ఒంగోలు టు చెన్నై.. హవాలా

ABN , First Publish Date - 2022-06-25T06:04:20+05:30 IST

ఒంగోలు కేంద్రంగా హవా లా వ్యాపారం జోరుగా నడుస్తోంది. అందులో బంగారం వ్యాపారం అగ్రస్థానంలో ఉంది. శుక్రవారం చెన్నై సమీ పంలో పట్టుబడిన జిల్లాకు చెందిన ఇరువురు వ్యక్తులు బంగారం వ్యాపారంతో సంబంధాలు ఉన్న వారు కావడం చర్చనీయాంశమైంది.

ఒంగోలు టు చెన్నై.. హవాలా

విచ్చలవిడిగా జీరో వ్యాపారం

అగ్రభాగం బంగారానిదే

ఇప్పటికి రెండు పర్యాయాలు  పట్టుబడింది ఆ వ్యాపారులే

దొరకకుండా నడుస్తున్నదెంతో!

నెలకు వంద కోట్లకుపైగా కొనుగోళ్లు 

 ఒంగోలు(క్రైం) జూన్‌ 24: ఒంగోలు కేంద్రంగా హవా లా వ్యాపారం జోరుగా నడుస్తోంది. అందులో  బంగారం వ్యాపారం అగ్రస్థానంలో ఉంది. శుక్రవారం చెన్నై సమీ పంలో పట్టుబడిన జిల్లాకు చెందిన ఇరువురు వ్యక్తులు బంగారం వ్యాపారంతో సంబంధాలు ఉన్న వారు కావడం చర్చనీయాంశమైంది. చెన్నైలో బంగారాన్ని ఎలాంటి బిల్లు లు లేకుండా కొనుగోలు చేసి ఇక్కడ జీరో వ్యాపారంతో కోట్లు గడిస్తున్నారు బంగారం వ్యాపారులు. విజయవాడ, గుంటూరు, నెల్లూరుకు చెందిన వారు కూడా ఒంగోలు కేంద్రంగా నడిచే హవాలా ద్వారానే వ్యవహారం నడుపుతున్నట్లు తెలుస్తోంది. చెన్నై మార్కెట్‌లో బంగారం కడ్డీలు కిలోల లెక్కన కొనుగోలు చేసి ఇక్కడ వ్యాపారులు తమకు కావాల్సిన సైజులో, ఇతర వస్తువు లు తయారుచేసి విక్రయిస్తారు. ఈ నేపథ్యంలో ఒంగోలు లో జీరో వ్యాపారం జోరుగా సాగుతోంది. రెండేళ్ల క్రితం  ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఉన్న కారు ఒంగోలు నుంచి వెళుతుండ గా చెన్నై సమీపంలో పోలీసులు ఆపి తనిఖీ చేశారు. అందులో సుమారు రూ.5.5కోట్ల నగదుతో బంగారు వ్యాపారులు పట్టుబడ్డారు. అప్పట్లో అది రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. అయితే అప్పట్లో స్థానికంగా కీలకమైన ఓ నేత పేరు బయకొచ్చింది. పైగా పట్టుబడిన బంగారం వ్యాపారి అధికారపార్టీలో చురుకైన నాయకుడు కావడంతో అప్పట్లో మంత్రి ఆ హవాలా నగదుతో తనకు సంబంధం లేదు అని మీడియా ముఖంగా చెప్పుకోవాల్సి వచ్చింది. 


రెండ్రోజుల క్రితం చెన్నైలో పట్టుబడిన  ఇద్దరు

రెండు రోజుల క్రితం చెన్నైలో హార్బర్‌ ఏసీపీ ఆఽధ్వర్యంలో తనిఖీలు చేస్తూ అనుమానాస్పదంగా ఉన్న కారును స్వాధీనం చేసుకున్నారు. అందులో రూ.2కోట్ల నగదు దొరికింది. అందుకు సంబంధించి ఎలాంటి బిల్లులు లేవు. అయితే కారులో పట్టుబడిన ఇద్దరూ ఒంగోలుకు చెందిన వారు కావడం మరోసారి చర్చనీయాంశమైంది. పట్టుబడిన వారిలో ఒంగోలు దక్షిణ బజారుకు చెందిన జయశంకర్‌, కేశవస్వామిపేటకు చెందిన నారాయణ  ఉన్నారు. వీరిద్దరూ గతంలో బంగారం వ్యాపారం చేశా రు. దీంతో ఆ నగదు కూడా బంగారం కొనుగోలు కోసం తీసుకెళ్లిందేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు రేషన్‌ బియ్యానికి సంబంధించి కూడా జిల్లా కు హవాలా రూపంలో నగదు వస్తున్నట్లు తెలుస్తోంది.


నిబంధనలు తూచ్‌!

బంగారం బిస్కెట్లు బ్యాంక్‌ లావాదేవీల ద్వారానే కొను గోలు చేయాలి. ప్రభుత్వానికి పన్నులు చెల్లించి వ్యాపారం చేసుకోవచ్చు. బంగారం వ్యాపారులు రూ.1.99లక్షలకు మాత్రమే నగదు తీసుకునే అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువైతే బ్యాంక్‌ లావాదేవీలు చేయాలి. అయితే ఇప్పుడు ఎక్కువమంది వ్యాపారులు నగదు తీసుకుని అందుకు సంబంధించి డూప్లికేట్‌ బిల్లులు ఇవ్వడం  పరిపాటైంది. ఒంగోలు నుంచి ఇతర ప్రాంతాల వారు బంగారం కొనుగోలు చేసుకొని అవసరం మేరకు తీసుకెళ్లి అక్కడ వస్తువులు తయారు చేసుకుంటున్నారు. 


నెలకు రూ.100 కోట్లకు పైగా జీరో వ్యాపారం

ఒంగోలులో నెలకు రూ.100 కోట్లకుపైగా బంగారం వ్యాపారం జీరోలో జరుగుతుందని అంచనా. ఇక్కడి నుంచే జిల్లాలోని మిగతా ప్రాంతాలతోపాటు విజయవాడ, నెల్లూరు, గుంటూరు కూడా వెళుతున్నదని ప్రచారం ఉంది. కిలో బంగారం ధర ప్రస్తుతం రూ.52లక్షలు ఉండగా ఇలా జీరోలో కేవలం రూ.42లక్షలకు దొరుకుతుంది. అంటే సుమారుగా ఐదు కిలోల బంగారం బిల్లులు లేకుండా కొనుగోలు చేసి విక్రయిస్తే రూ.50లక్షల ఆదాయం వస్తుంది. దీంతో కొంతమంది వ్యాపారులు ప్రజాప్రతినిధుల అండతో సులభంగా నగదు సంపాదించే మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ మేరకు ఒంగోలు కేంద్రంగా నెలలో రూ.100కోట్లకు పైగా బంగారం జీరో వ్యాపారం జరుగుతోంది. కడ్డీల రూపంలో తీసుకొచ్చి ఇక్కడ ఉన్న కార్ఖానాల్లో కరిగించి 100, 200, 500గ్రాములతోపాటు అవసర మైన వస్తువులు తయారుచేయించి ఇవ్వడం గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నట్లు సమాచారం.


జిల్లా కేంద్రంగా

హవాలా డబ్బు ఒంగోలు కేంద్రంగా జరుగుతుందని ఇటీవల జరిగిన ఘటనలు రుజువు చేస్తున్నాయి. ఇప్పటికీ చెన్నై పోలీసులకు అధికమొత్తంతో పట్టుబడింది ఒంగోలు వారు కావడం గమనార్హం. అంతేకాదు వారంతా బంగారం కొనుగోలు కోసం నగదు తీసుకెళ్తూ పట్టుబడ్డ వారు. అధికారపార్టీ నాయకుడు ఇలాంటి బంగారం వ్యాపారానికి తెరలేపి బాగా సంపాదించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. కాగా ఆ వ్యాపారంలోకి మరికొందరు కూడా దిగినట్లు తెలుస్తోంది.  కాగా ఇటీవల పెద్దదోర్నాల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కూడా ఇలాగే హవాలా డబ్బు దోపిడీ కేసు నమోదైంది. అధికమొత్తంలో కారులో నగదు తీసుకొస్తుంటే గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించి నగదు అపహరించుకెళ్ళారు. ఇవి వెలుగుచూసిన కొన్ని ఘటనలే. ఇంకా బయటపడకుండా సాగుతున్నవి అనేకం ఉన్నాయనే విషయం పోలీసులకెరుక.


Updated Date - 2022-06-25T06:04:20+05:30 IST