8, 9, 10 తరగతులకు నేటి నుంచే ఆన్‌లైన్‌ పాఠాలు

ABN , First Publish Date - 2022-01-24T04:50:09+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లోని 8, 9, 10 తరగతుల విద్యార్థులకు సోమవారం నుంచి ఆన్‌లైన్‌ క్లాస్‌లను నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డీఈవోలకు ఉత్తర్వులు జారీ చేసింది.

8, 9, 10 తరగతులకు నేటి నుంచే ఆన్‌లైన్‌ పాఠాలు

 50 శాతం టీచర్లు, సిబ్బంది పాఠశాలలకు రావాలని ఆదేశాలు


సంగారెడ్డి అర్బన్‌, జనవరి 23: ప్రభుత్వ పాఠశాలల్లోని 8, 9, 10 తరగతుల విద్యార్థులకు సోమవారం నుంచి ఆన్‌లైన్‌ క్లాస్‌లను నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డీఈవోలకు ఉత్తర్వులు జారీ చేసింది. సంగారెడ్డి జిల్లాలో 8, 9, 10 తరగతులున్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు 470 ఉండగా, అందులో సుమారు 22 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి సోమవారం నుంచి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించనున్నారు. టీచర్లు, సిబ్బంది పాఠశాలలకు నిత్యం 50 శాతం మంది హాజరుకానున్నారు. గతేడాది సెప్టెంబరు 1 నుంచి ప్రత్యక్ష తరగతులను ప్రారంభించారు. చదువులు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాయి. విద్యాసంవత్సరం ముగింపు దశకు వస్తున్న తరుణంలో మరోసారి ఆన్‌లైన్‌ తరగతులే శరణ్యమవడంతో గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు చదువులో వెనకబడే ఆవకాశం ఉంది. రెండేళ్లుగా ఆన్‌లైన్‌ తరగతులతో విద్యార్థుల విద్యా ప్రమాణాలు సన్నగిల్లిన తరుణంలో మరోసారి ఇదే పద్ధతికి శ్రీకారం చుట్టడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అయితే 1-7 తరగతుల బోధనపై సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో విద్యార్థుల పరిస్థితి డోలాయమానంలో నిలుస్తోంది. కాగా విద్యార్థులు ఆన్‌లైన్‌ పాఠాలు వినేలా తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలని సంగారెడ్డి డీఈవో నాంపల్లి రాజేశ్‌ సూచించారు. వంతుల వారీగా టీచర్లు, సిబ్బంది హాజరుకావాలన్నారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ఇంటర్‌ విద్యార్థులకు కూడా ఆన్‌లైన్‌ ద్వారా నేటి నుంచే తరగతులు కొనసాగిస్తామని జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి గోవిందరామ్‌ తెలిపారు. 


 

Updated Date - 2022-01-24T04:50:09+05:30 IST