కొనసాగేనా నిఘా

ABN , First Publish Date - 2022-01-21T07:01:48+05:30 IST

వాహనాలు నడపడంలో డ్రైవర్‌ల అజాగ్రత వల్ల పలువురు అమాయకుల ప్రాణాలు బలవుతున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు.

కొనసాగేనా నిఘా
కడెంలో వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు

జిల్లా అంతటా పోలీసుల ముమ్మర తనిఖీలు

పలు వాహనాల సీజ్‌, జరిమానాల విధింపు

కంటితుడుపు చర్యలు కాకుండా నిరంతరం నిఘా పెట్టాలంటున్న ప్రజలు

ఆటోలు, టాటా మ్యాజిక్‌, ఇసుక ట్రాక్టర్‌లకు డ్రైవర్‌లుగా మారుతున్న మైనర్‌లు

రోడ్లపై మితిమీరిన వేగంతో దూసుకెళ్తున్న ఇసుక ట్రాక్టర్‌లు

అందుబాటులో లేని ఆర్టీసీ బస్సులు

గమ్యం చేరేందుకు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్న అమాయకులు

ఖానాపూర్‌, జనవరి 20 : వాహనాలు నడపడంలో డ్రైవర్‌ల అజాగ్రత వల్ల పలువురు అమాయకుల ప్రాణాలు బలవుతున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ మేరకు గురువారం జిల్లాలో ముమ్మరంగా వాహనాల తనిఖీ నిర్వహించారు. పలు ఆటోలను తనిఖీ చేసి సరైనపత్రాలు లేని 19 ఆటోలను సీజ్‌ చేశారు. కడెంలో ఎనిమిది, పెంబిలో మూడు, దస్తురాబాద్‌లో నాలుగు వాహనాలను సైతం సీజ్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా బుధవారం కడెం మండలంలోని పెద్దబెల్లాల్‌ సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందిన విషయం విధితమే... ఈ ప్రమాదానికి కారణం పూర్తిగా డ్రైవర్‌ నిర్లక్ష్యమేనని పోలీసులు చెబుతున్నారు. ఆటోవేగంగా వెళ్తున్న క్రమంలో హ్యాండిల్‌ మార్చుకునేందుకు డ్రైవర్‌, అతని మిత్రుడు       

చేసిన ఘోర తప్పిదానికి నాలుగు నిండు ప్రాణాలు బలి అయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీసుల నిఘా వాహనాలపై నిరంతరం కొనసాగాలని పలువురు కోరుతున్నారు. కేవలం ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే కాకుండా ప్పటికప్పుడు అర్హత లేని డ్రైవర్‌ల గుర్తింపు, ఫిట్‌నేస్‌ లేని వాహనాలపై ఇటు పోలీసులు, అటు రవాణాధికారులు దృష్టి సారిస్తే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు. 

డ్రైవర్‌లుగా మారుతున్న మైనర్‌లు

ఖానాపూర్‌, కడెం, పెంబి, దస్తూరాబాద్‌ మండలాలలో మైనర్‌ బాలురు ఎక్కువగా ప్యాసింజర్‌ ఆటోలను నడుపుతున్నారని పలువురు చెబుతున్నారు. అయినప్పటికీ చర్యలు చేపట్టాల్సిన సంబంధిత శాఖాధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించారని వారు కఠినంగా వ్యవహరించిన చర్యలు చేపట్టి ఉంటే ఇంత అనర్థం జరిగేది కాదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్యాసింజర్‌  ఆటోలలో, టాటామ్యాజిక్‌లు, ఇసుక ట్రాక్టర్‌లకు మైనర్‌ బాలురు, డ్రైవింగ్‌ లైసెన్స్‌లు లేని వారే డ్రైవర్‌లుగా పని చేస్తున్నారని చెబుతున్నారు. ఇలాంటి వారు ఇష్టారీతిన వాహనాలు నడపుతూ పరిణామాలు తెలియక ప్రమాదాలు అంచనా కట్టడంలో చేస్తున్న తప్పిందాలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.  లేదా ఇతరులకు ప్రాణాపాయం కల్గిస్తున్నారు. వాహనాలు నడపడంతో డబ్బు సమకూరడంతో మద్యం, గుట్కా, గంజాయి వంటి వ్యసనాలకు బానిసలవుతున్నారు. ప్రమాదాల్లో నిండుప్రాణాలు బలిఅయ్యి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని పలువురు చెబుతున్నారు. కేవలం ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే కంటితుడుపు చర్యలు కాకుండా నిరంతర నిఘా ఏర్పాటు చేసి కఠినచర్యలు చేపడితే తప్ప ఇటువంటి ముప్పులను అరికట్టలేమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్యాసింజర్‌ ఆటోలకు యూనియన్‌లు ఏర్పాటు చేసుకుని ఆ యూనియన్‌లకు అధికార పార్టీ నాయకులతో మంచి సంబంధాలున్న వారిని అధ్యక్షులుగా ఎన్నుకుని నెలనెలా అధికారులకు మాముళ్లు అందజేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్యాసింజర్‌ ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్న అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక మీదటనైనా ఖానాపూర్‌, కడెం ఉమ్మడి మండలాల్లో నిరంతరం తిరిగే బైక్‌లు, ప్యాసింజర్‌ ఆటోలు, టాటామ్యాజిక్‌లు, ఇసుక ట్రాక్టర్‌లపై ప్రత్యేకనిఘా ఏర్పాటు చేయాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు. 

రోడ్డుపై మితిమీరిన వేగంతో ఇసుకట్రాక్టర్‌లు

గతంలోనూ ఖానాపూర్‌ ప్రాంతంలో పలు ఇసుక ట్రాక్టర్‌లకు మైనర్‌లు డ్రైవర్‌లుగా వ్యవహరించడంతో ప్రమాదాలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఇసుక మాఫీయా అధికారులకు నెలనెలా మామూళ్లు ముట్టజెపుతూ మైనర్‌ డ్రైవర్‌లతో కాలం వెల్లదీస్తున్నారు. చేసేది అక్రమ దందా ఏ వైపు నుండి ఎవ్వరు వస్తారోననే తొందరలో ట్రాక్టర్‌లను అతి వేగంగా నడుపుతూ చుట్టుపక్కల పల్లెల నుండి ఖానాపూర్‌ వైపు వచ్చే ట్రాక్టర్‌లతో నిత్యం రోడ్లపై తిరిగే ఇతర వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఓవైపు ప్రకృతివనరులను కొల్లగొట్టడమే కాకుండా మరోవైపు రోడ్డుపై వాహనాలను ఇష్టారీతిన నడిపై ఈ ఇసుక మాఫియాపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారిస్తే మంచిదని స్థానికులు కోరుతున్నారు. 

ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడమే..

ఖానాపూర్‌, కడెం ఉమ్మడి మండలాలలో పలు మారుమూల గ్రామాలున్నాయి. ఈ గ్రామాలకు ఆర్టీసి బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు నిరంతరం తమ తమ గ్రామాల నుండి రాకపోకలు సాగించేందుకు కేవలం ప్రైవేటు వాహనాలను మాత్రమే ఆశ్రయించక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకునే వరకు ఆటోలో, టాటామ్యాజిక్‌లు కదులడం లేదని ప్రజలు చెబుతున్నారు. దీనికి తోడు రోడ్లు సరిగా లేకపోవడం రోడ్లు గుంతలమయంగా ఉండడం, అత్యదిక మూలమలుపులు ఉండడం కూడా రోడ్డు ప్రమాదాలకు ప్రదాన కారణంగా మారుతుందని పలువురు వాహనదారులు చెబుతున్నారు. బుదవారం రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతంలో సుమారు అర కిలోమీటర్‌ దూరం విపరీతమైన మూల మలుపులున్నాయి. స్పీడు బ్రేకర్‌లుగాని ప్రమాద సూచికలు లేక ప్రమాదాలు జరుగుతున్నాయి. 

Updated Date - 2022-01-21T07:01:48+05:30 IST