‘ఉత్త’ర్వులేనా..!

ABN , First Publish Date - 2021-10-06T06:10:07+05:30 IST

ప్రభుత్వం సూక్ష్మసేద్య పరికరాలను రైతులకు అందిస్తామని జూలైలో ప్రకటించింది. ఉత్తర్వులు జారీచేసిన రెండు నెలల తర్వాత అంటే సెప్టెంబరు 1 నుంచి ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పింది.

‘ఉత్త’ర్వులేనా..!

సూక్ష్మ సేద్యానికి సబ్సిడీ ప్రకటనతోనే సరి 

అందులోనూ భారీగా కోత 

అమలుకు సంబంధించి మార్గదర్శకాల ఊసే కరువు

ఈ ఖరీఫ్‌కూ దాదాపు మొండిచెయ్యే

జిల్లా వాటాగా రూ.80కోట్లు కేటాయించే అవకాశం

డ్రిప్‌ కంపెనీలకు బకాయిలు

 ఏడాదికిపైగా సూక్ష్మ సేద్యం ఊసేలేదు. ప్రభుత్వం తమను కరుణించకపోతుందా అని నెలల తరబడి అన్నదాతలు ఎదురుచూపులు చూశారు. పాపం ఎట్టకేలకు సర్కారులో కదలిక వచ్చి జూలై 7న పథకానికి సంబంధించి సబ్సిడీ వివరాలను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకేముంది ఖరీఫ్‌లోనే సూక్ష్మసేద్య పరికరాలు తమకు అందబోతున్నాయని జిల్లా రైతాంగం ఆశలు పెట్టుకుంది. దాదాపు ఖరీఫ్‌ సాగు పూర్తయింది. ఆదేశాలు ఉత్తగానే మిగిలిపోయాయి తప్ప పథకం అమలులో అడుగు ముందుకు పడలేదు. ఈ సీజన్‌లో అందుతాయన్న ఆశలు కూడా అడుగంటిపోతున్నాయి. సర్కారు తీరుతో ఇక సబ్సిడీ పరికరాలు రాబోయే రబీకి కూడా కష్టమే అన్న భావనకు రైతులు వచ్చేశారు.

ఒంగోలు (జడ్పీ), అక్టోబరు 5 : ప్రభుత్వం  సూక్ష్మసేద్య పరికరాలను రైతులకు అందిస్తామని జూలైలో ప్రకటించింది. ఉత్తర్వులు జారీచేసిన రెండు నెలల తర్వాత అంటే సెప్టెంబరు 1 నుంచి ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పింది. ఇదైనా అమలులోకి వచ్చిందా.. అంటే అదీ లేదు. ఇప్పుడు అక్టోబరు కూడా వచ్చింది ‘నేతి బీరకాయలో నెయ్యి’ చందంగానే ప్రకటనలు మిగిలిపోతున్నాయి తప్ప హలధారికి మాత్రం మేలు జరగడం లేదు. సూక్ష్మసేద్య ఫలాలు తమకు అందేసరికి ఇంకో రబీ కూడా గడచిపోతుందేమో అని అన్నదాతలు పెదవి విరుస్తున్నారు. గతంతో పోలిస్తే అందించే రాయితీలలో కూడా కోత విధిస్తూ ఉత్తర్వులను ఇవ్వడం రైతులను నిరాశపరచింది. 2021-22 సంవత్సరానికి సంబంధించి పథకం అమలుకు ఆర్థిక, పరిపాలనాపరమైన ఆమోదాన్ని కూడా ఇస్తూ ప్రభుత్వం జూలై 7నే ఉత్తర్వులను జారీ చేసింది. జిల్లా యంత్రాంగం లబ్ధిదారుల ఎంపికను చేపట్టాలంటే మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. అవేవీ ఇంకా రాకపోవడంతో అధికారులు ఆదిశగా చర్యలు చేపట్టడం లేదు. పథకానికి సంబంధించి నిధుల విషయంలో మాత్రం ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. జిల్లా వాటాగా దాదాపు రూ.80కోట్లు దక్కే అవకాశం ఉంది. పదివేల హెక్టార్లలో ఈ పథకాన్ని అమలు చేసి రైతులకు లబ్ధి చేకూర్చాలని నిర్ణయించింది. కానీ అవన్నీ ప్రకటనలకే పరిమితమయ్యాయి. 


కార్యాలయం చుట్టూ తిరుగుతున్న రైతులు

ఏడాదికిపైగా పథకాన్ని అటకెక్కించిన ప్రభుత్వం ఇప్పుడైనా త్వరితగతిన రైతులకు ప్రయోజనాలు అందిస్తుందా అంటే అదీ లేదు. సబ్సిడీ ఉత్తర్వులు జారీ చేసి రెండు నెలలు దాటినా ఇంతవరకు మార్గదర్శకాలు విడుదల చేయకపోవడంతో రైతులు ఏపీఎంఐపీ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఉన్నారు.   ప్రభుత్వం వెంటనే పథకం అమలుకు సంబంధించి కార్యాచరణ మొదలుపెడితే తమకు ఉపయుక్తంగా ఉంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు.


రాయితీల్లో కోత

పథకానికి సంబంధించి బిందుసేద్యానికి గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ రైతులకు 100శాతం రాయితీని ఇవ్వగా, ఈసారి ఆ మొత్తాన్ని 90 శాతానికి కుదించింది. రెండు నుంచి నాలుగు హెక్టార్లలోపు ఉన్న రైతులకు గతంలో 90శాతం రాయితీ గత ప్రభుత్వం అందించేది. దానిని కూడా 70శాతానికి పరిమితం చేశారు. ఇక రెండు హెక్టార్లలోపు సాగు చేసే చిన్న, సన్నకారు రైతాంగానికి 90శాతం రాయితీ ఇస్తామని మార్గదర్శకాలలో ప్రభుత్వం పేర్కొంది. ఇందులో కేంద్రం వాటా 33శాతం కాగా, రాష్ట్రం వాటా 57శాతంగాను, రైతువాటాగా మిగిలిన 10శాతాన్ని భరించాల్సి ఉంటుంది. ఇక తుంపరసేద్యం విషయానికొస్తే రైతులకు కావలసిన పరికరాలను 50శాతం రాయితీపై అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.


కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల వాటా...

ఈ పథకానికిగాను కేంద్రం కూడా తన వంతు వాటాను రాష్ట్రానికి జమ చేయనుంది. ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన (పీఎంకేఎస్‌వై)లో భాగంగా ప్రతినీటి బొట్టును పొదుపుగా వాడుకోవాలనే లక్ష్యంతో ఈ పథకానికి తనవంతుగా తోడ్పాటును అందిస్తోంది. రైతులకు అందే రాయితీల్లో దాదాపు 33శాతం వరకు కేంద్రం వాటాగానే ఉండనుంది. కేంద్ర వాటా, రైతు భరించేది మినహా మిగతా మొత్తాన్ని రాష్ట్రం ఇవ్వ నుంది. పథకం అమలుకు నోచుకోని గత సంవత్సరా నికి సంబంధించి కూడా సూక్ష్మసేద్యానికి నిధుల మం జూరును కేంద్రం చేస్తూనే ఉంది. కానీ రాష్ట్రం ఆశించిన స్థాయిలో పథకం అమలుపై శ్రద్ధ చూపలేదు. సాధ్యమైనంత త్వరగా లబ్ధిదారుల ఎంపికను పూర్తిచేసి రాయితీ ఫలాలను రైతులకు అందిస్తేనే పథకం ద్వారా ఆశించిన లక్ష్యం నెరవేరుతుంది.


కంపెనీలకు కోట్లల్లో బకాయిలు

గతంలో అందించిన పరికరాలకు సంబంధించి కంపెనీలకు కోట్లల్లో బకాయిలు పెండింగ్‌లో ఉండిపోయాయి. ఆ డబ్బులు చెల్లిస్తేనే పరికరాల సరఫరాకు కంపెనీలు తాజాగా ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇప్పటికే పరికరాలకు సంబంధించి టెండర్లను పిలిచింది. స్పందన పరిమితంగా ఉండటంతో మరోసారి టెండర్లకు వెళ్లడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. గతంలో ఉన్న బకాయిలు చెల్లించకుండా మళ్లీ ఇప్పుడు టెండర్లు అంటే కంపెనీలు ముందుకొచ్చేది అనుమానమే. ఈ ప్రక్రియ అంతా ముగిశాక రైతుల రిజిస్ట్రేషన్‌ పూర్తిచేయడం, కంపెనీలను పరికరాలు అందించడానికి ఒప్పించడం ఇదంతా జరిగి తమకు  పథకం ఫలాలు అందేసరికి రాబోయే రబీ సీజన్‌ కూడా అయిపోతుందేమోనని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది.


వారం పదిరోజుల్లో ప్రారంభమయ్యే అవకాశం

బి. రవీంద్రబాబు, ఏపీఎంఐపీ పీడీ

ప్రభుత్వం ఇప్పటికే రాయితీ ఉత్తర్వులిచ్చింది. పరికరాలకు సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఇది పూర్తికాగానే ఇంకో వారం, పదిరోజుల్లో  పథకం అమలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అర్హులైన రైతులందరికీ సూక్ష్మ సేద్యఫలాలు అందేలా చూడటానికి ప్రయత్నిస్తున్నాం. జిల్లావ్యాప్తంగా రైతులకు ఈ పథకంపై అవగాహన కూడా కల్పిస్తున్నాం.


Updated Date - 2021-10-06T06:10:07+05:30 IST