YSRCP : ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా..!

ABN , First Publish Date - 2022-01-01T08:05:51+05:30 IST

ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా..

YSRCP : ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా..!

  • తాగి ఊగిన వైసీపీ ప్రజాప్రతినిధులు,  అధికారులు
  • నూతన సంవత్సర వేడుకల్లో రికార్డింగ్‌ డ్యాన్స్‌లు
  • సామాజిక మాఽధ్యమాల్లో వీడియోలు హల్‌చల్‌
  • కలెక్టర్‌ సీరియస్‌.. తహసీల్దార్‌కు షోకాజ్‌.. 
  • కోవూరు ఎమ్మెల్యే సమక్షంలోనే జరిగిందని ప్రచారం
  • సీఎం పేషీకీ చేరిన వీడియోలు


నెల్లూరు, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. అంటూ వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అమ్మాయిలతో చిందులేశారు. అంతకుముందు జరిగిన విందులో పూటుగా మద్యం సేవించి, తిన్నది అరిగేదాకా స్టెప్పులేశారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం నార్త్‌ రాజుపాళెంలోని ప్రైవేటు అతిథిగృహం దీనికి వేదికైంది. 30వ తేదీ రాత్రి ఓ వైసీపీ నాయకుడు ఏర్పాటు చేసిన ఈ నూతన సంవత్సర వేడుకలకు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, బుచ్చి, కోవూరు, కొడవలూరు, నెల్లూరుకు చెందిన పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కేక్‌ కట్‌ చేశారు. మద్యం సేవన మొదలవగానే బయటి ప్రాంతాల నుంచి రప్పించిన కళాకారులతో రికార్డింగ్‌ డాన్స్‌ ప్రారంభించారు. రాత్రి 8 గంటల నుంచి వేకువజాము వరకు కొనసాగిన ఈ కార్యక్రమంలో అమ్మాయిలతో కలిసి అధికారులు, ప్రజాప్రతినిధులు చిందులేశారు.


 ‘బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తానా..’ అంటూ బుచ్చిరెడ్డిపాళెం తహసీల్దార్‌ హమీద్‌ ఈవెంట్‌ అమ్మాయితో కలిసి స్టెప్పులేసిన వీడియో శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేసింది. రేవుల్లో ఇసుక దోపిడీ.. ఆ డబ్బుతో రేవు పార్టీలు అంటూ నెటిజన్లు దుమ్మెత్తి పోశారు. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నాయకుడంటే గిట్టని అదే పార్టీకి చెందిన కొందరు ఈ వీడియోలను సీఎం కార్యాలయానికి చేరవేసినట్లు సమాచారం. ఇదంతా ఎమ్మెల్యే సమక్షంలోనే జరిగిందని కొందరు, ఆయన వెళ్లిపోయిన తరువాత ప్రారంభించారని మరి కొందరూ ప్రచారం చేస్తున్నారు. దీని పై స్పందించిన కలెక్టర్‌ చక్రధర్‌బాబు తహసీల్దార్‌ ఎస్‌ఎం.హమీద్‌కు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. 3 రోజు ల్లో సంజాయిషీ ఇవ్వాలని ఆ నోటీసులో ఆదేశించారు.

Updated Date - 2022-01-01T08:05:51+05:30 IST