‘ఆన్‌లైన్‌’ చెలగాటం

ABN , First Publish Date - 2022-08-13T06:28:04+05:30 IST

‘ఆన్‌లైన్‌’ చెలగాటం

‘ఆన్‌లైన్‌’ చెలగాటం

ప్రాణ సంకటంగా మారిన బెట్టింగ్‌ గేమ్‌లు

నగరాల్లోంచి పల్లెలకు పాకిన జూదం

ఆన్‌లైన్‌లో విచ్చలవిడిగా గ్యాంబ్లింగ్‌ గేమ్‌లు

డబ్బులు పోగొట్టుకుని అప్పుల పాలవుతున్న యువకులు

కేసముద్రం మండలంలో ఇద్దరు ఆత్మహత్య

నిషేధం విధించాలంటున్న నిపుణులు


కేసముద్రం, ఆగస్టు 12 : ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌.. ఐపీఎల్‌ క్రికెట్‌.. పేకాట.. ఇతర గ్యాంబ్లింగ్‌ (జూదం) గేమ్‌లు ఏదైనా సరే.. యువకుల ప్రాణాలను బలిగొంటూ కుటుంబాలను నాశనం చేస్తున్నాయి. ఒకప్పుడు విదేశాల్లో, నగరాల్లో అందుబాటులో ఉన్న ఈ ఆన్‌లైన్‌ జూదం ఆటలు.. స్మార్ట్‌ఫోన్‌, ఇంటర్‌నెట్‌ సహాయంతో మారుమూల పల్లెలకు చేరాయి. ఆన్‌లైన్‌ జూదంలో వేలకు వేల రూపాయలు మాయమవుతుడడంతో పలువురు యువకులు అప్పులపాలవుతున్నారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో డబ్బులు కోల్పోయి అప్పులపాలైన వారు ఆత్మహత్య చేసుకుంటూ కుటుంబసభ్యులకు తీరని శోకం మిగులుస్తున్నారు. 


ఈ నేపథ్యంలోనే ఆరు నెలల వ్యవధిలో కేసముద్రం మండలంలో ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. ఐపీఎల్‌ క్రికెట్‌, పేకాట, ఇతర జూద ఆటలపై బెట్టింగ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంచనాలు వేస్తూ ఆన్‌లైన్‌లో వేలకువేల రూపాయలు బెట్టింగ్‌, జూదం ఆడుతూ ఒకటి, రెండుసార్లు డబ్బులు వచ్చేసరికి పందానికి అలవాటు పడిపోతున్నారు. పోగొట్టుకున్న డబ్బులు మళ్లీ రాబట్టుకోవాలనే ఉద్దేశంతో బెట్టింగ్‌లు కాస్తూ వేలు, లక్షల రూపాయలు కోల్పోతున్నారు. ఈ బెట్టింగ్‌లో డబ్బులు పెట్టేందుకు తెలిసిన వారి వద్ద అప్పులు తీసుకుంటున్నారు. బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకుంటుండడంతో అప్పు ఇచ్చిన వారికి తిరిగి చెల్లించే మార్గంలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. 


అన్ని జూదాలు ఒకేచోట

ఆన్‌లైన్‌లో జూదం ఆడే వారికోసం కొన్ని కంపెనీలు అన్ని గ్యాంబ్లింగ్‌ (జూదం) గేమ్‌లు ఒకే చోట అందిస్తున్నాయి. ఈ కంపెనీల వద్ద డబ్బులు చెల్లించి లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ తీసుకుంటే సదరు కంపెనీ లాగ్‌ ఇన్‌లో ఉన్న ఏ గేమ్‌ అయినా ఆడేందుకు వీలుంటుంది. ఇందులో ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌, పేకాటలో ఎన్ని రకాల ఆటలు ఉన్నాయో అన్ని రకాల ఆటలు, ఆన్‌లైన్‌ డైస్‌ గేమ్స్‌, నంబర్‌ గేమ్‌లు, లైవ్‌ క్యాసినో ఆటలు, ఆన్‌లైన్‌ రౌలెట్‌, మొబైల్‌ క్యాసినో గేమ్స్‌ తదితర రకాల జూద ఆటలు అందుబాటులో ఉన్నాయి. ఐపీఎల్‌ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేస్తున్న బాట్స్‌మెన్‌ ఎన్ని పరుగులు చేస్తాడు? ఒక ఓవర్‌లో ఎన్ని రన్‌లు వస్తాయి? ఒక బాల్‌కు ఎన్ని పరుగులు వస్తాయనే? అంశాలను అంచనా వేస్తూ వాటిపై పందాలు వేస్తున్నారని సమాచారం. ఈ పందాలు డబ్బుల చెల్లింపులు అంతా ఆన్‌లైన్‌ ద్వారానే చెల్లింపులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. 


ఇద్దరి ఆత్మహత్య

కేసముద్రం మండలంలో ఆరునెలల వ్యవధిలో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని అప్పులపాలై ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకోవడం తీవ్రమైన పరిణామం. మండలంలోని పెనుగొండలో ఒక యువకుడు ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌ చేస్తూ రూ.12లక్షల వరకు పోగొట్టుకున్నాడు. దీంతో కొద్దినెలల కిందట ఆ యువకుడు మహబూబాబాద్‌ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా ధన్నసరికి చెందిన మరో వ్యక్తి ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ గేమ్‌లలో రూ.28లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ డబ్బులన్నీ అప్పులు తీసుకువచ్చి పెట్టడంతో అప్పులవాళ్లు అడుగుతుండడంతో వారికి సమాధానం చెప్పలేక, బయటకు చెప్పుకోలేక క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నాడు. వీరే కాకుండా కేసముద్రం స్టేషన్‌కు చెందిన ఒక యువకుడు అప్పులు చేసి ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లలో పెట్టి రూ.6లక్షలు పోగొట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న అతడి తండ్రి సాగుభూమిని కొంత విక్రయించి ఆ అప్పులను చెల్లించాడు. కేసముద్రం ప్రాంతంలో సుమారు 30 మంది వరకు రూ.10 నుంచి రూ.30లక్షల పోగొట్టుకొని అప్పులపాలైన వారు ఉన్నారని విశ్వసనీయ సమాచారం. వీరిలో కొందరు ఇక్కడ ముఖం చూపించలేక ఊరు వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. 


 ప్రభుత్వం నియంత్రించాలి...

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ గేమ్‌ల వల్ల ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు పెద్దదిక్కులే కుండా చిన్నాభిన్నమవుతున్నాయి. కుటుంబాలను ఆర్థికంగా అతలాకుతలం చేస్తున్న ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌ గేమ్‌లను ప్రభుత్వం నియంత్రించి ఉంటే ఈ ఘోరాలు జరిగేవి కావని బాధితులకు సంబంధించిన వారు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ చూపి ఆన్‌లైన్‌ గ్యాబ్లింగ్‌ గేమ్‌ల వ్యసనానికి గురికాకుండా చర్యలు తీసుకొని మరికొన్ని కుటుంబాలు, వ్యక్తుల ప్రాణాలను కాపాడాలని పలువురు కోరుతున్నారు.


పిల్లలు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి : కొత్త జగన్మోహన్‌రెడ్డి, విద్యావేత్త, సీనియర్‌ హెచ్‌ఎం, కేసముద్రం 

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ గేమ్‌లతో జరిగే అనర్థాలపై పిల్లలకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. కరోనా సంక్షోభంలో ఆన్‌లైన్‌ క్లాసుల కారణంగా పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉంచడం వల్ల చెడు వ్యసనాలకు అవకాశం ఏర్పడింది. స్మార్ట్‌ఫోన్లలో ఎన్నో ఆకర్షణీయంగా బెట్టింగ్‌ గేమ్‌లకు సంబంధించిన సమాచారం వస్తోంది. బెట్టింగ్‌లలో నష్టపోయిన వారి బాధలు చూసైనా వాటి జోలికి వెళ్లకుండా ఉండాలి. 


తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి : సదయ్య, డీఎస్పీ, మహబూబాబాద్‌ 

పిల్లలు, యువకులు స్మార్ట్‌ఫోన్‌లో ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి తరచూ గమనిస్తూ ఉండాలి. బెట్టింగ్‌ ఆటల్లో నష్టపోవడం తప్ప ఎవరికీ ప్రయోజనం జరగదనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. ఆర్థికంగా నష్టపోకుండా ముందస్తుగానే జాగ్రత్తపడాలి. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటాం. 

Updated Date - 2022-08-13T06:28:04+05:30 IST