సాగు సగమే..!

Jul 26 2021 @ 01:02AM
రామసముద్రం మండలం కమ్మవారిపల్లె వద్ద..

సగటు కంటే 50 శాతం మించి వర్షపాతం 

అయినా, ఊపందుకోని ఖరీఫ్‌ 

(తిరుపతి, ఆంధ్రజ్యోతి) 

జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌ సీజనులో వర్షపాతం సగటు కంటే 50 శాతం మించే నమోదైంది. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమయ్యే కీలక జూన్‌, జూలై నెలల్లోనే పంటల సాగుకు అత్యంత అనుకూలమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. అయినా, పంటల సాగు మాత్రం సాధారణ విస్తీర్ణంలో 50 శాతమే జరిగింది. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా పంటల సాగు ఇంకా ఊపందుకోలేదు. అక్కడక్కడా సాగుకు పొలాలను సిద్ధం చేస్తున్నా.. జిల్లా మొత్తమ్మీద ఆ జోరు కనిపించడం లేదు. 


51 మండలాల్లో అధిక వర్షపాతం 

పీటీఎం, కురబలకోట, చౌడేపల్లె, పెనుమూరు, కలకడ, కేవీబీపురం, బి.కొత్తకోట, పీలేరు, కేవీపల్లె, సత్యవేడు, వడమాలపేట, పెద్దమండ్యం, నాగలాపురం, రామచంద్రాపురం, తిరుపతి రూరల్‌, బైరెడ్డిపల్లె, ములకలచెరువు, తంబళ్లపల్లె, కుప్పం, శాంతిపురం, పిచ్చాటూరు, మదనపల్లె, నారాయణవనం, చిన్నగొట్టిగల్లు, గుడిపాల, బీఎన్‌ కండ్రిగ, గుర్రంకొండ, ఎర్రావారిపాలెం, విజయపురం, నిండ్ర, చంద్రగిరి, నిమ్మనపల్లె, రామసముద్రం, పుంగనూరు, సోమల, సదుం, వెదురుకుప్పం, పుత్తూరు, నగరి, కార్వేటినగరం, శ్రీరంగరాజపురం, పూతలపట్టు, ఐరాల, తవణంపల్లె, యాదమరి, బంగారుపాలెం, పలమనేరు, గంగవరం, పెద్దపంజాణి, రామకుప్పం, గుడుపల్లె తదితర 51 మండలాల్లో జూన్‌, జూలై నెలలకు కలిపి సగటు కంటే అధికంగా వర్షాలు కురిశాయి. వీటిలో నాలుగైదు తూర్పు మండలాలు మినహా మిగిలినవ్నీ ఖరీఫ్‌ మండలాలే కావడం గమనార్హం. ఏర్పేడు, జీడీనెల్లూరు, రేణిగుంట, తొట్టంబేడు, వరదయ్యపాళెం, రొంపిచెర్ల, కలికిరి, వాల్మీకిపురం, పులిచెర్ల, పాకాల, చిత్తూరు, వి.కోట తదితర మరో 12 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా కేవలం శ్రీకాళహస్తి, పాలసముద్రం వంటి రెండు మండలాల్లోనే సగటు కంటే తక్కువగా వర్షాలు పడ్డాయి.


సగటు కంటే 50 శాతం అధికమే 

జూన్‌లో 78.7 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి వుండగా.. 111.2 మిల్లీమీటర్లు నమోదైంది. అంటే 41.2 మిల్లీమీటర్లు ఎక్కువ. 

జూలైలో సాధారణ వర్షపాతం 101.9 మిల్లీమీటర్లు కాగా, శుక్రవారం నాటికే 163.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నెల ముగియడానికి మరో వారం రోజులు ఉండటంతో సగటు కంటే 60.3 మిల్లీమీటర్ల వర్షపాతం అదనంగా నమోదైంది. 


సాగైంది 2.48 లక్షల ఎకరాల్లోనే 

ఖరీఫ్‌ సీజనులో సాధారణంగా 4.77 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు కావాలి. ఈ సీజనులో ఇప్పటి వరకు 2.48 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగులోకి వచ్చాయి. మిగిలిన 2.29 లక్షల ఎకరాల మెట్ట భూములు ఇంకా బీడుగానే ఉన్నాయి. 

ఫ ఖరీఫ్‌ సాగు విస్తీర్ణంలో సింహభాగం వేరుశనగ పంటదే. ఆ పంట ప్రస్తుత సీజన్‌లో 2.83 లక్షల ఎకరాల్లో సాగు చేయాల్సి ఉండగా, ఇప్పటికి 1.73 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగవుతోంది. ఇంకా 1.10 లక్షల ఎకరాల్లో వేరుశనగ వేయాల్సి ఉంది. 

ఇక, 47,887 ఎకరాల్లో వరి సాగు కావాల్సి ఉంటే, ఇప్పటికి 31,667 ఎకరాల్లో సాగు మొదలైంది. ఇంకా 16 వేల ఎకరాల్లో నాటాల్సి ఉంది. 

మరో ప్రధాన పంట చెరకు ఈ సీజనులో 39,817 ఎకరాలు చేయాల్సి ఉండగా, ఇంతవరకూ 19,500 ఎకరాలే సాగులోకి వచ్చింది. మరో 20 వేల ఎకరాలు సాగులోకి రావల్సి ఉంది. 

జొన్న, సజ్జ, మొక్కజొన్న, రాగి, ఉలవ, పెసర, పొద్దుతిరుగుడు, మినప తదితర రకాల పంటలు కూడా సాధారణ విస్తీర్ణానికంటే చాలా తక్కువగా సాగవుతున్నాయి.


ఈ మండలాల్లో చూస్తే.. 

ములకలచెరువు మండలంలో ఖరీఫ్‌ సీజనులో 12,500 ఎకరాలకుగాను 6250 ఎకరాల్లో మాత్రమే వేరుశనగ సాగులోకి వచ్చింది. మిగిలిన పొలాలన్నీ దుక్కులు పూర్తయి సాగుకు సిద్ధంగా ఉన్నాయి. 

రామసముద్రం మండలంలో 9922 ఎకరాల్లో పంటలు సాగు కావాల్సివుంటే ఇప్పటికి 4987 ఎకరాల్లో సాగవుతున్నాయి. 522 ఎకరాల్లో కావాల్సిన వరి సాగు.. ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. 6830 ఎకరాలకు గాను 4350 ఎకరాల్లో వేరుశనగ సాగైంది.


ఆలస్యమైనా ఆశాజనకంగానే.. 

ఖరీఫ్‌ సీజనులో పంటల సాగు ఆలస్యంగా మొదలవుతున్నప్పటికీ సీజను మాత్రం ఆశాజనకంగానే ఉందని వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు భావిస్తున్నారు. జూన్‌, జూలై నెలల్లో అవసరానికి మించి వర్షాలు కురవడంతో చాలావరకు రైతులు దుక్కులు దున్నుకుని, విత్తనాలు, ఎరువులు సమీకరించుకునే పనిలో పడ్డారు. దీనికి తోడు జిల్లాలో సుమారు 4.60 లక్షల రైతుల ఖాతాల్లో రైతు భరోసా నగదును ప్రభుత్వం జమ చేసింది. దీంతో రైతులు పంటలకు పెట్టుబడి పెట్టేందుకు కొంతమేరకు అనుకూలత ఏర్పడింది. ఇప్పటికే వేరుశనగ సాగుకు పొలాలు సిద్ధం చేసుకున్నారు. జిల్లా మొత్తంమీద వర్షపాతం సమృద్ధిగానే ఉన్నా గ్రామాల వారీగా కాస్త హెచ్చుతగ్గులు సహజం. దున్నేందుకు పొలాల్లో భూమి తెగేంత మెత్తబడేలా వర్షాలు కురవడం కోసం గ్రామాల్లో రైతులు నిరీక్షిస్తున్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.