వసూళ్ల జాతర

ABN , First Publish Date - 2021-11-29T06:05:39+05:30 IST

జగనన్న సంపూర్ణ గృహ హక్కు కింద ఒక్క పశ్చిమలోనే రూ.100 కోట్లకు తగ్గకుండా వసూలు చేయాలని ప్రభుత్వం లక్ష్యం విధించింది.

వసూళ్ల జాతర
మొగల్తూరు మండలంలో ఇంటింటికి తిరిగి అవగాహన కల్పిస్తున్న ఎంపీడీవో ఆనంద్‌కుమార్‌

సెటిల్‌మెంట్‌ టార్గెట్‌ రూ.100 కోట్లు

జిల్లాలో తొలి విడత 42 వేల గృహ లబ్ధిదారుల గుర్తింపు

3,616 మంది నుంచి వచ్చింది రూ.మూడున్నర కోట్లు 

రావాల్సింది.. రూ.97 కోట్లు.. వసూళ్లకు తీవ్ర ఒత్తిళ్లు.. 

విఫలమైతే సిబ్బందికి షోకాజ్‌ నోటీసుల జారీకి సిద్ధం

ఇంటా, బయట ఒత్తిళ్లతో సిబ్బంది ఆగమాగం

ప్రజల నుంచి వ్యక్తమవుతున్న తీవ్ర వ్యతిరేకత..


జగనన్న సంపూర్ణ గృహ హక్కు కింద ఒక్క పశ్చిమలోనే రూ.100 కోట్లకు తగ్గకుండా వసూలు చేయాలని ప్రభుత్వం లక్ష్యం విధించింది. ఇందుకు 60 రోజుల సమయాన్ని నిర్ధేంచింది. గృహ నిర్మాణ శాఖ, సచివాలయ సిబ్బంది, వీఆర్వో, వీఏవోలతో సహా అందరినీ మమేకం చేసి రోజువారీ టార్గెట్‌లు ఇచ్చారు. దీనిని అందుకోలేకపోతున్న వారికి షోకాజ్‌లు ఆరంభమయ్యాయి. ఈ చర్యలతో సిబ్బంది పైకి చెప్పుకోలేక.. ఎదురు తిరగలేక తీవ్రంగా నలిగిపోతున్నారు. మరోవైపు పేదల నుంచి తీవ్ర నిరసన, ఆగ్రహం వ్యక్తం వ్యక్తమవుతోంది. పాత ఇళ్లకు ఇప్పుడు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు కట్టించడం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు.  


 (ఏలూరు–ఆంధ్రజ్యోతి):

జిల్లావ్యాప్తంగా 1983–2011 సంవత్సరాల మధ్య రెండు లక్షల 90 వేల పక్కా గృహాలను గుర్తించి పూర్తిస్థాయి డేటాను సేకరించారు. కొన్ని శిథిలమయ్యాయి. మరికొన్ని ఆక్రమణలకు గురయ్యాయి, ఇంకొన్ని కాస్తాంత నివాసయోగ్యంగానే ఉన్నాయి. ప్రభుత్వం పక్కా గృహ నిర్మాణంలో మొదటి నుంచి పేదలకు కొంత రుణం కల్పిస్తూనే మిగతా సబ్సిడీని ఆయా ప్రభుత్వాలు భరిస్తూ వచ్చాయి. ఈ లెక్కన నాన్‌ లోనింగ్‌ కింద అంటే రుణం పొందని ఇళ్లను లెక్కలోకి తీసుకుంటున్నారు. ఈ లెక్కన జిల్లాలో సరాసరిన రెండు లక్షల 30 వేల ఇళ్లకు సంబంధించి లబ్దిదారుల నుంచి నిర్దేశించిన రేటును నేరుగానే లాగేసుకోవాలనేదే సర్కారు కల. దీనికిగాను సామ దాన దండోపాయాలను ప్రయోగిస్తోంది. ఇప్పుడున్న అధికారిక లెక్కలు తేల్చడానికి యంత్రాంగానికి చాలా సమయం పట్టింది. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం లబ్ధిదారుల వివరాలను గత తెలుగుదేశం ప్రభుత్వం ఆధార్‌ అనుసంధానంతో కాస్త పక్కాగానే తేల్చింది. ఆ లెక్కలన్నింటిని కలిపి ఇప్పుడు సర్కార్‌ ఖజానా నింపుకునేందుకు రూటు మార్చింది. ఒక్క ఈ జిల్లాలోనే గుర్తించిన పక్కా గృహాలకు సంబంధించి లబ్ధిదారుల నుంచి కనీసం రూ.100 కోట్లయినా వసూలు చేసి తీరాలని తేల్చేశారు. ఆ మేరకు రకరకాల ఒత్తిళ్లు బయట పడుతున్నాయి. ఉదాహరణకు గ్రామస్థాయిలో పక్కా గృహాలు పొందిన వారు కాని, ఆ ఇంటిని మరొకరు కొనుగోలు చేసి ఉన్నా, ప్రస్తుత గృహం ఎవరి స్వాధీనంలో ఉందో లెక్కలు కట్టి మరీ అక్కడకు బృందాలను పంపుతున్నారు. ఏదైనా ప్రభుత్వ పథకం అమలు చేసే ముందు లబ్ధిదారులను గుర్తించడం, వారికి కాస్త ఊరట కలిగించేలా చర్యలు తీసుకోవడం రివాజు. కాని జగనన్న సంపూర్ణ హక్కు పథకంలో మాత్రం పైనుంచి కింద వరకు ఒక్కటే ఒత్తిడి. కడతారా..? చస్తారా..? అనేదే సూత్రం. సంబంధిత శాఖల అధికారులు మాత్రం పైకి చెప్పకపోయినా లోపల మాత్రం తీవ్ర ఒత్తిళ్లకు గురవుతున్నారు. ఈ ఒక్క మన జిల్లాలోనే తొలి విడతగా 42 వేల గృహాలను గుర్తించి వారికి పట్టణ, పట్టణేతర ప్రాంతాలుగా విభజించి ఆ మేరకు రేటు కట్టి వసూలు చేయాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా గ్రామ, వార్డు సచివాలయాల వైపు దృష్టి పెట్టారు. ఆరు నూరైనా ఏ పరిస్థితిలోనూ బొక్కసం నిండేలా లక్ష్యాలు విధించారు. 

క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ ప్రత్యేక బృందాలు ఆ పనిలో పడ్డాయి. అధికారిక సమాచారం ప్రకారం ఇప్పటి వరకు మూడు వేల 616 మంది లబ్ధిదారులు హక్కు పథకాన్ని వినియోగించుకోవడానికి ముందుకు వచ్చారు. వీరిలో అత్యధికులు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే. వీరి నుంచి మూడున్నర కోట్లు వసూలు చేశారు. మరో 38 వేల లబ్ధిదారుల చుట్టూ తిరుగుతున్నారు. ‘మేం కట్టలేం మొర్రో’ అని ప్రాధేయపడుతున్నా.. ఎవరూ వినడం లేదు. దీనికితోడు ఎప్పుడో దీర్ఘకాలిక క్రితం పొందిన సెంటు, సెంటున్నర భూమి విలువ కాస్తా ఇప్పుడు లక్షల్లోకి చేరిందని, కేవలం పది వేలు కట్టడానికి వెనుకడుగు ఎందుకంటూ కొత్త సూత్రం ప్రారంభించారు. అదొక్కటే కాదండోయ్‌ అందరినీ ఒప్పించి మెప్పించి సర్కారు ఖజానాకు భారీ ఎత్తున చెల్లించేలా ఇంకో వ్యూహం ఉంది. ఇప్పుడు ఎవరైతే హక్కుపథకం కింద చెల్లిస్తారో ఆ భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్‌ పూర్తిచేస్తారు. ఆ వెను వెంటనే ఎలాంటి లింకు డాక్యుమెంట్లు లేకపోయినా కేవలం ప్రభుత్వం ఇచ్చిన రిజిస్ట్రేషన్‌తో బ్యాంకులు రుణం ఇస్తాయంటూ ఊదరగొడుతున్నారు. వాస్తవానికి బ్యాంకుల నిబంధనల ప్రకారం ఇప్పుడు సర్కారు వసూళ్లల్లో చేస్తున్న హామీలు ఎంత వరకు నిలుస్తాయనేది అనుమానమే. అయినప్పటికీ మీ స్థలం మీకు సొంతమవుతుంది, రుణాలు వస్తాయి, ఆ తరువాత అమ్ముకోవచ్చు అంటూ చెబుతున్నారు. 

బతిమలాడి.. భయపెట్టి

సంపూర్ణ గృహ హక్కు పథకం కింద అటో ఇటో తేల్చుకునేందుకు సర్కారు వేయని ఎత్తుగడ లేదు. లక్ష్యాలను అందుకోలేకపోతున్న గ్రామస్థాయి అధికారులకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చే దిశగా కదులుతోంది. ఇప్పటికే కొందరికి ఈ మేరకు షోకాజ్‌లు అందినట్టు సమాచారం. చేతిలో చిల్లిగవ్వలేక, కట్టే స్తోమత లేక పేదలు వెనుకంజ వేస్తుంటే అదేదో తమ తప్పుగా భావించి ప్రభుత్వం ఒత్తిళ్లకు దిగడం ఎంత వరకు సమంజసమని ఉద్యోగులే వాపోతున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ అనుకున్న లక్ష్యం మేర వంద కోట్లు వసూలు చేసే దిశగా లబ్ధిదారులకు రేషన్‌, పింఛన్‌, ఇతర సంక్షేమాలన్నీ కోల్పోతారంటూ మౌకికంగా ఎక్కడికక్కడ లబ్ధిదారులకు భయపెడుతున్నారు. కట్టారా సరేసరి.. లేకుంటే మీకే నష్టమంటూ ఇప్పటికే అందరి చెవిన వేశారు. దీనికితోడు ఏ రోజుకారోజు లక్ష్యాలను నిర్ణయించి బాధ్యులైన వారి మెడపై కత్తి పెట్టారు. వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ వ్యవహారం కాస్తా అటు లబ్ధిదారులకుు, ఇటు యంత్రాంగానికి అగ్ని పరీక్షగానే మారింది. ఎలాగూ తొలి దశలో మూడు కోట్లు బోణీ అయ్యాయి కాబట్టి మరో రూ.97 కోట్లు వసూలు చేసే దిశగా యంత్రాంగం ముప్పుతిప్పలు పడుతోంది. రానున్న రెండు నెలల్లో జాతరే.. జాతర.

కట్టలేం మహాప్రభో..

మొగల్తూరు, నవంబరు 28 : గృహ నిర్మాణ శాఖ నుంచి లబ్ధి పొంది సొంత ఇంటి కల నెరవేర్చుకున్న లబ్ధిదారుల నుంచి డబ్బు వసూలు చేసేందుకు అధికారులు ఇంటింటికీ తిరుగుతుంటే లబ్ధిదారులు డబ్బు కట్టలేమంటూ లబోదిబోమంటున్నారు. రామన్నపాలెం పంచాయతీలో డ్వాక్రా పొదుపు డబ్బు నుంచి జమ కట్టాలని లబ్ధిదారులను ఒత్తిడి చేయడంతో ఆయా కుటుంబాల మహిళలు ఆందోళన చెందుతున్నారు. డబ్బు కడితే మీ ఇంటికి రిజిష్ట్రేషన్‌ చేస్తామని, అప్పుడు మాత్రమే మీ ఇంటిపై మీకు హక్కు ఉంటుందని ఏకరువు పెడుతున్నారు. ఇలాంటి కరువు సమయంలో ఒకసారే రూ.10 వేలు ఎలా కట్టాలంటూ ప్రశ్నిస్తున్నారు. తమకు వాయిదాల పద్ధతి లేకుండా ఇప్పటికిప్పుడే వచ్చి పది వేలు చెల్లించకుంటే మా ఇల్లు స్వాధీనం చేసుకుంటారని అధికారులపై లబ్ధిదారులు ఎదురు తిరుగుతున్నారు. దీంతో ప్రజలకు నచ్చచెప్పలేకపోతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సామ, దాన, భేద దండోపాయాలు ఉపయోగించి రోజుకు, ఒకరో, ఇద్దరో జమ చేసేలా ఉన్నతాధికారులను సంతృప్తి పరిచేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 


 గతంలోనే కట్టేసినా.. మళ్లీ

1996–97లో ఇల్లు కట్టుకున్నా. లోను మొత్తం కట్టేశాను. ఇప్పుడు వలంటీరు వచ్చి ఇంటి రుణం రూ. 23,500 ఉందని, ఇప్పుడు రూ.10 వేలు కడితే బాకీ క్లియర్‌ అవుతుందని చెబుతు న్నారు. లోను కట్టేసిన అధి కారులకు రశీదులు చూపించా. అదేమీ కుదరదు రూ.10 వేలు కట్టాలంటున్నారు.  

సిద్దాని పార్వతీశం, రావిపాడు, పోడూరు 


డ్వాక్రా పొదుపు డబ్బులు కట్టేయమంటున్నారు

పదేళ్ల కిందట గృహ నిర్మాణశాఖ నుంచి తీసుకున్న లబ్ధికి ఇప్పటికిప్పుడు పది వేలు కట్టమంటున్నారు. మేం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. అయితే నేను ఉన్న డ్వాక్రా సంఘంలోని పొదుపు నుంచి రూ.10 వేలు తీసి జమ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. డ్వాక్రా గ్రూపులోని ఏ మహిళకు అవసరమైనా సరేతీయని గ్రూపు పొదుపును ఇప్పుడు ప్రభుత్వానికి అవసరమైతే తీసుకోవచ్చని చెబుతున్నారు.

– తోట సత్యవతి, బాధితురాలు

Updated Date - 2021-11-29T06:05:39+05:30 IST