
న్యూఢిల్లీ : భారత్-చైనా మధ్య సంబంధాలు ప్రస్తుతం సాధారణ స్థితిలో లేవని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ శుక్రవారం చెప్పారు. 1993-96 మధ్య కాలంలో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలకు విరుద్ధంగా సరిహద్దుల్లో భారీగా దళాలు ఉన్నాయన్నారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సమావేశం అనంతరం జైశంకర్ మీడియాతో మాట్లాడారు.
వాంగ్ యీతో చర్చలు ముగిసిన అనంతరం జైశంకర్ మీడియాతో మాట్లాడుతూ, తూర్పు లడఖ్ వివాదంపైనా, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఏర్పడిన సంక్షోభంపైనా చర్చించామన్నారు. అరమరికలు లేకుండా, నిజాయితీగా చాలా ముఖ్యమైన ఎజెండాపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. 2020 ఏప్రిల్‌లో చైనా చర్యల వల్ల దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించామని చెప్పారు. ఈ అంశంపై మన మనోభావాలను నిజాయితీగా తెలియజేసినట్లు తెలిపారు. సాధారణ సంబంధాల పునరుద్ధరణ జరగాలంటే, సరిహద్దుల్లో సాధారణ పరిస్థితుల పునరుద్ధరణ జరగవలసిన అవసరం ఉందని చెప్పారు.
ప్రస్తుత పరిస్థితి ‘‘పని జరుగుతోంది’’ అన్నట్లు అనుకున్నదాని కన్నా నెమ్మదిగా సాగుతోందన్నారు. వాస్తవాధీన రేఖ వద్ద సైనిక దళాల ఉపసంహరణ పూర్తి కావడం అవసరమని చెప్పారు. ఈ ప్రక్రియను మరింత ముందుకు చురుగ్గా తీసుకెళ్ళవలసి ఉందన్నారు. భారీగా సైన్యాన్ని మోహరించినంత వరకు సరిహద్దు పరిస్థితి సాధారణ స్థితికి రాబోదన్నారు. ఇప్పటికీ ఘర్షణ ప్రాంతాలు ఉన్నాయన్నారు. పాంగాంగ్ సో సహా కొన్ని ఘర్షణ ప్రాంతాల్లో సమస్యను పరిష్కరించుకోవడంలో పురోగతి సాధించినట్లు తెలిపారు. దీనిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలనేదానిపై నేడు చర్చించామన్నారు. ఇరు దేశాల మధ్య 15 విడతల చర్చలు జరిగాయని తెలిపారు.
క్వాడ్ (భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్) దేశాల సమావేశం గురించి వాంగ్ యీతో చర్చించలేదని తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్, ఉక్రెయిన్ సహా ముఖ్యమైన అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి ఈ సమావేశం దోహదపడిందన్నారు.
ఆఫ్ఘనిస్థాన్ విషయంలో భారత దేశ వైఖరి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం 2593కు అనుగుణంగా ఉంటుందని చెప్పారు. ఉక్రెయిన్ విషయంలో తమ దృక్పథాన్ని, వైఖరిని తెలియజేశామని, అయితే దౌత్యం, చర్చలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఇరువురం అంగీకరించామని చెప్పారు.
చైనాలో చదువుతున్న విద్యార్థుల గురించి...
చైనాలో చదువుతున్న విద్యార్థులు అనుభవిస్తున్న ఇబ్బందుల గురించి వాంగ్ యీతో చర్చించినట్లు జైశంకర్ తెలిపారు. కోవిడ్ ఆంక్షల సాకుతో మన దేశ విద్యార్థులను తిరిగి చైనాకు రానివ్వడం లేదన్నారు. అనేకమంది భవిష్యత్తుకు సంబంధించిన అంశమైనందువల్ల ఎటువంటి వివక్ష లేకుండా చైనా తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
దాదాపు రెండేళ్ళ క్రితం తూర్పు లడఖ్‌లో ఇరు దేశాల సైన్యాలు బాహాబాహీకి దిగిన తర్వాత ఉన్నత స్థాయి దౌత్య చర్చలు జరగడం ఇదే తొలిసారి.
ఇవి కూడా చదవండి