కొనసాగుతున్న ఇంటింటి సర్వే

May 8 2021 @ 22:38PM
ఇచ్చోడలో వివరాలు సేకరిస్తున్న సిబ్బంది

తలమడుగు, మే8: కరోనా వైరస్‌ను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఇంటింటి సర్వే మండలంలో మూడురోజులుగా కొనసాగుతుంది. మండలంలో దాదాపు 8వేల ఇళ్లు ఉండగా అధికారులు నియమించిన 42 గ్రూపులుగా ఏర్పడి ప్రతీ ఇంటింటిని సర్వే చేయగా దాదాపు 250 మందికి కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్నట్లు గుర్తించడం జరిగిందని మండల వైద్యాధికారి తెలిపారు. వ్యాధి లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వారికి మెడికల్‌ కిట్లను అందించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 45 సంవత్సరాలు నిండిన 3వేల మందికి టీ కా వేశామన్నారు. 

ఆదిలాబాద్‌లో 103 బృందాలతో సర్వే

ఆదిలాబాద్‌అర్బన్‌: కరోనా సర్వే ఇంటింటా చేస్తామని మున్సిపల్‌ చైర్మన్‌ జోగుప్రేమేందర్‌ అన్నారు. మున్సిపల్‌ పరిధిలో 103 టీమ్‌లు ఏర్పాటు చేశామన్నా రు. సర్వేలో మెప్మా, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు 3 టీమ్‌లుగా ఏర్పడి ఇంట్లో ఎవరికైనా కరోనా లక్షణాలు దగ్గు, జలుబు, జ్వరం ఉంటే కిట్స్‌ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. 45 సంవత్సరాలు పై బడిన వారు తప్పని సరిగా టీకా వేసుకోవాలని సూచించారు. ఈ సర్వే 5 రోజులు స్థానిక కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఆయా వార్డులో జరుగుతుందని పేర్కొన్నారు. పట్టణంలోని వార్డు నెంబర్‌ 33లో సర్వేను మున్సిపల్‌ చైర్మన్‌ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీలలో తిరుగుతూ ప్రజలకు కరోనా పట్ల అవగాహన కల్పించారు. కౌన్సిలర్‌ అజయ్‌, మున్సిపల్‌ సిబ్బంది, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సర్వేకు సహకరించాలి

ఇచ్చోడరూరల్‌: సర్వేకు సహకరించాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌ అన్నారు. మండలంలోని కామగిరి గ్రామంలో సర్వేను పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ భీంరావు, అంగన్‌వాడీ కార్యకర్త అమీదాబేగం పాల్గొన్నారు.

వివరాలు నమోదు చేయాలి

ఇచ్చోడ: ప్రతీ ఒక్క కుటుంబంలోని సభ్యుల వివరాలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఈవో నర్సారెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో  ఇంటింటి సర్వేను పరిశీలించారు. కొవిడ్‌ నిబంధనలు పాటించాలని తెలిపారు. కరోనా పాజిటివ్‌ వస్తే పదిరోజుల పాటు వారు ఎవరిని కలువకుండా ఉంటే త్వరగా వ్యాధి తగ్గి పోతుందన్నారు. గ్రామాల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చినట్లు తెలిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలన్నారు.

Follow Us on: