొంతిల్లు రిజిస్ట్రేషనే కాలేదు. గడపగడపకు వస్తున్న ఎమ్మెల్యేలకు ఇదే విషయం చెబుతుంటే వారంతా అవాక్కవుతున్నారు.


(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) 

బడుగు బలహీన వర్గాలకు సొంతింటి కల సాకారం చేస్తూ ఎన్టీఆర్‌ హయాం దగ్గర నుంచి చంద్రబాబు పాలన వరకు వరుసగా పేదలకు పక్కా ఇళ్ళు సమకూర్చారు. అన్ని వసతులు కల్పించారు. దశాబ్ధాల తరబడిన ఈ ఇళ్ళల్లో అనేకం శిఽథిలమయ్యాయి. మరికొన్ని చేతులు మారాయి. ఇంకొన్ని అస్తవ్యస్తంగా మారాయి. అయినా పేదలు మాత్రం తమకంటూ ఓ జాగా ఉందనే ధీమాతోనే ఇప్పటిదాకా బతుకీడ్చుకొచ్చారు. వివాదాలు తలెత్తినా సర్దుకుపోయారు. ఆక్రమణకు గురైతే గొంతెత్తి నినదించారు. ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఇలాంటి తరుణంలోనే దాదాపు మూడు దశాబ్దాల తరబడి వరుసగా ప్రభుత్వపరంగా మంజూరైన పక్కా గృహాలన్నింటికీ ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉంటే వారికే ‘హక్కు’ లభించేలా చేస్తామని జగన్‌ సర్కార్‌ ఓ వల విసిరింది. గత ఏడాది నవంబర్‌ మాసంలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ఈ పథకం కింద ఏకకాల పరిష్కారం ఓటీఎస్‌ పేరిట జనంలోకి వలంటీర్లను వదిలారు. అంతేకాదండోయ్‌.. ఏదో ఉత్తుత్తిగా హక్కు అయితే ఇవ్వలేం, ఓ పది వేలు చెల్లిస్తే చాలు ఇట్టే హక్కు పత్రం ఇస్తాం.. పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వపరంగా రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తామని అప్పట్లో బాకా ఊదారు. కాదూకూడదని నిలదీసిన పేదలను ‘మీ ఇష్టం ఇప్పుడు కడితే కట్టండి. లేదంటే ఇప్పుడున్న మీ ఇల్లు కాస్తా ఇంకొకరి సొంతమవుతుంది, జాగ్రత్త’ అంటూ స్థానిక నాయకులు బెదిరింపులకు దిగారు. వలంటీర్లు వంత పాడారు. చేతిలో నయాపైసా లేకపోయినా వడ్డీలకు తెచ్చి పదివేలు సర్కారుకు సమర్పించారు. దీనిపై అప్పట్లో టీడీపీ నిరసన వ్యక్తం చేసినా, పేదలు ఆగ్రహించినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. పేదల నుంచి సొమ్ములు వసూలుకే సిద్ధపడింది, ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఒకవైపు అధికారులు, మరోవైపు వలంటీర్లకు వసూళ్ళ లక్ష్యాలను విధించారు. గడిచిన ఏడు నెలల క్రితం ప్రారంభమైన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద ప్రస్తుత ఏలూరు జిల్లాలోనే దాదాపు 89,196 మంది లబ్ధిదారులను ఓటీఎస్‌ కింద గుర్తించారు. వీరంతా చెల్లిస్తేనే హక్కు పత్రం చేతికందుతుంటూ తెగేసి చెప్పారు. ఇంత చేస్తే అధికారులు లెక్కలు మీద లెక్కలు కట్టినా దాదాపు 1300 మందికిపైగా ఇప్పటికీ సొమ్ము అయితే కట్టారుకాని.. రిజిస్ట్రేషన్‌ మాత్రం కాలేదు. ఉచితంగా సర్కారే రిజిస్ట్రేషన్‌ చేసి చేతిలో పెడతామన్నారుకదా అంటూ గడపగడపకు వస్తున్న వారిని పేదలు ప్రశ్నించడం ప్రారంభించారు. ఈ మధ్యకాలంలో ఈ హక్కు పథకం తెరమరుగైనా ఇప్పుడు వస్తున్న అభ్యంతరాలతో తెర ముందుకొచ్చినట్టయ్యింది.


స్పందించని లబ్ధిదారులు

ఉమ్మడి పశ్చిమగోదావరిలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద దాదాపు లక్షా 51 వేల మంది లబ్ధిదారులను గుర్తించారు. అప్పట్లో రూ.105 కోట్ల వసూళ్ళ లక్ష్యాన్ని నిర్దేశించారు. పది వేల రూపాయలు చొప్పున కొన్నిళ్ళకు, రూపాయికే కొన్నిళ్ళకు రిజిస్ట్రేషన్‌ చేసి ఇచ్చేందుకు అప్పట్లో ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. జిల్లాల పునర్విభజన తరువాత ఉమ్మడి పశ్చిమ నుంచి కొత్తగా ఏలూరు జిల్లా ఆవిర్భవించింది. ఈ జిల్లా పరిధిలో ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 89 వేలకుపైగా లబ్ధిదారులను గుర్తించారు. వీరంతా 24 కోట్ల రూపాయలు వన్‌టైం సెటిల్‌ మెంట్‌ పేరిట చెల్లించాల్సి ఉంది. కాని ఇప్పటిదాకా 65,731 మంది లబ్ధిదారులు తమంతట తాముగా 7 కోట్ల 96 లక్షల రూపాయలు ముప్పుతిప్పలు పడి ప్రభుత్వానికి సమర్పించుకున్నారు. అయితే వీరిలో అనేక మందికి ఉచితంగా ఇళ్ళకు రిజిస్ట్రేషన్‌ వర్తింప చేసినా మరో 1300 మంది లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్‌ నిలిపివేశారు. అయితే అధికారులు చెబుతున్న కారణం మరోలా ఉంది. పాత పట్టా కలిగి ఉండడం, కొన్ని అభ్యంతరాలు కలిగి ఉం డడం, 22ఎ కింద వర్తింపు అవకాశం లేకపోవడంతోపాటు స్థానిక అధికారులు డేటాను సక్రమంగా నమోదు చేయక పోవడం వంటి కొన్ని కారణాలను లేవనెత్తుతున్నారు. ఇలాంటి సమస్యల న్నింటినీ ముందుగానే తమకు తెలియ చేయకుండా అప్పట్లో ఎందుకు హడావుడిగా పదివేలు కట్టించుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరందరి సమస్యలు పరిష్కరించేందుకు ఇప్పుడు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు.  



Updated Date - 2022-05-26T05:52:47+05:30 IST