ఉల్లి రైతు కన్నీరు

ABN , First Publish Date - 2021-11-28T05:45:28+05:30 IST

ఉల్లి రైతుకు కన్నీరు మిగులుతోంది. చేతికొచ్చిన పంటలకు వర్షాల కారణంగా తెగుళ్లు సోకడంతో ఆవేదన చెందుతున్నారు.

ఉల్లి రైతు కన్నీరు
మద్దికెర: ఎం.అగ్రహారంలో పడేసిన ఉల్లి దిగుబడి

పత్తికొండ/మద్దికెర/తుగ్గలి, నవంబరు 27: ఉల్లి రైతుకు కన్నీరు మిగులుతోంది. చేతికొచ్చిన పంటలకు వర్షాల కారణంగా తెగుళ్లు సోకడంతో ఆవేదన చెందుతున్నారు. కొందరు రైతులు పంటలను వదిలేస్తుండగా, మరికొందరు దిగుబడిని పారబోస్తున్నారు. 


పత్తికొండ మండలంలో..


పత్తికొండ మండలంలో మూడు వేల ఎకరాలలో ఉల్లి సాగు కాగా, ఒక్క హోసూరు గ్రామంలోనే రెండు వేల ఎకరాల్లో సాగు చేశారు. తుపాన్‌ ధాటికి  పంట కుళ్లిపోయి అమ్మకానికి పనికి రాకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. ఎకరాకు రూ.50మే దాకా పెట్టుబడులు పెట్టామని చెబుతున్నారు.


మద్దికెర మండలంలో..


మద్దికెర, ఎం.అగ్రహారం, బురుజుల గ్రామాల్లో ఎక్కువగా ఉల్లి సాగు చేశారు. వర్షాధార పంటలు సాగు చేసిన రైతులు ఎకరాకు రూ.25వేలు, వ్యవసాయ తోటలో సాగు చేసిన రైతులు రూ.50వేలకు పైగా ఖర్చు పెట్టారు. దిగుబడి బాగానే ఉందని, పెట్టుబడులు వచ్చి అంతో ఇంతో చేతికి వస్తుందని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. కాగా అధికారులు పంటలను పరిశీలించి నివేదికలు తయారు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.


తుగ్గలి మండలంలో..


తుగ్గలి, రాతన, ఎద్దులదొడ్డి తదితర గ్రామాల్లో 563 ఎకరాల్లో ఉల్లి సాగు చేశారు. దిగుబడిలో సగానికి పైగా కుళ్లి పోయింది. ఉల్లి పంట కోత కోసి కుళ్లిన ఉల్లిని ఏరివేయడానికే అధిక కూలీలు వెచ్చించాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  


రైతు గోడు పట్టదా?: కేఈ శ్యాంబాబు 


పత్తికొండ: రై తుల గోడు ప్రభుత్వానికి పట్టదా? అని టీడీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి కేఈ శ్యాంబాబు ప్రశ్నించారు. శనివారం పత్తికొండ మండలంలోని హోసూరు సమీపంలో దెబ్బతిన శనగ, ఉల్లి పంటలను పరిశీలించి నష్టం గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి విపత్తు సమయంలో టీడీపీ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు పంట నష్ట పరిహారంతోపాటు ఇన్‌పుట్‌ సబ్సిడీలను ఇచ్చేదని గుర్తుచేశారు. పత్తికొండ నియోజకవర్గ పరిధిలో వేల ఎకరాలలో ఉల్లి, శనగ, వేరుశనగ పంటలు నష్టపోయి రైతులు విలవిలలాడుతున్నారన్నారు. పంట చేతికి వచ్చే సమయంలో భారీ వర్షాలకు ఉల్లి పంట పొలంలోనే కుళ్లిపోయిందని, శనగ పంటది కూడా అదే పరిస్థితి అన్నారు. ఇంత జరిగినా అధికారులు, నాయకులు, పంటలను పరిశీలించి రైతులకు భరోసా అందించకపోవడం దారుణమన్నారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30వేల నుంచి రూ.50వేల దాకా పరిహారం అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. హోసూరు మాజీ సర్పంచ్‌ వాకిటి శీను. మద్దికెర మండల కన్వీనర్‌ ధనుంజయుడు, సోమ్లానాయక్‌, రవీంద్రనాయక్‌, హోసూరు నాయకులు రాఘవేంద్ర, సీపీఐ నాయకుడు హనుమన్న ఉన్నారు.


 నివేదికలు పంపాం 

రబీలో సాగు చేసిన పప్పుశనగ పంట 4,900 హెక్టార్లలో పూర్తిగా కుళ్లి ఎండిపోయిందని నివేదికలు పంపాం. అలాగే మండలంలో వర్షాధారం, వ్యవసాయ తోటలలో సాగు చేసిన ఉల్లి పంట కూడా కుళ్లు తెగుళ్లతో దెబ్బతినిందని నివేదికలు తయారు చేసి పంపాం.

- హేమలత, ఏవో, మద్దికెర


పంట మీద మాత్రమే నష్ట పరిహారం వర్తిస్తుంది

పంట మీద మాత్రమే నష్టపరిహారం నివేదికలు పంపవచ్చు. పంట కోసిన తర్వాత పరిహారం వర్తించదు. పంటలను పరిశీలించాం. నివేదికలు పంపిస్తాం.

- అనూష, హార్టికల్చర్‌ ఏవో, తుగ్గలి


 నివేదికలు సిద్ధం చేస్తున్నాం

 సబ్‌డివిజన్‌లో పది వేల ఎకరాలలో ఉల్లి సాగు చేశారు. కోత కోసే సమయంలో వర్షాలు కురవడంతో మూడు వేల ఎకరాల దాకా పంట నేలలోనే కుళ్లిపోయింది. మిగిలిన 7వేల ఎకరాలలో కోత కోసినా ఉపయోగపడే పరిస్థితి లేదు. నివేదికలు సిద్ధం చేస్తున్నాం.

- మహమ్మద్‌ఖాద్రీ, ఏడీఏ 


మేతకు వదిలేశా

ఐదెకరాలు కౌలుకు తీసుకొని ఉల్లి సాగు చేశా. పెట్టుబడి రూ.2 లక్షలతోపాటు కౌలు ఎకరాకు రూ.20 వేలు చొప్పున రూ.లక్ష ఖర్చు పెట్టా. కొద్ది రోజుల క్రితం వర్షాలకు ముందు పంట కోశాం. ఆగకుండా వర్షాలు రావడంతో పంట పొలంలోనే కుళ్లిపోయింది. పశువులకు మేతగా వదిలేశాను.

- నరసన్న, హోసూరు, పత్తికొండ మండలం


రూ.2 లక్షలు నష్టపోయా

వ్యవసాయ తోటలో రెండున్నర ఎకరాలకు పైగా ఉల్లి సాగు చేశా.  పంట చేతికి వచ్చే సమయంలో కుళ్లు తెగులు రావడంతో పొలాల్లోనే వదిలేశా. రూ.2 లక్షలు నష్టపోయా.

- పక్కీరప్ప, ఎం.అగ్రహారం, మద్దికెర మండలం 


 ఎకరాకు రూ.30 వేలు పెట్టుబడి పెట్టా..

నాకున్న మూడు ఎకరాల పొలంలో ఉల్లి సాగు చేయడం కోసం ఎకరాకు రూ.30వేలు పెట్టుబడి పెట్టా. కోత కూలీలు కూడా రావు. ఇలా అయితే వ్యవసాయం భారమై వలసలు వెళ్లాల్సి వస్తుంది. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి.

- రాముడు, రాతన, తుగ్గలి మండలం



Updated Date - 2021-11-28T05:45:28+05:30 IST