తల్లిలా మేలు చేసే ఉల్లి!

ABN , First Publish Date - 2022-03-05T05:30:00+05:30 IST

ఉల్లిపాయని నిలువుగా సగానికి కోసి చూస్తే, రెండు చెట్లకు లేదా

తల్లిలా మేలు చేసే ఉల్లి!

ఉల్లిపాయని నిలువుగా సగానికి కోసి చూస్తే, రెండు చెట్లకు లేదా స్తంభాలకు కట్టిన పడక ఉయ్యాల లాగా ఉల్లిపొరలు అమరి ఉంటాయి. ఈ పడక ఉయ్యాల్ని తెలుగులో ‘ఉల్లకి’ అంటారు. ఉల్లకి ఆకారంలో పాయలు కలిగినది కాబట్టి ఉల్లిపాయ అనే పేరు వచ్చి ఉండవచ్చు. ఇది గడ్డిజాతి మొక్క. కూరల్లో చేరిన తొలి ఆహారద్రవ్యాల్లో ఉల్లి కూడా ఉంది. ఉల్లిలో ఇనుము, క్యాల్షియం ఎ, డి, సి విటమిన్లు ప్రధానంగా ఉంటాయి. దీంట్లో ‘అలైల్‌ ప్రోపిల్‌ డె సల్ఫైడ్‌’ అనే రసాయనం వలన ఘాటైన రుచి కలిగి ఉంటుంది. దీంట్లో గంధకం ఎక్కువగా ఉంటుంది. దానివల్లే వీటిని తరిగేటప్పుడు కన్నీళ్లొస్తాయి. 


ప్రయోజనాలు...

ఉల్లిపాయలు చలవచేస్తాయి. పైత్యం తగ్గుతుంది. మూత్రంలో మంట తగ్గుతుంది. మొలల వ్యాధిలో ఔషధంగా పనిచేస్తుంది. రక్త విరేచనాలు, జిగురు విరేచనాలు, అమీబియాసిస్‌ వ్యాధులు తగ్గుతాయి. ఉల్లిముక్కల్ని పెరుగులో వేసి కొత్తిమీర వగైరా కలిపి తాలింపు పెట్టిన ఉల్లిపెరుగుపచ్చడి(రైతా) ఈ వ్యాధుల్లో బాగా పనిచేస్తుంది. ముద్దగా నూరిన ఉల్లిని, వెన్నపూసనీ నానబెట్టిన మెంతుల్నీ కలిపి తింటే అమీబియాసిస్‌, కలరా లాంటి వ్యాధులు త్వరగా తగ్గుతాయి. కొవ్వుని కూడా ఇది తగ్గిస్తుంది. ఉల్లి బలవర్ధకమైన ఆహార ద్రవ్యం. ఆకలిని పెంచుతుంది. మలబద్ధకాన్ని పోగొడుతుంది. కఫాన్ని తగ్గిస్తుంది. దగ్గు, జలుబు, జ్వరాలున్న వారు తప్పకుండా తినదగిన ఆహార ద్రవ్యం ఇది. రక్తనాళాల్లో అవరోధాల్ని తొలగించేందుకు సహాయపడుతుంది. మూత్రపిండాల్లో రాళ్ళను కరిగించే గుణం కూడా ఉల్లికి ఉంది. రేచీకటిని తగ్గిస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. వెల్లుల్లి వేడి చేస్తుంది. ఉల్లి చలవనిస్తుంది. ఈ రెండింటికీ ఇదే ప్రధానమైన తేడా! 


ఉల్లిపాయ రసం తీసి అందులో మిరియాలపొడి, కొద్దిగా తీపి కలుపుకొని తాగితే జ్వరాలు తగ్గుతాయి. చింత చిగురుతో ఉల్లి ముక్కలు కలిపి నూరి తింటే లివర్‌ వ్యాధుల్లో మంచిది. విరేచనం ఫ్రీగా అయ్యేలా చేస్తుంది. ఉల్లిపాయ వాసన చూస్తే శరీరంలో విషదోషాలు తగ్గుతాయి. ఉల్లిపాయల వాసన పాములకు, తేళ్లకు, ఇతర విష పురుగులకు కూడా గిట్టవు. ఉల్లిపాయని మెత్తగా నూరి కుక్క కరచిన చోట, తేలు కుట్టిన చోట, కందిరీగ, తేనెటీగలు కుట్టిన చోట కట్టుగడితే విషదోషాలు తగ్గుతాయి. చీముగడ్దలు (యాబ్సెస్‌) కూడా అణుగుతాయి. సాధారణంగా ఉల్లిపాయల్ని తినకూడని జబ్బనేది లేదు. అన్ని వ్యాధుల్లోనూ మేలు చేసేదిగానే ఉంటుంది. ఇటీవలి కాలంలో ఉల్లిని జుట్టు పెరగటానికి ఔషధంగా కేశతైలాల తయారీలో ఎక్కువగా వాడుతున్నారు. ఉల్లి పాయల్ని ఔషధంగా తగుపాళ్లలో తింటేనే మేలు చేస్తుంది. అతిగా తింటే అజీర్తినీ, ఉబ్బరాన్ని, బుద్ధిమాంద్యాన్ని కలిగిస్తుంది. అందుకే, ఉల్లిని చాలామంది తమోగుణం కలిగించే ఆహారద్రవ్యంగా భావించి నిషేధం పాటిస్తారు. ఉల్లిని పరిమితంగా తింటే ఙ్ఞానేంద్రియాలకు ఉత్తేజాన్నిస్తుంది. మితిమీరి తింటే వికటించి బుద్ధిమాంద్యం లాంటి లక్షణాల్ని కలిగిస్తుంది.

ఇలా చేయాలి...

పాకదర్పణం గ్రంథంలో నలుడు ఉల్లితో కూర చేసుకునే విధానాన్ని ఇలా వివరించాడు. ఉల్లి ముక్కల్ని గంజిలో వేసి ఉడికించి సుగంధ ద్రవ్యాలను చేర్చి కూరగా చేసుకోవాలన్నాడు. ఇలా బియ్యపు గంజిలో ఉడికించినందువలన ఈ ఉల్లికి మంచి సుగంధం ఏర్పడుతుంది. రుచి పెరుగుతుంది. ఉల్లిలో క్రిమిదోషాలు పోతాయి. ఇది వాతాన్ని శ్లేష్మాన్ని తగ్గిస్తుంది. తినటానికి అనువుగా ఉంటుంది. జీర్ణశక్తిని కాపాడుతుందని వివరించాడు నలుడు. ఉడికించిన ఉల్లిపాయలు క్రిమిహరంగా పనిచేస్తాయని వస్తుగుణ సర్వస్వం అనే గ్రంథం పేర్కొంది. 

తల్లిమేలు ఉల్లి చేస్తుందనే నానుడిలో అసత్యం ఏమీ లేదు. ఆయుర్వేదసిద్ధాంతాలు ఉల్లిని నిషేధించలేదు. నలుడు సూచించినట్టు గంజిలో ఉల్లి ముక్కలు ఉడికించి కూరగా వండుకుంటే దాని తమోగుణం తగ్గే అవకాశం కూడా ఉంది. 

  గంగరాజు అరుణాదేవి


Updated Date - 2022-03-05T05:30:00+05:30 IST