అయ్యో అన్నమయ్యా..!

Published: Sun, 15 May 2022 23:40:07 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అయ్యో అన్నమయ్యా..!అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాక గ్రామం

తూతూమంత్రంగా ఉత్సవాలకు ఏర్పాట్లు  

కన్నెత్తి చూడని టీటీడీ అధికారులు   

నేటి నుంచే అన్నమయ్య 614వ జయంతి ఉత్సవాలు 

రాజంపేట, మే 15: జో అచ్యుతానంద.. జోజో ముకుందా..

లాలి పరమానంద.. రామగోవిందా 

అమ్మపాడే ఈ కమ్మని జోల పాట వింటూ హాయిగా నిద్రపోని బాల్యాన్ని ఊహించగలమా..

చందమామ రావే.. జాబిల్లి రావే.. 

అమ్మ గొంతులోంచి ఈ చల్లని పాట వింటూ గోరుముద్దలు తిని పెరగని వారెవరైనా తెలుగు నేల మీద ఉంటారా..

అటువంటి మహానుభావుడు, పదకవితా పితామహుడు, తొలి వాగ్గేయకారుడు, పండిత పామరుడు తాళ్లపాక అన్నమాచార్యులు. ఆయన జయంతి ఉత్సవాలు సోమవారం నుంచి మూడు రోజుల పాటు తాళ్లపాకలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా టీటీడీ తాళ్లపాక ఉత్సవాలపై నామమాత్రపు చర్యలు తీసుకుందే తప్ప ఈ ఉత్సవాలపై ఏమాత్రం శ్రద్ధ చూపలేదు. సరికదా.. ఏదో వీధి కార్యక్రమాలు నిర్వహించినట్లు కేవలం ఒక్కరోజు మాత్రమే కల్యాణం, ఊంజలసేవ నిర్వహించనున్నారే తప్ప మిగిలిన రెండు రోజులు కేవలం బుర్రకథ, నాటికలకే పరిమితం చేశారు. ఈ ఏర్పాట్లపై జయంతి ఉత్సవాల ఉత్సవాల నిర్వహణపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


అన్నమయ్య ఉత్సవాలు అంటే 

వీధి సంబరాలా..?

అన్నమయ్య ఉత్సవాలంటే తెలుగు రాష్ట్రాల్లో ఓ పండుగ వాతావరణం. గత ప్రభుత్వాలు అన్నమయ్య ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అన్నమయ్య 600వ జయంతి ఉత్సవాలను జాతీయ స్థాయిలో నిర్వహించి దేశంలోనే అన్నమయ్యకు ఓ గుర్తింపు తెచ్చారు. అటువంటిది ఏదో ఒక చిన్న కుగ్రామంలో ఓ గల్లీలో చిన్నపాటి హరికథ, వీధి నాటకం ఏర్పాటు చేసినట్లు తూతూమంత్రంగా అన్నమయ్య విగ్రహం ఎదుట ఓ చిన్నపాటి కటౌట్‌, ఉత్సవాల ఏర్పాట్ల కటౌట్‌, గ్రామంలో ఓ చిన్న చలువ పందిరి వేసి ఈ కార్యక్రమాలు తాళ్లపాకలో మూడు రోజులు నిర్వహిస్తున్నారు. అదే తిరుపతిలో 5 రోజులు నిర్వహిస్తున్నారు. స్వగ్రామం తాళ్లపాకలో నిర్వహించే ఉత్సవాలు 16 నుంచి 18వ తేదీ వరకు నిర్వహిస్తారు. తొలిరోజు కల్యాణోత్సవం, ఊంజల సేవ మినహా ఇక కార్యక్రమాలు కేవలం హరికథ, తూతూమంత్రంగా నాటకాలు మాత్రమే. ఉత్సవాలు అంటే టీటీడీ అధికార యంత్రాంగమంతా తాళ్లపాకపై దృష్టి పెట్టి పెద్ద ఎత్తున ఉత్సవాలను నిర్వహించి సంగీత గోష్టిగానాలు నిర్వహించి పండిత పామరులను పిలిపించి అన్నమయ్య కీర్తిని ప్రముఖులచే చాటి చెప్పించేవారు. టీటీడీ చైర్మన్‌తో పాటు ఈవో, ఇతర ఉన్నతాధికారులు, అన్నమాచార్య ప్రాజెక్టు అధికారులందరూ ఇక్కడికి వచ్చేవారు. అటువంటిది ఆ ఊసే లేకుండా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుండటంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

తండ్రి వాగ్ధానాలను పట్టించుకోని తనయుడు

600వ జయంతి ఉత్సవాల సందర్భంగా తాళ్లపాక ముఖద్వారం వద్ద అన్నమయ్య 108 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో 2008 మే 22వ తేదీ అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత వై.య్‌స.రాజశేఖరరెడ్డి అనేక వాగ్ధానాలను చేశారు. వెనువెంటనే తాళ్లపాకలో సంగీత కళాశాలను ఏర్పాటు చేస్తామని, ప్రధాన రహదారి నుంచి తాళ్లపాక వరకు డబుల్‌లైన్‌ రోడ్డు వేసి ట్యాంక్‌బండ్‌ రీతిలో అభివృద్ధి చేస్తామని, తాళ్లపాక గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని, తాళ్లపాకను టీటీడీ దత్తత తీసుకుని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని అన్నమయ్య 108 అడుగులు విగ్రహం వద్ద పది కోట్ల రూపాయలతో శ్రీవారి ఆలయాన్ని ఏర్పాటు చేస్తామని, థీంపార్క్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రతిరోజూ అన్నమయ్య కవితలు ప్రతి ఒక్కరికీ తెలిసేలా సంగీత గోష్టిగానాన్ని నిర్వహిస్తామని, ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా, చారిత్రాత్మక ప్రదేశంగా గుర్తించి టూరిజం పరంగా అభివృద్ధి చేస్తామని ఎన్నో హామీలు గుప్పించారు. ఆయన గతించడంతో ఈ హామీలు గాలిలో కలిసిపోయాయి. ప్రస్తుతం ఆయన తనయుడు ఉమ్మడి కడప జిల్లా వాసి అయిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తాళ్లపాక అభివృద్ధిపై ఏమాత్రం దృష్టి సారించడం లేదు. ఆయన పేరిట ఉన్న అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయినా పట్టించుకోవడం లేదు. జిల్లా కేంద్రానికి ఆయన పేరు పెట్టినా ఆయన పుట్టిన గడ్డను మాత్రం ఏమాత్రం అభివృద్ధి చేయలేదు. ఇకనైనా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తాళ్లపాక అభివృద్ధిపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. 

పేలవంగా జరపడం బాధాకరం..

అన్నమయ్య జయంతి ఉత్సవాలను అత్యంత పేలవంగా నిర్వహిస్తుండటం చాలా బాధాకరం. అన్నమయ్య ఉత్సవాలంటే ఆబాలగోపాలం నుంచి పండు వయస్సు వారి వరకు ఎంతో పరవశించిపోతారు. అటువంటి మహనీయుని జయంతి ఉత్సవాలను ఎంత సంబరంగా నిర్వహించాలి అన్నది టీటీడీ వారికి చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచంలోనే అత్యంత పెద్ద ధార్మిక సంస్థ టీటీడీ. అటువంటి టీటీడీ ఈ ఉత్సవాలను నిర్లక్ష్యం చేయడం తాళ్లపాక వాసులతో పాటు అందరినీ బాధిస్తోంది. 

- పి.సి.యోగీశ్వరరెడ్డి, తాళ్లపాక గ్రామం


అన్నమయ్య కీర్తిని దశదిశలా చాటి చెప్పాలి

పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి 

రాజంపేట, మే 15: పద కవితా పితామహుడు, ప్ర ముఖ వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యుల కీర్తిని దశదిశలా చాటి చెప్పేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి తెలిపారు. తాళ్లపాక అన్నమాచార్యుల జయంతి ఉ త్సవాల సందర్భంగా ఆదివారం తాళ్లపాక గ్రామాన్ని ఆయన సందర్శించారు. అన్నమాచార్య ధ్యానమంది రం, చెన్నకేశవ, సిద్దేశ్వరస్వామి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆ గ్రామ నాయకుడు అంజన్‌రాజు తదిత రులు శాలువా, పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నమాచార్యుల జన్మస్థలి తాళ్లపాకలో అన్ని విధాలా అభివృద్ధి చేయా ల్సి ఉందని, అలాగే అన్నమయ్య రచించిన సంకీర్తనలు ప్రతి పాఠశాల విద్యార్థికి అందేవిధంగా అన్ని పాఠ్యాంశాల్లో పొందుపరచాలన్నారు. అదేవిధం గా అన్నమయ్య జయంతి ఉత్సవాలను టీటీడీ ఘనంగా నిర్వహించాలన్నారు. 

అయ్యో అన్నమయ్యా..!అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాకలో మాడవీధి దుస్థితి


అయ్యో అన్నమయ్యా..!అన్నమయ్య 108 అడుగుల విగ్రహం వద్ద శిథిలావస్థకు చేరిన సభాస్థలి ప్రాంగణం


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.