ఘాటెక్కిన ఉల్లి

ABN , First Publish Date - 2021-10-18T05:49:50+05:30 IST

ఉల్లి ధర ఘాటెక్కింది. వారం వ్యవధిలోనే రెట్టింపునకు పైగా పెరిగింది. ఇతర రాష్ట్రాల్లో ఉల్లి పంట దెబ్బతినడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

ఘాటెక్కిన ఉల్లి

  • కిలో రూ.50
  • వారంలోనే రెట్టింపు
  • మరింత పెరిగే అవకాశం

పిఠాపురం/గొల్లప్రోలు, అక్టోబరు 17: ఉల్లి ధర ఘాటెక్కింది. వారం వ్యవధిలోనే రెట్టింపునకు పైగా పెరిగింది. ఇతర రాష్ట్రాల్లో ఉల్లి పంట దెబ్బతినడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. కొంతకాలంగా స్థిరంగా ఉన్న ఉల్లిపాయల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, కర్నాటక తదితర రాష్ట్రాల నుంచి ఉల్లిపాయలు ఎక్కువగా రాష్ట్రానికి వస్తూంటాయి. గత కొన్ని నెలలుగా ఉల్లి ధర కిలో రూ.20-25 మధ్యే ఉంది. మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో పంట దెబ్బతినడంతో జిల్లాలోని మార్కెట్లకు వచ్చే ఉల్లి తగ్గిపోయింది. ఫలితంగా ధరలు పెరగడం ప్రారంభించాయి. ఒక్క రోజు వ్యవధిలోనే రూ.15 పెరిగిన ఉల్లి ధర ఆదివారం నాటికి రూ.50కు చేరుకుంది. గొల్లప్రోలు, పిఠాపురం హోల్‌సేల్‌ మార్కెట్లతో పాటు ఇతర రిటైల్‌ మార్కెట్లలో ఉల్లి ధరలు నాణ్యతను బట్టి రూ.45 నుంచి రూ.55 వరకు ఉన్నాయి. స్థానికంగా పండిన ఉల్లి పంట మార్కెట్‌లోకి వచ్చేందుకు మరో రెండు నెలలు పట్టే అవకాశం ఉంది. దీంతో ధరలు మరింత పెరగవచ్చునని మార్కెట్‌వర్గాలు భావిస్తున్నాయి. కాగా ఉల్లి ధరలు పెరగడంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. దీని ప్రభావం ఉల్లి కొనుగోళ్లపై పడిందని, ప్రజలు తక్కువగా కొనుగోలు చేస్తున్నారని వ్యాపారులు చెప్తున్నారు. 


Updated Date - 2021-10-18T05:49:50+05:30 IST