‘ఒప్పో’లో కలిసిపోయిన ‘వన్‌ప్లస్’

ABN , First Publish Date - 2021-06-18T00:27:55+05:30 IST

చైనా ఎలక్ట్రానిక్ దిగ్గజాలు వన్‌ప్లస్, ఒప్పో ఒక్కటయ్యాయి. చాలాకాలం పాటు రెండు సంస్థలు కలిసి పనిచేసిన

‘ఒప్పో’లో కలిసిపోయిన ‘వన్‌ప్లస్’

న్యూఢిల్లీ: చైనా ఎలక్ట్రానిక్ దిగ్గజాలు వన్‌ప్లస్, ఒప్పో ఒక్కటయ్యాయి. చాలాకాలం పాటు రెండు సంస్థలు కలిసి పనిచేసిన తర్వాత విలీన నిర్ణయం తీసుకున్నాయి. మరింత మెరుగైన ఉత్పత్తులు తీసుకొచ్చే లక్ష్యంతో రెండు సంస్థలు విలీనమయ్యాయి. ఈ మేరకు వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో పెటె లా పేర్కొన్నారు. ఇకపై ఒప్పోతో కలిసి పనిచేయనున్నట్టు తెలిపారు. రెండు సంస్థలు ఒక్కటైనా వేర్వేరు బ్రాండ్లుగా స్వతంత్రంగానే పనిచేస్తాయని వివరించారు. ఇండియాతో సహా ఇతర మార్కెట్లలో ఒప్పో ఇటీవలే ‘వన్‌ప్లస్ నార్డ్ సీఈ’ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. అంతలోనే విలీన నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం.


ఒప్పోతో బలమైన ఏకీకరణ కారణంగా వినియోగదారులకు మరిన్ని మంచి ఉత్పత్తులు తీసుకొచ్చేందుకు అవసరమైన వనరులు సమకూరుతాయని పెటె లా పేర్కొన్నారు. ముఖ్యంగా వేగవంతమైన, మరింత సుస్థిర సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌లో మార్పులు సంభవిస్తాయన్నారు. వన్‌ప్లస్, ఒప్పో రెండూ గ్వాంగ్‌డాంగ్‌కు చెందిన కాంగ్లోమెరేట్ బీబీకే ఎలక్ట్రానిక్స్‌కు చెందినవే. దీనికి వివో, రియల్‌మి వంటి బ్రాండ్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఆరంభం నుంచే అంతర్గతంగా వనరులను ఒకదానితో ఒకటి పంచుకుంటున్నాయి. ఒప్పోలో గతంలో పనిచేసిన తన సహచరుడు కార్ల్ పీ‌తో కలిసి 2013లో లా వన్‌ప్లస్‌ను స్థాపించాడు.  

Updated Date - 2021-06-18T00:27:55+05:30 IST