కరోనా పరీక్షలకు వచ్చేది వందల మంది.. పరీక్షలు 50 మందికే..!

ABN , First Publish Date - 2021-05-11T16:27:04+05:30 IST

ఒకరి నుంచి ఒకరికి కరోనా విస్తరించకుండా ఆపగలిగితే

కరోనా పరీక్షలకు వచ్చేది వందల మంది.. పరీక్షలు 50 మందికే..!

  • అనుమానితులకు పరీక్షలేవీ..?
  • వచ్చేది వందల మంది, పరీక్షలు 50 మందికే..
  • ఆరోగ్య కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న బాధితులు
  • వైరస్‌ నిర్ధారణ కోసం ఐదు రోజుల సమయం
  • హిల్స్‌ ఆరోగ్య కేంద్రాల వద్ద దుస్థితి

హైదరాబాద్/బంజారాహిల్స్‌ : ఒకరి నుంచి ఒకరికి కరోనా విస్తరించకుండా ఆపగలిగితే కేసులు తగ్గిపోతాయని చెబుతున్న పాలకులు ఆదిశగా చర్యలు తీసుకోకపోవడం రోగుల పాలిట శాపంగా మారింది. కరోనా నిర్ధారణ పరీక్షల కోసం ఐదు రోజుల పాటు వేచి చూడాల్సి వస్తుందంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. అనుమానితులు వందల సంఖ్యలో ఉండగా పరీక్షలు మాత్రం పదుల సంఖ్యలో జరుగుతుండడంతో వైరస్‌ సోకిందా లేదా అని తెలియక అనుమానితులు అయోమయంలో పడుతున్నారు. మానసిక ఆందోళనకు గురవుతున్నారు. కేవలం పరీక్ష చేయించుకునేందుకు రోజుల తరబడి పరీక్షా కేంద్రాల చుట్టూ తిరగాల్సి వస్తోందని అనుమానితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరిలో ఇరవై శాతం మందికి వైరస్‌ ఉన్నా వారి ద్వారా ఇంకా అనేక మందికి వ్యాపించే అవకాశాలున్నాయి. పరీక్ష చేయించుకునేందుకు బయటకు వచ్చిన వారంతా జనం మధ్య తిరుగుతుండడంతో వైరస్‌ వేగంగా విస్తరించే అవకాశాలు ఉన్నాయి. హిల్స్‌ పరిధిలో పదుల సంఖ్యలో కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.


ఉదయం నుంచే క్యూ...

కరోనా రెండో దశ విజృభిస్తుండడంతో వైరస్‌ అనుమానితులు కూడా పెరిగిపోతున్నారు. దగ్గు, జ్వరం వచ్చిదంటే చాలు కరోనా అనే భయంతో పరీక్షా కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. అయితే వైరస్‌ సోకిందో లేదో తెలియదు కానీ ఆరోగ్య కేంద్రాల చుట్టూ తిరిగి నీరసం, కాళ్ల నొప్పుల బారిన మాత్రం పడుతున్నారు. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌లో మూడు చోట్ల కరోనా పరీక్షా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 7, రోడ్డు నెంబరు 3, ఫిలింనగర్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. రెండో దశ మొదట్లో రోజుకు యాభై నుంచి డెబ్బై మంది అనుమానితులు పరీక్ష చేయించుకునేందుకు వచ్చే వారు.


వైరస్‌ వేగంగా విస్తరిస్తుండడంతో అనుమానితుల సంఖ్య కూడా పెరుగుతోంది. మూడు రోజులుగా రోడ్డు నెంబరు 7 ఆరోగ్య కేంద్రానికి రోజుకు 170 నుంచి 200 మంది పరీక్షలు చేయించుకునేందుకు వస్తున్నారు. కానీ యాంటిజెన్‌ కిట్‌లు 50-60 మాత్రమే ఉండడంతో అవి అయిపోయే వరకు పరీక్షలు చేసి వైద్య సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. దీంతో పరీక్ష చేయించుకొని వారు మధ్యాహ్నం వరకు అవకాశం వస్తుందేమోనని ఎదురు చూసి చివరకు ఇంటికి చేరుకుంటున్నారు. మరుసటి రోజు ఉదయమే పరీక్ష కోసం కేంద్రానికి వస్తున్నారు. ఫిలింనగర్‌, షౌకత్‌నగర్‌లో కూడా ఇదే పరిస్థితి. కిట్‌లు పదుల సంఖ్యలో ఉంటే అనుమానితులు మాత్రం 150 కి పైగా ఉంటున్నారు.


పొంచి ఉన్న ప్రమాదం..

కరోనా పరీక్ష కోసం ఆరోగ్య కేంద్రాలకు వచ్చే వారిలో కొంతమందికే పరీక్షలు జరుగుతున్నాయి. మిగతా వారు ఇంటికి తిరిగి వెళ్తుతున్నారు. ఇలా తిరిగి వెళ్లే వారిలో ఎంతమంది కరోనా బారిన పడ్డారు అనేది తెలియదు. కానీ పాజిటివ్‌ లక్షణాలు ఉన్నవారు కూడా సాధరణ ప్రజానికంతో కలిసి తిరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఆరోగ్య కేంద్రాల వద్ద ప్రణాళిక లేకపోవడం కూడా సమస్యగా మారింది. కేంద్రాల్లో కిట్‌లు ఎన్ని ఉంటే అంతే మందికి అవకాశం కల్పించి మిగతా వారిని వెంటనే ఇంటికి వెళ్లి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించే పద్ధతి ఉంటే బాగుంటుంది. ఎంత మంది క్యూలో ఉన్నా సరే ఉన్నతాధికారులు మాత్రం పరిమిత సంఖ్యలో పరీక్షలు చేయాలని ఆదేశాలివ్వడంతో వైద్య సిబ్బంది కూడా చేతులు ఎత్తేస్తున్నారు. దీంతో కరోనా మరింత విస్తరించే ప్రమాదం ఉంది.


తగ్గుతున్న పాజిటివ్‌ల సంఖ్య

కరోనా పాజిటివ్‌ల సంఖ్య తగ్గుముఖం పట్టింది. నెల రోజులుగా భారీ సంఖ్యలో కేసులు నమోదవుతూ వచ్చాయి. తాజాగా సగానికి పైగా కేసుల సంఖ్య తగ్గింది. బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 7లోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం 50 మందికి పరీక్షలు నిర్వహించగా ఒక్కరికి మాత్రమే పాజిటివ్‌ వచ్చింది. షౌకత్‌నగర్‌లో 70 మందిలో ఎనిమిది మందికి. జూబ్లీహిల్స్‌ ఆరోగ్య కేంద్రంలో 65 మందిలో నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

Updated Date - 2021-05-11T16:27:04+05:30 IST