సొంటూర్‌ బేజార్‌..

ABN , First Publish Date - 2021-01-11T14:06:46+05:30 IST

అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా మళ్లీ రైళ్లను నడిపిస్తున్నా ఆన్‌లైన్‌లో టికెట్‌ తీసుకున్న వారు మాత్రమే ప్రయాణించాలని అధికారులు నిబంధన విధించారు. చాలా మంది ప్రయాణికులకు ఈ విషయం ...

సొంటూర్‌ బేజార్‌..

పండగ ప్రయాణం కష్టంగా మారింది. సంక్రాంతికి సొంతూరుకు వెళ్లాలనుకునే చాలా మంది ప్రయాణికులకు నిరాశే మిగులుతోంది. కరోనా కారణంగా పూర్తి స్థాయిలో రైళ్లు లేక.. ప్రత్యేక రైళ్లు సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఆ రైళ్లలో జనరల్‌ బోగీలు లేకపోవడం సామాన్యులకు శాపంగా మారింది. ఆన్‌లైన్‌లో టికెట్‌ బుక్‌ చేసుకోవడం తెలియక.. నేరుగా తీసుకునే అవకాశం లేక అవస్థలు పడుతున్నారు.


 చాంతాడంత వెయిటింగ్‌ లిస్ట్‌

జనరల్‌ టికెట్లు లేక సామాన్యుల ఇబ్బందులు

ఆన్‌లైన్‌లో రిజర్వేషన్‌  చేయించుకోవడం తెలియక పాట్లు

‘ఆన్‌లైన్‌’ కష్టాలు


అడ్డగుట్ట: అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా మళ్లీ రైళ్లను నడిపిస్తున్నా ఆన్‌లైన్‌లో టికెట్‌ తీసుకున్న వారు మాత్రమే ప్రయాణించాలని అధికారులు నిబంధన విధించారు. చాలా మంది ప్రయాణికులకు ఈ విషయం తెలియక పండగకు ఊరికి వెళ్లేందుకు నేరుగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు ఐఆర్‌సీటీసీలో టికెట్‌ ఎలా కొనుగోలు చేయాలో తెలియక కౌంటర్‌ వద్దకు వస్తున్నారు. అక్కడ టికెట్లు ఇవ్వడం లేదని తెలుసుకుని నిరాశ చెందుతున్నారు. ఐఆర్‌సీటీసీలో టికెట్‌ తీసుకుందామన్నా చాలాసార్లు సర్వర్‌ డౌన్‌ ఉంటోంది. లేదంటే వందల్లో వెయిటింగ్‌ చూపిస్తుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో బస్సులు, ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. పండగకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టినా, అవి ఎప్పుడున్నాయో తెలియక చాలామంది సామాన్య ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజులుగా పలువురు జనరల్‌ టికెట్ల కోసం వచ్చి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి నిరాశగా వెనుదిరగడం కనిపించింది. సంక్రాంతి సమయంలో మరిన్ని అదనపు రైళ్లు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. పండగ సీజన్‌లో జనరల్‌ టికెట్లు ఇస్తే బాగుంటుందని ప్రయాణికులు కోరుతున్నారు.

Updated Date - 2021-01-11T14:06:46+05:30 IST