అయ్యో పాపం.. ముద్దులొలికే ఈ కవలలను చంపడానికి వాళ్లకు చేతులెలా వచ్చాయి.. కోర్టు తీర్పు ఏంటంటే..

Jul 28 2021 @ 11:36AM

ముద్దులొలికే కవల సోదరులు శ్రేయాన్స్, ప్రియాంశ్‌ను కిడ్నాప్ చేసి అతి క్రూరంగా హత్య చేసిన కిరాతకులకు సాత్నా జిల్లా కోర్టు తాజాగా యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం మొత్తాన్ని కుదిపేసిన ఈ ఘటనపై సాత్నా కోర్టు తాజాగా తుదితీర్పు వెల్లడించింది. ఈ తీర్పుపై చిన్నారి తండ్రి అసహనం వ్యక్తం చేశారు. దోషులకు ఉరిశిక్ష విధించే వరకు పోరాటం చేస్తానని కన్నీళ్లతో చెప్పారు. మధ్యప్రదేశ్ హైకోర్టుకు వెళతానని తెలిపారు. 


2019.. ఫిబ్రవరి 12.. ఆయిల్ వ్యాపారి బ్రిజేష్ రావత్ కుమారులు శ్రేయాన్స్, ప్రియాంశ్‌ను చిత్రకూట్‌లో కొందరు కిడ్నాపర్లు అపహరించారు. కోటి రూపాయలు చెల్లిస్తేనే వారిని వదులుతామని బ్రిజేష్‌ను హెచ్చరించారు. తొలి విడతగా బ్రిజేష్ రూ.20 లక్షలు వారికి పంపించారు. అయినా వారు కనికరం చూపకుండా ఆ చిన్నారులిద్దరినీ కిరాతకంగా హత్య చేసి, మృతదేహాలను పెద్ద రాయికి కట్టి యమునా నదిలో పారేశారు. ఈ ఘటనపై రాష్ట్రం మొత్తం ఆగ్రహం వ్యక్తం చేసింది. అసెంబ్లీ హోరెత్తిపోయింది. సాత్నా జిల్లా ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ నిరసన తెలిపారు. 


రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను పట్టుకుని అరెస్ట్ చేశారు. లక్కీ తోమర్, విక్రమ్ జీత్ సింగ్, బంటా, రాంకేష్ యాదవ్, రాజు ద్వివేది, పద్మకాంత్ శుక్లాలను అరెస్ట్ చేశారు. వీరిలో రాంకేష్ యాదవ్ జైలులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, ఈ కేసులో లక్కీ తోమర్, పద్మకాంత్ శుక్లా, రాజు ద్వివేదిలను హంతకులుగా కోర్టు నిర్ధారించింది. విక్రమ్ జీత్, బంటాను సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించిన వారిగా గుర్తించింది. వీరందరికీ వేర్వేరు సెక్షన్ల కింద శిక్షలు విధించింది. అయితే కోర్టు తీర్పుపై చిన్నారుల తండ్రి బ్రిజేష్ అసహనం వ్యక్తం చేశారు. దోషులకు ఉరిశిక్ష పడేవరకు పోరాటం చేస్తానని తెలిపారు.  

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...