ఆన్‌లైన్‌ పేమెంట్‌.. బీకేర్‌!

ABN , First Publish Date - 2021-11-21T05:16:52+05:30 IST

నోట్ల రద్దు సమయంలో డిజిటల్‌ లావాదేవీలు జరిగినా.. అవి లాక్‌డౌన్‌ సమయంలో పూర్తిగా ఊపందుకున్నాయి.

ఆన్‌లైన్‌ పేమెంట్‌..  బీకేర్‌!

 పెరిగిన ఆన్‌లైన్‌ చెల్లింపులు

కూరగాయల నుంచి కారు వరకు డిజిటల్‌ పేమెంట్‌

అధిక లావాదేవీలు కూడా ప్రమాదేమంటున్న నిపుణులు

నగదు బదిలీ సమయంలో జాగ్రత్తలు తప్పనిసరి

అనధికార యాప్‌లతో అప్రమత్తంగా ఉండాలంటూ సూచన

 

నగదు లావాదేవీల కోసం గతంలో బ్యాంకులు, ఏటీఎంల వద్ద భారీ క్యూలైన్లు కనిపించేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. డిజిటల్‌ యుగం వచ్చేసింది. ఆన్‌లైన్‌ చెల్లింపులు పెరిగిపోయాయి. ఆఖరుకు టీతాగి కూడా ఫోన్‌ ద్వారా నగదు చెల్లిస్తున్నారు. అందివచ్చిన సాంకేతికతతో వినియోగదారులు సమయాన్ని కూడా ఆదా చేసుకుంటున్నారు. ఇదే సమయంలో.. ఆన్‌లైన్‌ చెల్లింపులపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. వ్యక్తిగత లావాదేవీలు ఎంతమేరకు ఉండాలో తెలుసుకోవాలంటున్నారు. క్యూఆర్‌ కోడ్‌, యాప్‌ల వంటివాటిపై అవగాహన కలిగి ఉండాలని చెబుతున్నారు.


 

గుంటూరు(తూర్పు), నవంబరు20: నోట్ల రద్దు సమయంలో డిజిటల్‌ లావాదేవీలు జరిగినా.. అవి లాక్‌డౌన్‌ సమయంలో పూర్తిగా ఊపందుకున్నాయి. పటిష్టమైన సాంకేతికతతో రూపొందించిన యాప్‌లు కూడా అందుబాటులోకి రావడంతో లావాదేవీల్లో వేగం పెరిగింది.  ప్రస్తుతం మన జీవితంలో ఇవి ఎంతగా విస్తరించాయంటే కూరగాయల నుంచి కారు కొనుగోలు వరకు.. ఆటోల ఛార్జీల నుంచి విమాన టికెట్‌  కొనుగోలు వరకు వీటిద్వారానే జరుగుతున్నాయి. ఇది మంచి పరిణామమే కానీ చెల్లింపుల సమయంలో జాగ్రత్తలతో పాటు, ఏడాదిలో ఎంతమేర లావాదేవీలు జరుపుతున్నామనే విషయాలపై దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే అనధికార యాప్‌లతో చెల్లింపులు, ఆన్‌లైన్‌లో రుణాలు ఇస్తామనే యాప్‌లతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆయా బ్యాంకుల నియమాలను అనుసరించి తగిన నిల్వలను ఉంచుతూ లావాదేవీలను జరపాలని సూచిస్తున్నారు.


వ్యక్తిగత లావాదేవీలు ఎంతమేరకు ఉండాలి..?

ఆన్‌లైన్‌, బ్యాంకు లావాదేవీలతోపాటు, యాప్‌ల ద్వారా జరిగే  ట్రాన్సాక్షన్‌ కూడా బ్యాంకు సేవల కిందకే వస్తాయి. 2019-20 సంవత్సరం సవరించిన ఆదాయపు పన్ను నియమాల ప్రకారం ఎటువంటి వ్యక్తిగత లావాదేవీలైనా (డిపాజిట్‌, విత్‌డ్రాలు కలిపి) ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్‌1 నుంచి మార్చి31 వరకు) రూ.10లక్షల లోపు ఉండాలి. అంతకుమించి జరిగితే ఐటీశాఖ నుంచి నోటీసులు అందుకునే పరిస్థితి ఉంటుంది. అంటే రోజుకు సరాసరి దాదాపుగా రూ.2,900 వరకు ఈ లావాదేవీలు ఉండేలా చూసుకోవాలి. అదే ఒకే వ్యక్తితో అయితే ఏడాదికి రూ.2లక్షల నుంచి రూ.2లక్షల 50వేల లోపు మాత్రమే నిర్వహించాలి. ఈ నియమాలు రిటర్న్‌లు దాఖలు చేసేవారికి, చేయనివారికి కూడా పూర్తిగా వర్తిస్తాయి. యాప్‌లు, ఆన్‌లైన్‌ ద్వారా జరిగే ప్రతి నగదు లావాదేవీని ఆదాయపుపన్ను శాఖ అధికారులు పరిశీలిస్తుంటారు. కేవలం యాప్‌లద్వారా జరిగే లావాదేవీలను తనిఖీ చేయడానికి ఆదాయపుపన్నుశాఖ ఈఏడాది జూలై నుంచి ఇన్‌కంట్యాక్స్‌ 2.0 అనే నూతన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. ఈ సాఫ్ట్‌వేర్‌ ద్వారానే మన ప్రతి లావాదేవీలు నిత్యం తనిఖీ చేస్తారు. 


వ్యాపారుల పరిమితులు ఎంతవరకు..?

ఆర్థికసంవత్సరంలో రూ.20లక్షలకు పైన జరిగే లావాదేవీలు జీఎస్టీ పరిధిలోకి వస్తాయి. పెద్దవ్యాపారులు రిటర్నులు దాఖలు చేస్తుంటారు కాబట్టి వారికి పెద్దగా ఇబ్బందులు ఉండవు. ఆన్‌లైన్‌ చెల్లింపుల సమయంలో చిరువ్యాపారులే జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం వ్యాపారానికి సంబంధించిన లావాదేవీలు రూ.20లక్షల లోపు ఉండేలా చూసుకొని, దానికి సంబంధించి పన్నులను చెల్లించాలి. ముఖ్యంగా వ్యక్తిగత లావాదేవీలు వ్యాపార ఖాతాల్లోకి రాకుండా చూసుకోవాలి. అలాగే వ్యాపారస్తులు తమ లావాదేవీలకు ఎటువంటి ఆధారం లేకుండా రూ.20వేలకు మించి నగదును బదిలీ చేయకూడదు. అంతకుమించి జరిగే వాటిని లెక్కల్లో చూపించుకోవాలి. ఏదైనా ఇతర కారణాలతో ఆన్‌లైన్‌ ద్వారా రూ.20 వేలు బదలాయిస్తే.. తిరిగి దానిని ఆన్‌లైన్‌ ద్వారానే చెల్లింపులు ఉండేలా చూసుకోవాలి. లేదంటే ఖాతాల్లో తీసుకున్నవారికి అప్పు పేరున, ఇచ్చినవారికి రావాల్సిన బకాయి కింద పద్దుల్లో అలాగే ఉండిపోతుంది. 


కనీస నిల్వలు ఉంచుకోవాలి...

యాప్‌ల ద్వారా చెల్లింపులు మొదలైననాటి నుంచి ప్రతి ఒక్కరికి కొనుగోలు శక్తి పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. మన ఖాతాల్లో రూ.10 ఉన్నా గాని అంతే విలువ ఉన్న వస్తువును కొనుగోలు చేయడానికి వీలుంటుంది. కానీ బ్యాంకుల్లో కనీస నిల్వ  లేకుండా లావాదేవీలు నిర్వహించడం వల్ల అధిక పెనాల్టీల బారిన  పడేప్రమాదముంది.దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి కనీసనిల్వల లేని ఖాతాదారుల నుంచి రూ.7వేల 8వందల కోట్ల్లను జరిమానాలుగా బ్యాంకులు వసూలుచేసినట్టు గణాంకాలు వెల్లడిస్తునాయి. 


రుణ యాప్‌లతో అప్రమత్తం..

ఆన్‌లైన్‌, యాప్‌లద్వారా నగదు లావాదేవీలు నిర్వహించేవారికి రుణాల యాప్‌ల బెడద ఎక్కువుగా ఉంది. ఆన్‌లైన్‌ద్వారా రుణాలను ఇస్తామనే యాప్‌లకు ఆర్‌బీఐ నుంచి ఎటువంటి అనుమతులు లేవన్న విషయం గుర్తుంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో యాప్‌లనుంచి రుణాలను తీసుకోరాదు. ఇటువంటి యాప్‌లను నియంత్రించడానికి ఆర్‌బీఐ నూతన చట్టాన్ని తీసుకొచ్చింది. అనధికారికంగా రుణాలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది.  


ఫిర్యాదు చేయండి..

ఆన్‌లైన్‌ లావాదేవీలు నిర్వహించే సమయంలో పొరపాటున ఇతర వ్యక్తులకు నగదు బదిలీ జరిగినపుడు కేంద్రం తీసుకువచ్చిన 155260 అనే టోల్‌ఫ్రీ నెంబరుకు ఫిర్యాదు చేయాలి. దీంతో మన డబ్బును కాపాడుకోవచ్చు. అంతేగాక అనధికార యాప్‌లనుంచి ఎట్టి పస్థితుల్లో నగదును బదిలీ చేయకూడదు. దీని ద్వారా మన పూర్తి సమాచారం కేటుగాళ్లకు చిక్కే ప్రమాదముంది.  


మరికొన్ని జాగ్రత్తలు...

ఫ దుకాణాల్లో మరే ఇతరచోట్ల నగదు చెల్లింపుల సమయంలో క్యూఆర్‌ కోడ్‌లను స్కానింగ్‌ చేస్తుంటాం. ఆ సమయంలో కోడ్‌ కింద ఉన్న యాప్‌లు గుర్తింపు పొందినవా లేదా అని చూసుకోవాలి.

- గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ అయ్యేవి, అయా బ్యాంకులు రూపొందించిన యాప్‌ల ద్వారానే లావాదేవీలు నిర్వహించాలి. లింక్‌ల ద్వారా ఎటువంటి నగదు లావాదేవీలు జరపకూడదు.

- వ్యక్తిగత లావాదావీలు నిర్వహించే సమయంలో ఆన్‌లైన్‌ ద్వారా ఇచ్చే నగదును, తిరిగి ఆన్‌లైన్‌ ద్వారానే చెల్లించేలా చూసుకోవాలి.

- ఖాతాల్లో నగదు పెనాల్టీ భారీన పడితే అది ఎందుకు విధించారో బ్యాంకు అధికారులను సంప్రదించాలి.

- స్మార్ట్‌ ఫోను, ల్యాప్‌టాప్‌లలో నగదు యాప్‌లను ప్రత్యేక లాక్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి ఆరునెలలకు ఒకసారి పిన్‌నెంబరును మార్చుకుంటూ ఉండాలి.

- రూ.500 దాటి కొనుగోలు చేసే ప్రతివస్తువుకు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి.


 బ్యాంకు ఖాతాలపై అవగాహన ఉండాలి

ఆన్‌లైన్‌ లావాదేవీలు వచ్చాక బ్యాంకు ఖాతాలపై అవగాహన వదిలేస్తున్నారు. నెలలో ఐదుకు మించి ఏటీఎం లావాదేవీలు నిర్వహిస్తే పెనాల్టీలు పడతాయి. అలాగే కనీసనిల్వలు లేకుంటే జరిమానాలు, చెక్‌బుక్‌ ఛార్జీలు భారీగా పెరిగాయి. కాబట్టి కనీస నిల్వలు ఉంచుకుని ఆన్‌లైన్‌ లావాదేవీలను నిర్వహించుకోవాలి. ఏఏ సేవలకు బ్యాంకులు ఎంతమేర వసూలు చేస్తాయే అనే విషయంపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలి.

 - పి.శివప్రసాదు, విశ్రాంత బ్యాంకు ఉద్యోగి  



Updated Date - 2021-11-21T05:16:52+05:30 IST