క్వారంటైనా..జైలా! పట్టించుకునే నాథుడే కరువు..!

ABN , First Publish Date - 2020-07-14T18:10:41+05:30 IST

క్వారంటైన్‌కేంద్రాలు బాధితులకు చుక్కలుచూపెడుతున్నాయి...

క్వారంటైనా..జైలా! పట్టించుకునే నాథుడే కరువు..!

ఒంగోలు క్వారంటైన్‌ సెంటర్లలో ఆకలి కేకలు

బయటకెళ్ళేందుకు యత్నించిన బాధితులు 

అడ్డుకున్న సిబ్బంది, అధికారులు

కనీస సౌకర్యాలు లేకపోవడంపై నిరసన 

బాధితులతో మాట్లాడిన ఒంగోలు ఆర్డీఓ 


ఒంగోలు(ఆంధ్రజ్యోతి): క్వారంటైన్‌కేంద్రాలు బాధితులకు చుక్కలుచూపెడుతున్నాయి. ఇక్కడి పరిస్థితి చూస్తే క్వారంటైన్‌ కంటే జైలు నయం అంటూ వారు వాపోతున్నారు. ఉడికీ ఉడకని అన్నం.., నీళ్ళ పప్పుచారు. వేళ కాని వేళలో ఆహారం పంపిణీ.. ఇవీ గత కొన్నిరోజులుగా క్వారంటైన్‌ సెంటర్లలో కొవిడ్‌ బాధితుల దుస్థితి. కరోనా వైరస్‌ సంగతి దేవుడెరుగూ కడుపునిండా తిండి కూడా దొరకని దయనీయ పరిస్థితి ఉందని ట్రిపుల్‌ఐటీలో బాధితులు బోరుమంటున్నారు. తమ గోడు పట్టించుకోకపోవడంపై సోమవారం ఆందోళనకు దిగారు. వివరాల్లోకెళితే..


ఇటీవలికాలంలో కరోనా అనుమానిత లక్షణాల కలిగిన వందలమందిని ఒంగోలులోని క్వారంటైన్‌ సెంటర్లకు తీసుకొచ్చారు. రోజురోజుకు బాధితుల సంఖ్య పెరుగుతోంది. వచ్చి వారం పదిరోజులైనా వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయకపోగా, కనీసం ఆకలిబాధలు కూడా పట్టించుకోవడం లేదంటూ అక్కడి వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఒంగోలులోని పలు క్వారంటైన్‌ సెంటర్లలో ఉంటున్న బాధితులు బయటకు వెళ్ళే ప్రయత్నం చేయగా, సిబ్బంది అడ్డుకున్నారు. ఈక్రమంలో బాధితులు వాగ్వాదానికి దిగారు. తమను తీసుకొచ్చి వారం, పదిరోజులు అవుతున్నా కనీసం పట్టించుకున్న నాథుడే కరువయ్యాడని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీసం శాంపిల్స్‌ అయినా తీస్తే రిపోర్టులు వచ్చేవరకు ఎదురు చూడొచ్చు... అనుమానితుల పేరుతో తీసుకొచ్చి, రూముల్లో నెట్టి చేతులు దులుపుకొంటున్న అధికారుల తీరుపై వారు మండిపడ్డారు.


రిపోర్టులు వచ్చిన తర్వాత నెగిటివ్‌ వచ్చినా ఇళ్ళకు పంపకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తమను ఇంటికి పంపిస్తే తమ బాధలేవో తాము పడతామని, పిల్లలు, పెద్దలు ఆకలితో చచ్చిపోయేలా ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు మహిళలు మాట్లాడుతూ తమకు పెడుతున్న భోజనం పశువుల దాణాగా కూడా వేయరని, వరద బాధితులను తీసుకొచ్చినట్లు తీసుకొచ్చిన అధికారులు తమ పని అయిపోయిందంటూ చేతులు దులుపుకోవడం దారుణమన్నారు. బయట ప్రజలకు మాత్రం క్వారంటైన్‌ కేంద్రాల్లో నాణ్యమైన భోజనం పెడుతున్నామని ప్రగల్బాలు పలుకుతున్నారని, ఇక్కడి వాస్తవ పరిస్థితి చూస్తే మనుషులు తినే తిండిలా లేదంటూ కన్నీరుమున్నీరు అవుతున్నారు. అక్కడ అందిస్తున్న ఆహారం తిని చిన్నపిల్లలకు వాంతులు, జ్వరాలు వస్తున్నాయని, వాపోయారు. వైద్యుడు లేడు. బాగోగులు చూసేవారు లేరు అంటూ బాధితులు బోరుమంటున్నారు.


సోమవారం ఉదయం 11గంటలకు కూడా టిఫిన్‌ అందించకపోడంతో ఇక ఆకలికి తట్టుకోలేక తాము తమ ఇళ్ళకు వెళ్ళే ప్రయత్నం చేయక తప్పలేదని తెలిపారు.  విషయం తెలుసుకున్న ఒంగోలు ఆర్డీఓ ప్రభాకర్‌రెడ్డి క్వారంటైన్‌ సెంటర్లకు వెళ్ళి బాధితులతో మాట్లాడారు. సమస్యలు పరిష్కరిస్తామని, నాణ్యమైన భోజనం అందిస్తామని, ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికపుడు పరీక్షలు జరుపుతామని హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు. 


Updated Date - 2020-07-14T18:10:41+05:30 IST