YSRCP : 981 పదవుల్లో 742 రెడ్లకే!

ABN , First Publish Date - 2022-06-04T09:16:32+05:30 IST

ప్రభుత్వ నామినేటెడ్‌ పదవుల్లో ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట..

YSRCP : 981 పదవుల్లో 742 రెడ్లకే!

  • ‘నామినేటెడ్‌’లో సీఎం జగన్‌ సొంత సామాజికవర్గానికే 76 శాతం
  • 12 మంది వీసీల్లో 10 మంది, 42 మంది సలహాదారుల్లో 35 మంది  ఆ వర్గం వారే
  • సామాజిక న్యాయంపై చర్చకు మంత్రులు సిద్థమా?
  • వైసీపీ ఎంపీ రఘురామ రాజు సవాల్‌


న్యూఢిల్లీ, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ నామినేటెడ్‌ పదవుల్లో ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేశారని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శించారు. ఈ అంశంపై సామాజిక న్యాయ భేరి పేరిట బస్సు యాత్ర చేసిన మంత్రులతో తాను చర్చకు సిద్ధమని సవాల్‌ విసిరారు. హైదరాబాద్‌, ఢిల్లీలో లేదా వర్చువల్‌గా అయినా చర్చకు తాను సిద్ధమని ఆయన శుక్రవారం ఢిల్లీలో ప్రకటించారు. సామాజిక న్యాయం తాను మాత్రమే చేసినట్లు, ఈ భూమండలం పుట్టిన తర్వాత ఎవ్వరూ చేయలేదన్నట్టుగా ప్రచారం చేసుకోవడం ముఖ్యమంత్రి జగన్‌కే చెల్లిందని ఎద్దేవ చేశారు. జగన్‌ ప్రభుత్వం 981 నామినేటెడ్‌ పదవుల నియామకం చేపడితే, అందులో 742 మంది(76శాతం) రెడ్లకే ఆ పదవులను కట్టబెట్టారని రఘురామ వివరించారు. రాష్ట్రంలో 12 వైస్‌ ఛాన్సలర్‌ పదవులలో పదిమంది సీఎం సామాజికవర్గానికి చెందిన వారినే నియమించారని తెలిపారు. ఇక ప్రభుత్వ సలహాదారులుగా 42 మందిని నియమించుకున్న ముఖ్యమంత్రి అందులో 35 పోస్టులను తన సామాజికవర్గానికి చెందిన వారికే ఇచ్చుకున్నారని రఘురామ తెలిపారు.


ప్రభుత్వ విప్‌ పదవులలో నలుగురు రెడ్లు ఉంటే, ఒక్క బీసీకి మాత్రమే అవకాశం ఇచ్చారని, ప్రభుత్వ న్యాయవాదులలో 30 మంది రెడ్లు ఉండగా, కేవలం ఐదుగురు మాత్రమే బీసీలు ఉన్నారని రఘురామ రాజు తెలిపారు. తాను చెప్పిన ఈ జాబితాలో ఏమైనా తప్పులు ఉంటే మంత్రి బొత్సా సత్యనారాయణతో సహా ఎవరు చర్చకు వచ్చినా తాను సిద్థమేనని రఘురామరాజు స్పష్టం చేశారు. సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లోనే విక్రయించాలన్న ప్రభుత్వ నిర్ణయం మతిలేని తింగరి చర్య అని ఆయన ధ్వజమెత్తారు.


సినిమా టికెట్ల విక్రయాలకు ఆన్‌లైన్‌ విధానాన్ని తెచ్చిన జగన్‌ రూ.35 వేల కోట్ల టర్నోవర్‌ జరిగే మద్యం షాపులలో డిజిటల్‌ చెల్లింపులను ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని రఘురామ రాజు డిమాండ్‌ చేశారు. కాగా, వాస్తవ పరిస్థితి తెలుసుకునేందుకు రుషికొండ వెళ్లేందుకు ప్రయత్నించిన ఎంపీ జీవీఎల్‌ నరసింహా రావును పోలీసులు అడ్డుకోవడం అనైతికమని ఆయన అన్నారు. ఇక, ప్రధానమంత్రితో జగన్‌ సమావేశం కేవలం 7-8 నిమిషాల వ్యవధిలోనే ముగిసినట్లు తనకు తెలిసిందన్నారు. పోలవరానికి రూ.55 వేల కోట్ల నిధులు మంజూరు చేయాలని అడిగినట్లుగా జగన్‌ పత్రికలో రాశారని, అయితే దానికి పెద్దాయన ఏమన్నారో సమాధానం మాత్రం అందులో రాయలేదని రఘురామ రాజు ఎత్తిచూపారు. గత ప్రభుత్వ హయాంలో రూ.16 వేల కోట్లు ఎక్కువగా అప్పు చేశారని, ఆ అప్పులను తమ ప్రభుత్వ ఖాతాలో జమ చేయకుండా, వివిధ బ్యాంకర్ల నుంచి అదనంగా రుణం పొందేందుకు అనుమతి ఇవ్వాలని మోదీని జగన్‌ కోరినట్లు తెలిసిందన్నారు. 

Updated Date - 2022-06-04T09:16:32+05:30 IST