శంషాబాద్‌ విమానాశ్రయంలో.. కొవిడ్‌ పరీక్షలు మరింత సులభం

ABN , First Publish Date - 2021-12-07T08:19:32+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ముప్పు జాబితాలోని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కొవిడ్‌ పరీక్షలను సులభంగా నిర్వహించేలా..

శంషాబాద్‌ విమానాశ్రయంలో.. కొవిడ్‌ పరీక్షలు మరింత సులభం

రిస్క్‌ దేశాల నుంచి వచ్చేవారికి ప్రత్యేక ఏర్పాట్లు

సీటింగ్‌.. పరీక్షలకు ఆన్‌లైన్‌ బుకింగ్‌


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి)

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ముప్పు జాబితాలోని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కొవిడ్‌ పరీక్షలను సులభంగా నిర్వహించేలా.. హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అంతర్జాతీయ ప్రయాణికులు సురక్షితంగా ఉండేలా, ఇతర ప్రాంతాలకు ఇబ్బంది లేకుండా వెళ్లేందుకు ఇం టర్నేషనల్‌ హాల్‌ ప్రి ఇమిగ్రేషన్‌లో ప్రత్యేక కొవిడ్‌ పరీక్ష బూత్‌లను నెలకొల్పారు. ముందస్తు ఆర్టీపీసీఆర్‌/ర్యాపిడ్‌ పీసీఆర్‌ పరీక్షల బుకింగ్‌ పక్రియను ప్రారంభించారు. దీని ద్వారా ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకోక ముందే ఆన్‌లైన్‌ ద్వారా టెస్టు స్లాట్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఇందుకోసం హైదరాబాద్‌ విమానాశ్రయ వెబ్‌సైట్‌ www.hyderabad.aero  లింక్‌ను లేదా పరీక్షలు నిర్వహిస్తున్న వెబ్‌సైట్‌ http://covid.mapmygenome.in  లింక్‌ను ఉపయోగించవచ్చు.


ఆర్టీపీసీఆర్‌ రూ.750.. ర్యాపిడ్‌ రూ.3,900

విమానాశ్రయంలో ఆర్టీపీసీఆర్‌ పరీక్ష కోసం రూ.750 రుసుమును నిర్ధారించారు. ఫలితం కోసం 6 గంటలు వేచి ఉండాలి. ఇక ర్యాపిడ్‌ పీసీఆర్‌ పరీక్ష ధర రూ.3,900. దీని ఫలితం వచ్చేందుకు 2 గంటలు పడుతుంది. ముందుగా బుక్‌ చేసుకున్నవారికి ప్రత్యేక కౌంటర్లు, క్యూ లైన్లు ఉన్నందున రిజిస్ట్రేషన్‌ కోసం వేచి ఉండాల్సిన అవసరం రాదు. నేరుగా పరీక్షకు వెళ్లొచ్చు. ఇక పరీక్ష ఫలితం కోసం వేచి ఉండే సమయంలో అంతర్జాతీయ ప్రయాణికులు కూర్చునేందుకు సీట్లు, ఆహార పదార్థాల, ఫారెక్స్‌ ఎక్స్ఛేంజ్‌ పేమెంట్‌ కౌంటర్లను అందుబాటులోకి తెచ్చారు. ప్రత్యేక హోదా ఉన్న ప్రయాణికుల కోసం అవసరమైన సౌకర్యాలతో అదనపు వెయింటింగ్‌  ఏరియా కూడా ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలు, డాక్యుమెంట్ల తనిఖీలో సాయం చేసేందుకు ప్యాసింజర్‌ సర్వీస్‌ అసోసియేట్‌లను అదనంగా నియమించారు. విమానాశ్రయ ఆరోగ్య అధికారి, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది వీటిని పర్యవేక్షిస్తున్నారు. జీహెచ్‌ఐఎల్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కూడా ఈ సమాచారాన్ని పొందుపరిచారు. అన్ని అరైవల్‌ గేట్ల వద్ద థర్మల్‌ స్కానర్లు ఉంచారు. ప్రయాణికులకు తప్పనిసరిగా స్కాన్‌ చేస్తున్నారు. టెర్మినల్‌ అంతటా స్టిక్కర్లు, పోస్టర్ల ద్వారా ఆర్టీపీసీఆర్‌ /ర్యాపిడ్‌ పీసీఆర్‌ ఏర్పాట్లను తెలియజేస్తున్నారు. పలుచోట్ల సైనేజ్‌లు ఏర్పాటు చేశారు. 


ఆ దేశాల నుంచి వారానికి 12 విమానాలు

ప్రస్తుతం ముప్పు జాబితాలో ఉన్న దేశాల నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి వారానికి 12 సర్వీసులు నేరుగా నడుస్తున్నాయి. బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ వారానికి 3 సర్వీసులను నడుపుతున్నాయి. ఎయిరిండియా లండన్‌కు వారానికి రెండు నేరు సర్వీసులను, స్కూట్‌ వారానికి నాలుగు సర్వీసులను సింగపూర్‌కు నడుపుతోంది. ముప్పు జాబితాలోని దేశాల నుంచి ఆదివారం వరకు 1,443 మంది ప్రయాణికులు రాగా అందరికీ పరీక్షలు చేశారు.

Updated Date - 2021-12-07T08:19:32+05:30 IST