వన్‌టైం.. వసూల్‌

ABN , First Publish Date - 2022-06-22T05:15:44+05:30 IST

‘జగనన్న సంపూర్ణ గృహహక్కు’ పథకం పేరిట రాష్ట్ర ప్రభుత్వం కిందటేడాది డిసెంబర్‌ 21న ఈ కార్యక్రమాన్ని అమలులోకి తెచ్చింది.

వన్‌టైం.. వసూల్‌

పేరుకే స్వచ్ఛందం.. కానీ ముక్కుపిండి మరీ గృహరుణాల వసూలు

ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత.. అయినా ఆగని వైనం

ఒత్తిళ్లకు తలొగ్గిన లబ్ధిదారులు

తొలివిడత కార్యక్రమం 90 శాతం పూర్తి


పిల్లకి చెలగాటం.. ఎలుకకు ప్రాణసంకటంగా మారిన వన్‌టైమ్‌ సెటిల్మెంటు పథకం తొలివిడత కార్యక్రమం తుదిదశకు చేరింది. ఒక్కసారిగా రుణాలు తాము చెల్లించలేమని గృహరుణ లబ్ధిదారులు గగ్గోలు పెట్టినా వినిపించుకోని ప్రభుత్వం, అధికార యంత్రాంగం బాధిత కుటుంబాల నుంచి ముక్కుపిండి మరీ వసూళ్లు చేపట్టారు. వన్‌టైమ్‌(ఒక్కసారి) అంటూనే వలంటీర్లు,  ఉద్యోగులు, అధికారులు గుంపులుగా అనేకమార్లు ఇళ్ల చుట్టూ తిరిగి ఒత్తిడి చేయడంతో గృహరుణ బాధితులు తలొగ్గక తప్పలేదు. ఈ పథకంపై ఎంత వ్యతిరేకత ఉన్నా, ఓటీఎస్‌ కట్టలేకున్నా చివరికి వారికి ఓటీఎస్‌ చెల్లించక తప్పలేదు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 90 శాతం మంది బాధితులు ఓటీఎస్‌ చెల్లించారంటే ఒత్తిడి ఎంత తీవ్రంగా ఉందో ఇట్టే తెలిసిపోతోంది.

 

గుంటూరు, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): ‘జగనన్న సంపూర్ణ గృహహక్కు’ పథకం పేరిట రాష్ట్ర ప్రభుత్వం కిందటేడాది డిసెంబర్‌ 21న ఈ కార్యక్రమాన్ని అమలులోకి తెచ్చింది. 1983 నుంచి 2011 ఆగస్టు 15 మధ్య ఇళ్ల కోసం రుణాలు తీసుకుని చెల్లించలేకపోయిన పేద, బలహీనవర్గాల లబ్ధిదారులను ప్రభుత్వం టార్గెట్‌ చేసింది. వీరి నుంచి ఎలాగైనా రుణాలను వసూలు చేసేందుకు ‘వన్‌టైమ్‌ సెటిల్మెంట్‌(ఓటీఎస్‌)’ను ముందుకు తెచ్చింది. గ్రామీణ ప్రాంతాల లబ్ధిదారులు రూ.10 వేలు, పట్టణ ప్రాంత లబ్ధిదారులు రూ.15వేలు, నగరపాలక సంస్థ లబ్దిదారులైతే రూ.20 వేలు చొప్పున వన్‌టైమ్‌ సెటిల్మెంట్‌ కింద చెల్లించాలని నిర్ణయించింది. అలా చెల్లించినవారికి ఇళ్లను రిజిస్ట్రేషన్‌ చేసి పట్టాలు ఇస్తామని చెప్పింది. అందుకోసం కిందటేడాది డిసెంబరు, ఈ ఏడాది జనవరి నెలలను గడువుగా నిర్ణయించింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో సుమారు 3.5 లక్షల మంది రుణగ్రస్థులని గుర్తించి తొలివిడత కార్యక్రమంలో భాగంగా వారిలోని 70 వేల మంది నుంచి ఓటీఎస్‌ సేకరించాలని నిర్ణయించింది. ఆర్థిక భారంతో కూడుకున్న వ్యవహారం కావడంతో బాధితుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రభుత్వం ప్రకటించిన తొలి రెండు నెలల్లో జిల్లాలోని 10 శాతం మంది కూడా ఓటీఎస్‌కు ముందుకు రాలేదు. అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఎదురు కావడంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగించేందుకు నిర్ణయించింది. 


స్వచ్ఛందం నుంచి నిర్బంధం దిశగా...

వన్‌టైమ్‌ సెటిల్మెంట్‌ పథకం స్వచ్ఛందమేనని ప్రభుత్వం పదే పదే చెబుతూ వచ్చినా ఆచరణలో మాత్రం పథకాన్ని నిర్బంధం చేసింది. విభజిత గుంటూరు జిల్లాలో లక్షా 22 వేల మంది రుణగ్రస్థులను గుర్తించిన ప్రభుత్వం తొలివిడతగా 18,368 మంది నుంచి రూ.10 కోట్లు ఓటీఎస్‌ వసూలు చేయాలని నిర్ణయించింది. పల్నాడు జిల్లాలో కూడా అదే సంఖ్యలో రుణగ్రస్థులను గుర్తించి తొలివిడత కింద వారిలోని 32,463 మంది నుంచి రూ.10.38 కోట్లు, చీరాలతో కలిసి ఏర్పాటైన బాపట్ల జిల్లాలో 29,208 మంది నుంచి రూ.14.32 కోట్లు వెరసి ఉమ్మడి జిల్లాలో రూ.34 కోట్లు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.


స్పందన కరువవడంతో..

ప్రజల నుంచి స్పందన కరువవడంతో ప్రభుత్వం రుణగ్రస్తులపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చింది. వలంటీర్‌ మొదలు మండలస్థాయి అధికారుల వరకూ వివిధ దశల్లో లబ్ధిదారులపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. పేరుకు ఒక్కసారి(వన్‌టైమ్‌) కార్యక్రమమే అయినా సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు బృందాలుగా ఏర్పడి పదులసార్లు లబ్ధిదారుల ఇళ్లపైబడి ఒత్తిడి తెచ్చారు. సంక్షేమ పథకాలు నిలిపేస్తామన్న బెదిరింపులతో చాలామందిని ఓటీఎస్‌కు తలొగ్గేలా చేశారు. డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళలకు అధికారులే రుణాలు ఇప్పించి వాటిని ఓటీఎస్‌ కింద జమ చేసుకుని ఓటీఎస్‌లోకి తెచ్చారు. ఇలా అనేక రూపాల్లో పేద, బలహీనవర్గాల రుణగ్రస్థుల నుంచి ప్రభుత్వం రుణాలు వసూలు చేసింది. వసూళ్లు జరగని చోట సచివాలయ ఉద్యోగులకు మెమోలు కూడా జారీ చేసిన ఘటనలు రాష్ట్రంలో అనేకం ఉన్నాయి. దీంతో ఒత్తిడి భరించలేని సచివాలయ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా రూ.82 కోట్లు విలువ చేసే తప్పుడు చలానాలు రూపొందించి ఊపిరి పీల్చుకున్నారు. మూడు జిల్లాల్లో అరవై రెండున్నర లక్షల రూపాయల విలువ చేసే 319 తప్పుడు చలానాలను అధికారుల సూచన మేరకు ఉద్యోగులు రూపొందించారు.


 90 శాతం పూర్తయిన వసూళ్లు

ఓటీఎస్‌ వసూళ్ల కోసం ఒత్తిడి తేవడంతోపాటు వాటిని జిల్లా అధికారులు నేరుగా పర్యవేక్షిస్తున్నారు. అందుకోసం ఆయా జిల్లాల గృహ నిర్మాణశాఖలో ప్రత్యేకంగా మానిటరింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేసి అనుక్షణం పరిశీలిస్తున్నారు. ఫలితంగా విభజిత గుంటూరు జిల్లాలో 88.94 శాతం మంది రుణాలు చెల్లించారు. 18,368 మందికిగానూ 15,971 మంది రుణాలు చెల్లించారు. వీరిలో 11,957 మందికి మాత్రమే ప్రభుత్వం ఇళ్లను రిజిస్టర్‌ చేసింది. 4,014 మందికి దస్త్రాలు సిద్ధమైనా రిజిస్ట్రేషన్‌ పూర్తికాలేదు. మరో 1987 మందికి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియే ప్రారంభం కాలేదు. కాగా పల్నాడు జిల్లాలో రూ.10.38 కోట్లకు గానూ రూ.9.68 కోట్లు వసూలు చేయగా, రూ.69.65 లక్షలు వసూలు చేయాల్సి ఉంది. బాపట్ల జిల్లాలో రూ.14.32 కోట్లకు రూ.13.76 కోట్లు వసూలు చేయగా, రూ.55.32 లక్షలు వసూలు చేయాల్సి ఉంది. 

 

Updated Date - 2022-06-22T05:15:44+05:30 IST