ఒంగోలులో తాగునీటికి కటకట

ABN , First Publish Date - 2021-01-04T05:02:53+05:30 IST

ఒంగోలులో తాగునీ టికి కటకట ఏర్పడింది. పైపులైన్‌ల మరమ్మతుల కారణంగా అనేక కాలనీలకు వారం రోజులుగా సరఫరా నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగర పాలక సంస్థ అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ అవి కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. మిగిలిన కాలనీల వారి అవస్థలు వర్ణణాతీతమయ్యాయి.

ఒంగోలులో తాగునీటికి కటకట
మామిడిపాలెం వద్ద పైపులైన్‌ మరమ్మతులు చేస్తున్న కార్పొరేషన్‌ సిబ్బంది

వారం రోజులుగా 

పలు కాలనీలకు సరఫరా బంద్‌

పూర్తికాని పైపులైను పనులు 

అవస్థలు పడుతున్న ప్రజలు 

ఒంగోలు (కార్పొరేషన్‌), జనవరి 3 : ఒంగోలులో తాగునీ టికి కటకట ఏర్పడింది. పైపులైన్‌ల మరమ్మతుల కారణంగా అనేక కాలనీలకు వారం రోజులుగా సరఫరా నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగర పాలక సంస్థ అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ అవి కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. మిగిలిన కాలనీల వారి అవస్థలు వర్ణణాతీతమయ్యాయి. 


20కిపైగా కాలనీలకు వారం రోజులుగా సరఫరా బంద్‌ 

నగరంలోని రెండో సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు వద్ద పైపులైను మార్చుతున్న క్రమంలో గాంధీనగర్‌, వడ్డివానికుంట, శివాజీ నగర్‌, మిలటరీ కాలనీ, జడ్పీ కాలనీ, కొప్పోలు, ఇందిరమ్మ కాలనీ, రాజీవ్‌ గృహకల్ప, పులి వెంకటరెడ్డి కాలనీ, గుర్రం జాషువా కాలనీ, జయప్రకాష్‌ కాలనీలతోపాటు, మరో సుమారు ఇరవైకి పైగా కాలనీల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పనులు సకాలంలో పూర్తికాకపోవడంతో ఆయా కాలనీలకు వారం రోజులుగా సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పనులను వెంటనే పూర్తి చేసి నీటి సరఫరా పునరుద్ధరించాలని కోరుతున్నారు. 


ఏళ్లనాటి పైపులైన్‌లతో సమస్య

 నగరంలో అధిక శాతం ఏళ్లనాటి పైపులైనులు ఉన్నాయి. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో భారీ లీకులు ఏర్పడుతున్నాయి. మరోవైపు నీటి సరఫరా కోసం సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులు, ఫిల్టర్‌ బెడ్‌ల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు పదేపదే మొరాయిస్తున్నాయి. దీంతో నగరంలో నిత్యం ఏదో ఒక కాలనీలో నీటి సమస్య తలెత్తుతోంది. సగం ప్రాంతాలకు సరఫరా జరుగుతుందో తెలియక ప్రజలు అవస్థలు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పగటి వేళ నీటి సరఫరా చేసినా, నిర్ధిష్టమైన సమయం లేకపోవడంతో ఉద్యోగులు, రోజువారీ కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండగా అర్ధరాత్రి సరఫరా జరిగే ప్రాంతాల వాసులకు కంటి మీద కునుకు కరువైపోతోంది. ఇలా  నగర ప్రజలు నిరంతరం తాగునీటి కోసం నానాఅగచాట్లు పడుతున్నారు. 


Updated Date - 2021-01-04T05:02:53+05:30 IST