ఆన్‌లైన్ ఎకోఫ్రెండ్లీ స్టార్టప్‌తో నెలకు లక్ష రూపాయల ఆదాయం!

ABN , First Publish Date - 2021-02-15T13:27:03+05:30 IST

దేశరాజధాని ఢిల్లీకి చెందిన దివ్య రాజ్‌పూత్ 20 ఏళ్లకు పైగా...

ఆన్‌లైన్ ఎకోఫ్రెండ్లీ స్టార్టప్‌తో నెలకు లక్ష రూపాయల ఆదాయం!

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీకి చెందిన దివ్య రాజ్‌పూత్ 20 ఏళ్లకు పైగా ఎడ్యుకేషన్ ఫీల్డ్‌లో ఉన్నారు. ఆమె మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్‌లో కూడా పనిచేశారు. ఇప్పుడు దివ్య తన నలుగురు స్నేహితుల సాయంతో ఒక ఎకో ఫ్రెండ్లీ స్టార్టప్ నిర్వహిస్తున్నారు. నిత్యావసరాలకు సంబంధించిన ప్రతీవస్తువునూ ఆమె ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారు. మూడు నెలల క్రితమే దివ్య ఈ ఆన్‌లైన్ ప్లాట్ ఫారం ప్రారంభించారు. 


ప్రస్తుతం ఆమె నెలకు లక్ష రూపాయల వరకూ ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ఆమె ఏర్పాటు చేసిన స్టార్టప్ సాయంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 200కుపైగా మహిళలు ఉపాధి పొందుతున్నారు. తన స్టార్టప్ గురించిన 40 ఏళ్ల దివ్య మాట్లాడుతూ ‘నా స్నేహితురాలు కాకుల్ రిజ్వీ మార్కెటింగ్ ప్రొఫిషినల్. ఆమె క్యాన్సర్ బారిన పడటంతో ఆర్గానిక్ ఉత్పత్తులు వినియోగించాలని ఆమెకు వైద్యులు సూచించారు. ఇటువంటి ప్లాట్‌ఫారాలు తక్కువగా ఉన్నాయని అప్పుడు మాకు అనిపించింది. అందుకే మేము ఇటువంటి ప్లాట్‌ఫారం ఏర్పాటుచేయాలని నిశ్చయించుకున్నాం. దాని ద్వారా నిత్యావసరాలకు సంబంధించిన ప్రతీ ఆర్గానిక్ ఉత్పత్తినీ  వినియోగదారులకు అందించాలని అనుకున్నాం. చేస్తున్న ఉద్యోగాన్ని వదిలివేసి కాకున్ ఎకో పేరుతో స్టార్టప్ ప్రారంభించామని తెలిపారు. అయితే ఇది మొదలైన కొద్ది రోజుల తరువాత దివ్య స్నేహితురాలు కాకున్ మృతి చెందింది. దీంతో దివ్య ఒక్కరే ఈ స్టార్టప్ నిర్వహించాల్సివచ్చింది. మొదట్లో వివిధ ప్రాంతాల్లో ఎగ్జిబిషన్లు నిర్వహిస్తూ ఉత్పత్తులను విక్రయించామని, తరువాత సోషల్ మీడియా ద్వారా ప్రచారం సాగించి, ఆన్‌లైన్‌లో విక్రయాలు చేస్తున్నామన్నారు. అలాగే ప్రతీ కొత్త ఉత్పత్తినీ వినియోగదారులకు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. 

Updated Date - 2021-02-15T13:27:03+05:30 IST