HYD : ఒకే పని మళ్లీ మళ్లీ.. నాడు ఎమ్మెల్యే.. నేడు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన..

ABN , First Publish Date - 2022-03-12T14:40:59+05:30 IST

ఒకే ప్రాజెక్టు.. రెండు పర్యాయాలు శంకుస్థాపన చేయడమేంటి అనుకుంటున్నారా..? ఘనత వహించిన జీహెచ్‌ఎంసీ అధికారులు, అంతకంటే ఎక్కువే అని చెప్పుకునే...

HYD : ఒకే పని మళ్లీ మళ్లీ.. నాడు ఎమ్మెల్యే..  నేడు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన..

  • ఇప్పటికే పురోగతిలో పనులు


ఒకే ప్రాజెక్టు.. రెండు పర్యాయాలు శంకుస్థాపన చేయడమేంటి అనుకుంటున్నారా..? ఘనత వహించిన జీహెచ్‌ఎంసీ అధికారులు, అంతకంటే ఎక్కువే అని చెప్పుకునే అధికార పార్టీ స్థానిక ప్రజాప్రతినిధుల నిర్వాకమిది. ఇప్పటికే పనులు మొదలైన ప్రాజెక్టుకు మరోసారి శంకుస్థాపన చేస్తూ టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు హడావిడి చేశారు.


డిసెంబర్‌ 22, 2021 : రామంతాపూర్‌లోని పెద్ద చెరువు నుంచి టీవీ కాలనీ మీదుగా మూసీ సర్‌ప్లస్‌ నాలా వరకు వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఎన్‌డీపీ)లో భాగంగా రూ.10.34 కోట్లతో నిర్మించ తలపెట్టిన వరద నీటి పైపులైన్‌/బాక్స్‌ డ్రైన్‌ పనులకు ఉప్పల్‌ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి, రామంతాపూర్‌ కార్పొరేటర్‌ చేతన హరీష్‌ శంకుస్థాపన చేశారు. పనులూ ప్రారంభమయ్యాయి.

- మార్చి 11, 2022 : అవే పనులకు మంత్రి కె.తారక రామారావు అదే ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డితో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు.


హైదరాబాద్‌ సిటీ : గ్రేటర్‌లో వరద ముంపునకు చెక్‌ పెట్టేందుకు ఎస్‌ఎన్‌డీపీకి జీహెచ్‌ఎంసీ శ్రీకారం చుట్టింది. రూ.858 కోట్లతో మొదటి విడత పనులు పలు ప్రాంతాల్లో మొదలయ్యాయి. రెండేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలతో రామంతాపూర్‌ పెద్ద చెరువు పరిసర కాలనీలు, బస్తీల నీట మునిగాయి. ఈ నేపథ్యంలో వరద సాఫీగా వెళ్లేందుకు వీలుగా 2000 ఎంఎం డయా సామర్థ్యంతో 1.4 కి.మీల మేర పైపులైన్‌, బాక్స్‌ డ్రైన్‌ నిర్మిస్తున్నారు. గతేడాది చివరలో శంకుస్థాపన జరిగిన పనులు నెల క్రితమే మొదలయ్యాయి. ఇదే పనులకు మరోసారి కేటీఆర్‌ శంకుస్థాపన చేయడం గమనార్హం. దీనిపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ’పబ్లిసిటీ స్టంట్‌లో భాగంగానే ఒకే పనికి రెండు, మూడు పర్యా యాలు శంకుస్థాపనలు చేస్తున్నారు.


ఏదో సినిమాలో..‘ మా చెల్లి పెళ్లి.. మళ్లీ.. మళ్లీ అన్నట్టుగా ఉంది’ అని బీజేపీ నాయకుడొకరు పేర్కొన్నారు. నగరంలో అభివృద్ధి పనులకు సంబంధించి తప్పనిసరిగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయాలని టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులకు ఉన్నత స్థాయి ఆదేశాలు అందాయని సమాచారం. సర్కారు ఏదో ఒకటి చేస్తుందనే భావన ప్రజల్లో కలిగేందుకు ఈ ఆదేశాలు అని తెలిసింది. కొన్ని రోజులుగా నగరంలోని వివిధ ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు స్వయంగా కేటీఆర్‌ హాజరవుతున్నారు.


అసెంబ్లీలో 80వేలకుపైగా ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రకటనతో టీఆర్‌ఎస్‌ దూకుడు పెంచింది. దీంతో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రారంభమైన పనులకూ శంకుస్థాపన చేశారేమో అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలోనే శంకుస్థాపన జరిగిన విషయం మంత్రికి తెలుసో.. లేదో కానీ.. అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా రెండో పర్యాయం శంకుస్థాపన చేయించారు. 



Updated Date - 2022-03-12T14:40:59+05:30 IST