కరోనా విజృంభణతో.. ఆన్‌లైన్‌ ఆర్డర్లు పెరిగాయ్

ABN , First Publish Date - 2021-04-23T13:35:10+05:30 IST

కరోనా విజృంభణతో షాపింగ్‌ తీరు మారుతోంది...

కరోనా విజృంభణతో.. ఆన్‌లైన్‌ ఆర్డర్లు పెరిగాయ్

  • ఆన్‌లైన్‌ కొనుగోళ్లకే మక్కువ చూపుతున్న నగరవాసులు


హైదరాబాద్‌ : కరోనా విజృంభణతో షాపింగ్‌ తీరు మారుతోంది. ఉదయం లేవగానే ఏదో ఒక సూపర్‌మార్కెట్‌కు వెళ్లి తాజా సరుకు కావాలనుకుంటూ వెదికే వారు ఇప్పుడు ఆన్‌లైన్‌ వైపు చూస్తున్నారు. ఏసీ రూమ్‌లలో తలుపులు బిగించి విక్రయాలు సాగించే సూపర్‌/హైపర్‌ మార్కెట్‌లకు బదులు ఇంటి ముంగిటే డెలివరీ తీసుకుంటే బెటర్‌ అని భావిస్తున్నారు. పలు యాప్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేయడానికి సిద్ధమవుతున్నారు. గతంలో సేమ్‌ డే డెలివరీ అందించే యాప్‌లు డిమాండ్‌ పెరగడంతో ఇప్పుడు ఒకటి లేదంటే రెండు రోజుల సమయాన్ని డెలివరీకి తీసుకుంటున్నాయని కొనుగోలుదారులు అంటున్నారు.


మూడు నుంచి నాలుగు రోజులు

ఆన్‌లైన్‌లో గ్రోసరీ లేదంటే కూరగాయలు ఆర్డర్‌ చేస్తే గతంలో అదేరోజు లేదంటే మరుసటిరోజు డెలివరీ చేసే యాప్‌లు ఇప్పుడు ఒకటి నుంచి నాలుగు రోజుల సమయం తీసుకుంటున్నాయి. రోజువారీ పాలు, కూరగాయలు, గ్రోసరీలు డెలివరీ చేసే యాప్‌లు యాథావిధిగానే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని అంటున్నారు ఓ యాప్‌ ప్రతినిధి అనంత్‌. ఏదైనా సరే రాత్రి 11 గంటల లోపు ఆర్డర్‌ చేస్తే ఉదయం ఏడు గంటల లోపు డెలివరీ చేస్తున్నామన్నారు. ఆర్డర్‌ను బట్టి డెలివరీ చేసే యాప్‌లు స్లాట్‌ లభ్యతను బట్టి నగర పరిధిలో అయితే ఒకటి నుంచి రెండు రోజులు, నగర శివార్లలో అయితే మూడు నుంచి నాలుగు రోజులు డెలివరీకి సమయం తీసుకుంటున్నాయి.


డెలివరీ ఆలస్యం

కరోనా సెకండ్‌ వేవ్‌లో ఆర్డర్స్‌ ఒత్తిడితో డెలివరీ ఆలస్యం అవుతుందంటున్నారు పలు యాప్‌ల ప్రతినిధులు. ఇదే విషయమై ఓ సుప్రసిద్ధ యాప్‌ డెలివరీ పార్టనర్‌ వసంత్‌ మాట్లాడుతూ.. ‘‘కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రారంభం కాక ముందు రోజూ సరాసరి 8-10 డెలివరీలు చేస్తే ప్రస్తుతం 20-25కు పైగా డెలివరీలు చేస్తున్నాం. అయినా బ్యాక్‌లాగ్‌ ఉండిపోతోంది. సెకండ్‌ వేవ్‌ విజృంభణతో ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌ 20-25 శాతం పెరిగాయి. దాంతో డెలివరీలు ఆలస్యం అవుతున్నాయి’’ అన్నారు. ఒత్తిడిలో రిస్క్‌ తీసుకోవడం ఇష్టం లేక కొంతమంది డెలివరీ బాయ్‌లు మానేస్తున్నారని చెప్పారు.

Updated Date - 2021-04-23T13:35:10+05:30 IST