ఒకేఒక్కటి ఏకగ్రీవం.. టీఆర్‌ఎస్‌ ఖాతాలోకి పదో డివిజన్‌

ABN , First Publish Date - 2021-04-23T05:23:55+05:30 IST

ఎంతో ఉత్కంఠను రేపుతున్న కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బోణీ కొట్టింది. 10వ డివిజన్‌లో ఆపార్టీ అభ్యర్థి చావా మాధురి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్పొరేషన్‌ ఎన్నికల ప్రక్రియలో గురువారం నామినేషన్ల ఉపసంహరణ పూర్తయింది.

ఒకేఒక్కటి ఏకగ్రీవం.. టీఆర్‌ఎస్‌ ఖాతాలోకి పదో డివిజన్‌
మంత్రిని కలిసిన ఏకగ్రీవ కార్పొరేటర్‌ చావా మాధురి, నారాయణరావు దంపతులు

కార్పొరేషన్‌లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ

పోటీలో 251మంది అభ్యర్థులు 

ఖమ్మం, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి) : ఎంతో ఉత్కంఠను రేపుతున్న కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బోణీ కొట్టింది. 10వ డివిజన్‌లో ఆపార్టీ అభ్యర్థి చావా మాధురి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్పొరేషన్‌ ఎన్నికల ప్రక్రియలో గురువారం నామినేషన్ల ఉపసంహరణ పూర్తయింది. నామినేషన్లు గడువు ముగిసినప్పటి నుంచి పలు పార్టీలు ఏకగ్రీవం దిశగా ప్రయత్నాలు చేశాయి. కానీ కార్పొరేషన్‌లో ఉన్న 60 డివిజన్లలో ఒకే ఒక్క డివిజన్‌లో మాత్రమే టీఆర్‌ఎస్‌కు ఏకగ్రీవమైంది. ఆ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు ఒక స్వతంత్ర అభ్యర్థి మొత్తం నలుగురు నామినేషన్లు దాఖలు చేశారు. గురువారం నామినేషన్ల ఉపంసంహరణ సమయం ముగిసేసరికి  మిగిలిన ముగ్గురు అభ్యర్థులు తమ నానిమేషన్లు ఉపసంహరించుకోవడంతో  టీఆర్‌ఎస్‌ తరపున నామినేషన్‌ వేసిన చావా మాధురి ఎన్నిక లాంఛనమైంది. ఈ సందర్భంగా చావా మాధురి, మాజీ కార్పొరేటర్‌ నారాయణరావు దంపతులు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని మంత్రి అభినందించారు. 

251మంది బరిలో.. 

నామినేషన్ల దాఖలు సమయం ముగిసే సమయానికి మొత్తం 60డివిజన్లకు గాను 417 మంది అభ్యర్థుల నుంచి మొత్తం 522 నామినేషన్లు రాగా.. అందులో టీఆర్‌ఎస్‌ నుంచి అత్యధికంగా 163, బీజేపీ నుంచి 84, కాంగ్రెస్‌ నుంచి 125, సీపీఎం నుంచి 35, సీపీఐ నుంచి ఏడు, టీడీపీ నుంచి 16, ఇతర పార్టీల నుంచి 16, స్వతంత్ర అభ్యర్థుల నుంచి 76నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా ఆయా నామినేషన్ల పరిశీలన అనంతరం తొమ్మిది నామినేషన్లను అధికారులు తిరస్కరించగా 405 మంది అభ్యర్థులు మిగిలారు. అయితే గురువారం నామినేషన్ల ఉపసంహరణ సమాయానికి 155 నామినేషన్లను ఆయా అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. అందులో బీజేపీ నుంచి 21, సీపీఐ నుంచి 5, సీపీఎం నుంచి 21, కాంగ్రెస్‌ నుంచి 36, టీఆర్‌ఎస్‌ నుంచి 36, టీడీపీ నుంచి ఆరుగురు, ఇతర పార్టీల నుంచి ముగ్గురు, 27మంది స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఈప్రక్రియ అనంతరం 251మంది అభ్యర్థులు బరిలో  ఉండగా అందులో బీజేపీ 47, సీపీఐ 3, సీపీఎం 9, కాంగ్రెస్‌ 48, టీఆర్‌ఎస్‌ 57, టీడీపీ 8, ఇతర పార్టీలు 12, స్వతంత్రులు 67 మంది పోటీలో ఉన్నారు.

ఏకగ్రీవంతో.. మాధురి రికార్డు.. 

ఖమ్మం కార్పొరేషన్‌, ఏప్రిల్‌ 22: కార్పొరేషన్‌ ఎన్నికల్లో పదోవార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలో దిగిన చావా మాధురి రికార్డు సృష్టించారు. మొత్తం 60డివిజన్లలో ఆమె పోటీ చేస్తున్న ఒకేఒక్క డివిజన్‌ ఏకగ్రీవం కావడంతో ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరపున ఎన్నికైన తొలి కార్పొరేటర్‌గా ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు. సరిగ్గా నామినేషన్ల ఉపసంహరణ రోజున ఆ డివిజన్‌ బరిలో దిగిన కాంగ్రెస్‌ అభ్యర్థి వంగవీటి ధనలక్ష్మి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరడం, మరో ఇద్దరు అభ్యర్థులు కూడా తమ నామినేషన్లను ఉపసంహరించకోవడంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చావా మాఽధురి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో ఈ డివిజన్‌ 22వ డివిజన్‌గా ఉండగా.. పునర్విభజనలో 10వ డివిజన్‌గా మారింది. గతంలో కార్పొరేటర్‌గా ప్రాతినిధ్యం వహించిన చావా నారాయణరావు డివిజన్‌ వ్యాప్తంగా పలు అబివృద్ధి, సుందరీకరణ పనులు చేయించి.. నగరంలోనే ఉత్తమ డివిజన్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేశారు. అయితే ఈ సారి కూడా ఆయన బరిలో ఉంటారని భావించగా.. పునర్విభజన తర్వాత రిజర్వేషన్ల కేటాయింపులో పదో డివిజన్‌ జనరల్‌ మహిళకు రిజర్వ్‌ కావటంతో నారాయణరావు సతీమణి మాధురి అభ్యర్థిత్వం ఇచ్చారు. ఈ క్రమంలో ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడగానే డివిజన్‌లోని ఓటర్లంతా చావా మాధురికి తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. గతంలో కార్పొరేటర్‌గా పనిచేసిన చావా నారాయణరావు ఎంతో అభివృద్ధి చేశారని, అభివృద్ధికే తాము ఓటు వేస్తామని, ఇతర అభ్యర్థులు తమ వద్దకు రావద్దంటూ డివిజన్‌లోని పలు వీధుల్లో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. కాగా డివిజన్‌ ప్రజలంతా చావా మాధురికి మద్దతుగా నిలబడటంతో ప్రత్యర్థులు కూడా ఆమెకు మద్దతు తెలుపుతూ తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో తొలిసారి పోటీ చేసిన మాధురి ఏకగ్రీవంగా ఎన్నికై అభివృద్ధికే ప్రజలు పట్టం కడతారని నిరూపించారు. మాధురి ఏకగ్రీవంగా ఎన్నికవడం పట్ల హర్షం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ హర్షం వ్యక్తం చేశారు. 


Updated Date - 2021-04-23T05:23:55+05:30 IST