3500 మందికి ఇల్లు లేదు..

ABN , First Publish Date - 2020-07-05T11:39:36+05:30 IST

జిల్లాలో ఏపీ టిడ్కో నిర్మిస్తున్న అర్బన్‌ హౌసింగ్‌లో పలువురు లబ్ధిదారులను అనర్హులుగా తేల్చారు. వారి స్థానంలో కొత్తవారికి చోటు

3500 మందికి ఇల్లు లేదు..

టీడీపీ హయాంలో అర్హులు.. వైసీపీలో అనర్హులు  

అర్బన్‌ హౌసింగ్‌లో గందరగోళం

పాతవారి గెంటివేత.. కొత్తవారికి చోటు 

300 చదరపు అడుగులకే ఉచితం


ఎంతో మంది ఎన్‌టీఆర్‌ అర్బన్‌ హౌసింగ్‌ చూసుకుని మురిసిపోయారు.. ఇక ఇల్లు కల తీరిందని సంబరపడ్డారు.. నేడో రేపో గృహ ప్రవేశం చేసుకుందామని ఆనందపడ్డారు. ఆ సంబరం ఎంతో కాలం నిలవలేదు.. ప్రభుత్వం మారిందో లేదో.. అర్హులు కాస్తా అనర్హులుగా మారిపోయారు. ఒక్కరా ఇద్దరా ఏకంగా 3500 మందికి ఇల్లు  రద్దు చేశారు.. ఇల్లు ఉచితం అన్న హామీకి ఆంక్షలు విధించారు..  దీంతో లబ్ధిదారులు బోదిబోమంటున్నారు. ఇప్పుడెలా  అనే మీమాంసలో పడిపోయారు. 


(తాడేపల్లిగూడెం-ఆంధ్రజ్యోతి):  జిల్లాలో ఏపీ టిడ్కో నిర్మిస్తున్న అర్బన్‌ హౌసింగ్‌లో పలువురు లబ్ధిదారులను అనర్హులుగా తేల్చారు. వారి స్థానంలో కొత్తవారికి చోటు కల్పించారు.గత ప్రభుత్వ హయాంలో రెండు విడతలుగా భీమవరం,తాడేపల్లిగూడెం, పాలకొల్లు, ఏలూరు, జంగా రెడ్డిగూడెం, కొవ్వూరు, నిడదవోలు, తణుకు పట్టణాల్లో ఏపీ టిడ్కో ఆధ్వర్యంలో గృహాలు నిర్మించారు. అప్పటిలో నిర్ధారించిన జాబితాల్లో 3500 మంది లబ్ధిదారులు ఇప్పుడు అనర్హులుగా తేలారు. వేరే ప్రాంతంలో రేషన్‌ కార్డు కలిగిఉండడం, లబ్ధిదారుడి తండ్రికి అవసరానికి మించి పెద్ద ఇళ్లు కలిగి ఉండడం, సొంత స్థలంలో ప్రభుత్వం రాయితీతో వ్యక్తిగత ఇళ్ల నిర్మాణం వంటి కారణాలను చూపి జాబితా నుంచి అనర్హులను తొలగించినట్టు అధికారులు చెపుతున్నారు.మునిసిపాలిటీ స్థాయి లోనే ఏరివేత ప్రక్రియ చేపట్టారు.


ఈ నెల 8వ తేదీన ఇళ్ల స్థలాలతో పాటే అర్బన్‌ హౌసింగ్‌లో లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేయడంతో ఆ దిశగా  మునిసి పాలిటీల్లో చర్యలు తీసుకుంటున్నారు. అనర్హుల స్థానంలో కొత్త వారిని చేర్చి జాబితాలు రూపకల్పన చేశారు.అనర్హతకు గల కారణాలను పొందు పరిచారు. వాస్తవానికి రెండు విడతల్లోనూ ఏపీ టిడ్కో తొలుత 30848 ఇళ్లు నిర్మాణం చేపట్టింది. పునాది స్థాయి దాటలేదని ప్రభుత్వం తాజాగా 5,536 ఇళ్లు రద్దు చేసింది. ప్రస్తుతం 24,312 ఇళ్లను లబ్ధిదారులకే కేటాయించేందుకు చర్యలు చేపడుతున్నారు. అందులోనూ 3500 మంది లబ్ధిదారులను అనర్హులుగా గుర్తించి కొత్త వారికి చోటు కల్పించారు. 


అటకెక్కిన ఉచిత హామీ

 అర్బన్‌ హౌసింగ్‌ రుణాలు రద్దు చేస్తామని  సీఎం జగన్మోహన్‌ రెడ్డి  పాదయాత్రలో ప్రకటించారు. దాంతో  లబ్ధిదారులంతా ఉచిత కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం కేవలం 300 చదరపు అడుగుల కేటగిరీ ఇళ్లను మాత్రమే ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. 365, 430 చదరపు అడుగుల కేటగిరీలో లబ్ధిదారులు సొమ్ములు చెల్లించాల్సిందే. అయితే గతంలో కంటే  లక్ష రూపాయలు తక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వమే రాయితీ రూపంలో మరో లక్ష ఇవ్వాలని నిర్ణయించింది. నిజానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కేటగిరీల లబ్ధిదారులకు రూ. 3 లక్షల రాయితీ ఇస్తున్నాయి.


మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల్లో రుణాలుగా  ఇప్పించేందుకు గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దానికి అదనంగా మరో రూ.లక్ష అంటే రూ. 4 లక్షలు రాయితీగా ఇప్పుడు  లబ్ధిచేకూరనుంది. ఏపీ టిడ్కో 430 చదరపు అడుగుల ఇళ్లకు  రూ. 7.65 లక్షలు, 365 చదరపు అడుగుల ఇంటికి  రూ. 6.65 లక్షల ధరను నిర్ణయించింది. ఆయా కేటగిరీల  లబ్ధిదారులు  రూ. 4 లక్షలు మినహాయించి మిగిలిన మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఫలితంగా ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మేరకు ఉచితమని ఎదురు చూసిన లబ్ధిదారులకు నిరాశే ఎదురైంది.


Updated Date - 2020-07-05T11:39:36+05:30 IST