ఆన్‌లైన్‌లో వేధింపులు ఆడవాళ్లపైనే ఎక్కువ!

ABN , First Publish Date - 2021-03-17T05:54:24+05:30 IST

మగవాళ్ల కన్నా మహిళలు ఎక్కువగా తప్పుడు వార్తల బారిన పడుతున్నారని కొన్ని సర్వేలు, వార్తలు చెబుతున్నాయి.

ఆన్‌లైన్‌లో వేధింపులు ఆడవాళ్లపైనే ఎక్కువ!

మగవాళ్ల కన్నా మహిళలు ఎక్కువగా తప్పుడు వార్తల బారిన పడుతున్నారని కొన్ని సర్వేలు, వార్తలు చెబుతున్నాయి. అలాంటి వార్తల్లో తరచూ లైంగిక సంబంధమైనవే ఉండటం ఆందోళన కలిగించే అంశం. ముఖ్యంగా వివిధ అంశాలపై తమ అభిప్రాయాలు, మద్దతను నిక్కచ్చిగా వ్యక్తం చేస్తున్న మహిళలపై ఆన్‌లైన్‌ వేధింపులు, అసత్య ప్రచారం ఎక్కువవుతున్నాయి. సమాజంలో పేరున్న మహిళలపై తప్పుడు సమాచారంతో  కూడిన దాడులు సోషల్‌ మీడియాలో జరుగుతున్నాయని ఐక్యరాజ్యసమితి ‘ఎంటిటీ ఫర్‌ జెండర్‌ ఈక్వాలిటీ అండ్‌ ది ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ ఉమెన్‌’ తన నివేదికలో చెప్పింది.  ఈ దుష్ప్రచారానికి జెండర్‌ ప్రధాన కారణం అవుతోందని ఆ నివేదిక  వెల్లడించింది. 


ఆన్‌లైన్‌లో వేధింపులకు గురవుతున్న మహిళలు 67 శాతం మంది ఉన్నట్టు ఒక సర్వేలో వెల్లడైంది. జిఎస్‌ఎం అసోసియేషన్స్‌ మొబైల్‌ జెండర్‌ గ్యాంప్‌-2020 నివేదిక ప్రకారం భారతదేశంలో మొబైల్‌ ఇంటర్నెట్‌ వాడుతున్న మహిళలు 50 శాతం కన్నా  తక్కువ. మహిళలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వెల్లడించడం కూడా వారిపై ఆన్‌లైన్‌ హింస అధికమవడానికి కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మహిళలు తమ అభిప్రాయాలను బయటకు వెల్లడించకుండా మౌనంగా ఉన్నంత కాలం ఈ రకమైన వేధింపులు మరింత ఎక్కువ అవుతాయని మహిళా ఉద్యమకారులు అంటున్నారు. సొంత అభిప్రాయాలు కలిగిన మహిళలను సంప్రదాయాలను ధిక్కరించేవారిగా, సమాజానికి ప్రమాదకారులుగా చిత్రీకరిస్తున్న పరిణామాలు సైతం చూస్తున్నాం. 


మహిళలపై జరుగుతున్న ఈ రకమైన దుష్ప్రచారాలు, దాడులు ఆమె ఉనికిని ప్రశ్నిస్తున్నాయని డిస్‌ఇన్‌ఫో లాబ్స్‌ ఒక అంచనాలో అభిప్రాయపడింది. ఒక నిర్దిష్ట లక్ష్యంతో ఉద్యమిస్తున్న మహిళలు ఈ రకమైన ఆరోపణలకు ఎక్కువ టార్గెట్‌ అవుతున్నారు. తమ భావజాలాన్ని వ్యతిరేకిస్తున్న వారిపై తప్పుడు కంటెంట్‌తో కూడిన వీడియోలను ఉద్దేశపూర్వకంగా వైరల్‌ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

Updated Date - 2021-03-17T05:54:24+05:30 IST