తెలంగాణ మద్యం భారీగా పట్టివేత

ABN , First Publish Date - 2020-10-29T10:23:03+05:30 IST

తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న రూ.4లక్షల విలువైన మద్యంను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్‌ ఏసీ శ్రీనివాసచౌదరి తెలిపారు.

తెలంగాణ మద్యం భారీగా పట్టివేత

 ఐదుగురు అరెస్టు 

 రూ.4 లక్షల విలువైన మద్యం స్వాధీనం

ఎక్సైజ్‌ ఏసీ శ్రీనివాసచౌదరి వెల్లడి

ఒంగోలు(క్రైం), అక్టోబరు 28: తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న రూ.4లక్షల విలువైన మద్యంను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్‌ ఏసీ శ్రీనివాసచౌదరి తెలిపారు. అలాగే ఐదుగురిని నిందితులను స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు అరెస్టు చేసినట్లు వెల్లడించారు. బుధవారం ఒంగోలులోని ఎస్‌ఈబీ సర్కిల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాసచౌదరి వివరాలు వెల్లడించారు. బుధవారం తెల్లవారుజామున  ఒంగోలు మంగమూరురోడ్‌ జంక్షన్‌లో ఓ వ్యానులో తెలంగాణ మద్యం ఉన్నట్లు సమాచారం అందుకున్న ఎస్‌ఈబీ అధికారులు దాడి చేసి 252 మద్యం ఫుల్‌బాటిళ్లు, వ్యానును స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. అరెస్టు అయిన వారిలో ఒంగోలు కర్నూల్‌రోడ్డులో నవభారత్‌ బిల్డింగ్స్‌ వద్ద నివాసం ఉండే నలగపాటి నాగదుర్గారావు, బూచేపల్లి వెంకటరెడ్డి, మంగమూర్‌రోడ్‌లో నివాసం ఉండే గోనిశెట్టి వేణుగోపాల్‌, తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడకు చెందిన చిలిపిరి సైదారెడ్డి, వ్యాను డ్రైవర్‌ గొల్లా మల్లిఖార్జునరావు ఉన్నారు. ఇంకా సూత్రఽధారి దప్పిలి వెంకటరామిరెడ్డిని అరెస్టు చేయాల్సి ఉందన్నారు.


ఒంగోలుకు చెందిన ఆయన హైదరాబాద్‌లో నివాసం ఉంటూ మద్యం అక్రమ వ్యాపారం నడిపిస్తున్నాడని, అక్కడ వివిధ రకాల బ్రాండ్‌లు కొనుగోలు చేసి ఇక్కడకు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు వెల్లడించారు. అదేక్రమంలో బుధవారం  తెల్లవారుజామున వ్యానులో ఒంగోలుకు చిలిపిరెడ్డి సైదారెడ్డి, గొల్లా మల్లిఖార్జనరావులు మద్యం బ్యాక్సులను తెచ్చారు. వాటిని దించుకునేందుకు నాగ దుర్గారావు, వెంకటరెడ్డి, వేణుగోపాల్‌ వెళ్లారు. ఈక్రమంలోనే తమ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారని ఎక్సైజ్‌ ఏసీ శ్రీనివాసచౌదరి చెప్పారు. వారు గత 20 రోజులుగా ఈ వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్‌ఈబీ సూపరింటెండెంట్‌ వి.అరుణకుమారి, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.రమేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-10-29T10:23:03+05:30 IST