బాలు టెన్షన్ తీర్చి... సింగర్‌గా బాట వేసిన మిత్రుడు

Sep 26 2020 @ 18:54PM

ఆ గాత్రం నుంచి ఎన్నో మధుర గీతాలు జాలువారాయి. ఆ గానానికి కోట్ల మంది శ్రోతల హృదయాలు పరవశించిపోయాయి. బాధలో ఉన్న వాడికి తన పాటే ఓదార్పు. నిర్వేద క్షణాల్లో నిరుత్సాహంలో ఉన్న వాడికి తన పాటే నిట్టూర్పు. భగ్న ప్రేమికుల విరహ గీతాల నుంచి.. భగవంతుని స్మరించే భక్తి గీతాల దాకా ఆ గాత్రానికి దాసోహమయ్యాయి. ఇంతటి నేపథ్యం కలిగిన ఆ నేపథ్య గాయకుడు మరెవరో కాదు.. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఎన్నో మధుర స్మృతులను ఆయన మనకందించి వెళ్లారనడంలో అతిశయోక్తి లేదేమో. ఇంత గొప్ప గాయకుడికి తొలి అవకాశం ఇచ్చింది ప్రముఖ సంగీత దర్శకులు ఎస్పీ కోదండపాణి కాగా.. అవకాశం చేజారిందన్న నైరాశ్యంలో ఉన్న బాలూకి ధైర్యానిచ్చి ముందుకు పదమని నడిపింది మాత్రం తన స్నేహితుడన్న విషయం చాలా మందికి తెలియదు. ఈ విషయాన్ని స్వయంగా ఎస్పీబీనే ఓ సందర్భంలో పంచుకున్నారు. ఆ సమయంలో ఏం జరిగిందో ఎస్పీబీ మాటల్లోనే యథాతథంగా...(ఈ సమాచారానికి సంబంధించిన వీడియో కింద చూడండి.. బాలు ఈ వీడియోలో కొంత ఇంగ్లీష్, మరికొంత తమిళ భాషలో మాట్లాడారు)

వీడే (ఎస్పీబీ మిత్రుడు మురళి) గనక ఆ రోజు లేకుంటే నేను ఇవాళ సింగర్‌గా మీ ముందు ఉండేవాడినే కాదు. మేమిద్దరం చెన్నైలో రూంమేట్స్... తను రేడియో ఇంజనీరింగ్ చదువుతుండేవాడు.... నేను ఇంజనీరింగ్ చదువుతుండేవాడిని. శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న సినిమాలో మొదటి పాట రికార్డింగ్ రోజున మధ్యాహ్నం 2 గంటలకు కాల్ షీట్ ఉంది. రెండు మూడు రోజుల ముందే మేము రిహార్సల్ చేశాము. సుశీలమ్మ, పీబీ శ్రీనివాస్, రఘురామయ్య లాంటి దిగ్గజాలతో కలసి ఆ పాట పాడాల్సి ఉంది. మధ్యాహ్నం 2 గంటలకు కారు వచ్చి నన్ను స్టూడియోకు తీసుకెళుతుందని సినిమా యూనిట్ వారు చెప్పారు. నాకు మూడు మంచి జతల బట్టలుండేవి... వాటిలో మంచిది వేసుకుని కారు కోసం వెయిట్ చేస్తున్నాను. చాలా టెన్షన్‌గా ఉంది... అప్పటి వరకూ రికార్డింగ్ థియేటర్ ఎలా ఉంటుందో నేను చూడలేదు. సమయం 2 గంటలు దాటి మూడు... మూడున్నర కూడా అయ్యింది. సినిమావాళ్ళ కారు రాలేదు. నేనేమో.... బహుశా ప్రొడ్యూసర్లకు నా పాట నచ్చలేదేమో... అందుకే వాళ్ళు కారు పంపలేదని అనుకుని ఆగిపోయాను. నా పక్కనున్న ఈ మిత్రుడు మాత్రం... బహుశా మరేదైనా కారణం ఉండి ఉండవచ్చు... మనమే వెళ్ళి చూద్దాం అన్నాడు. నాకు అప్పట్లో ఫోన్ సౌకర్యం లేదు. ఇప్పటి రోజుల్లాగా సెల్ ఫోన్‌లు అప్పుడు లేవు. ఏదో పొరపాటు జరిగి ఉంటుంది... మనమే రికార్డింగ్ థియేటర్‌కి పోదాం రా... అని తను అన్నాడు. నేనేమో.... నో... వాళ్ళకు నేను కావాలనుకుంటే కారు పంపేవారు... కారు రాలేదు... వెళ్ళవద్దు అన్నాను.


చెన్నై విజయా గార్డెన్స్‌లో ఉన్న రికార్డింగ్ థియేటర్‌కు వెళదామని నేను వేసుకున్న ఆ మంచి బట్టలు తీసేసి ఎక్కడికైనా వెళదామని అనుకుంటుంటే... తను ఆపేశాడు. అప్పట్లో మా ఇద్దరికీ సైకిళ్ళు ఉండేవి... మనిద్దరం విజయా గార్డెన్స్ వెళదాం... ఏం జరుగుతుందో చూద్దాం.... అన్నాడు. ఎవరో తెలియని మమ్మల్ని విజయా గార్డెన్స్‌లోకి ఎవరు రానిస్తారు? అన్నాను. అయినా సరే... ఫరవాలేదు రారా అంటూ ఈ మిత్రుడు నన్ను లాక్కెళ్ళాడు. చెన్నై చూళైమేడు హైరోడ్‌లోని ఆత్రేయపురం నుంచి అక్కడికెళ్ళాం. నేను వెనకాల ఉన్నాను... వీడు ముందున్నాడు. విజయా గార్డెన్స్ దగ్గర ఒక మలయాళీ ఆయన సెక్యూరిటీగా ఉండేవారు. మావాడు వెళ్ళి ఆయనకు గుడ్ ఈవినింగ్ చెప్పాడు. ఏంటీ.... అని అడిగాడు ఆ సెక్యూరిటీ గార్డు. మావాడు నన్ను చూపించి... ఈయన నా ఫ్రెండు... ఇవాళ ఒక సినిమా కోసం రికార్డింగ్ థియేటర్‌లో పాట పాడాల్సి ఉంది... కారు రాలేదు... కాస్త లోపలికి పంపిస్తే చాలు.... అన్నాడు.


అప్పుడు ఆ సెక్యూరిటీ గార్డు.... ఓ మీ ఫ్రెండ్ పాడతారా... యాక్టింగ్ చెయ్యరా... అని వెటకారంగా అన్నారు. ఏరా... మీ అమ్మానాన్నా కష్టపడి డబ్బులిచ్చి... చదువుకోమని కాలేజీకి పంపిస్తే మీరు ఇక్కడికొచ్చి విజయా గార్డెన్స్‌ చూద్దామా... స్టూడియోలు చూద్దామా... అని అబద్ధాలు చెబుతున్నారు. పొండ్రా... అని కసిరాడు. నాకు ఏడుపు ఒక్కటే తక్కువ... ఈ అవమానం నాకు వద్దురా అంటూ పోదామన్నాను... నా ఫ్రెండేమో ఉండ్రా అని నన్ను ఆపి... సెక్యూరిటీ గార్డుతో... సార్ ఈ రెండు సైకిళ్ళూ మావే... ఇక్కడే పెడతాం... నన్ను లోపలికి పంపండి (బాలూ బయటే ఉండాలి...) నేను లోపలికెళ్ళి ప్రొడక్షన్ వాళ్ళు ఎవరినైనా పిలుచుకొస్తాను. వాళ్ళు సరేనంటేనే మావాడిని (బాలును) కూడా లోపలికి పంపండి అన్నాడు. ఆ సెక్యూరిటీ గార్డు కాస్త ఆలోచించి జాలి కలిగిందో ఏమో... నా ఫ్రెండును లోపలికి పంపుతూ... నువ్వెళ్ళి తొందరగా రా... షూటింగ్ అది చూస్తూ ఉండిపోకు అని పంపాడు. నా మిత్రుడు లోపలికెళ్ళి ప్రొడక్షన్ వారిని పిలుచుకువచ్చాకే నేను లోపలికెళ్ళాను. నేను వెళ్ళేసరికి సుశీలమ్మ, పీబీ శ్రీనివాస్ గారు... అందరూ వచ్చేశారు. రెండు గంటలకల్లా అక్కడ ఉండాల్సిన నేను 4 గంటలకు వెళ్ళాను. మ్యూజిక్ డైరక్టర్ నన్ను చూసి... నువ్వేమైనా ఘంటశాల, టీఎం సౌందరరాజన్ (సుప్రసిద్ధ తమిళ నేపథ్య గాయకుడు) అనుకుంటున్నావా... 2 గంటలకు కాల్ షీట్ అయితే 4 గంటలకు వచ్చావు... అని కోపంగా అన్నారు. నేనేమో.. సార్ మీరు పంపుతానన్న కారు రాలేదు అని చెప్పాను.... అదేంటి అతను (డ్రైవర్) 2 గంటలకే నీకోసం వెళ్ళాడు... మరి నీ దగ్గరకు కారెందుకు రాలేదు... అన్నారు. నాకు తెలియదన్నాను. చివరికి ఆయన సరే రారా... త్వరగా రిహార్సల్స్ చేసి రికార్డింగ్ చేద్దామని లోపలికి తీసుకెళ్ళారు.


ఇంతకూ ఏం జరిగిందంటే... గోపి అనే ఆ కారు డ్రైవర్ నా కోసం వస్తూ దారిలో అడ్డువచ్చిన ఒక పిల్లాడిని ఢీకొట్టాడు. అదృష్టవశాత్తూ... అతనికేమీ కాలేదు. కానీ, పోలీసులు పట్టుకుంటారేమోనన్న భయంతో ఈ డ్రైవర్ ఆ పిల్లాడిని ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్స చేయించాడు. అదయ్యాక 5 గంటలకు మా ఇంటికి వచ్చాడట. ఈ విషయం ఫోన్‌లో విజయా గార్డెన్స్‌లోని రికార్డింగ్ థియేటర్‌కు చెప్పడానికి కూడా అతను భయపడ్డాడు. ఇదీ జరిగింది. నా ఈ మిత్రుడే గనుక లేకుంటే... నేను అసలు విజయా గార్డెన్స్‌కు వెళ్ళేవాడినే కాను... గాయకునిగా నా మొదటిపాట రికార్డింగ్ అయి ఉండేది కాదు..


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.