అయ్యో... ఐఏఎస్‌లు!

Published: Sun, 03 Apr 2022 00:15:45 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అయ్యో... ఐఏఎస్‌లు!

కోర్టుధిక్కార నేరానికి పాల్పడిన ఎనిమిది మంది ఐఏఎస్‌ అధికారులకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు శిక్ష విధించింది. ఇంతమంది అధికారులకు ఒకేసారి శిక్షపడడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. ఈ సందర్భంగా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏదైనా ఒక అంశంపై న్యాయస్థానాలు, ముఖ్యంగా హైకోర్టు ఆదేశాలిస్తే రాష్ట్ర ప్రభుత్వం విధిగా అమలు చేయాల్సిందే. సదరు ఆదేశాలను అమలు చేయలేని పరిస్థితి ఉంటే ఆ విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లవచ్చు లేదా సుప్రీంకోర్టులో అప్పీలు చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో ఇందుకు విరుద్ధంగా ఎందుకు జరుగుతున్నదన్నదే ప్రశ్న! ప్రభుత్వాలకు, అంటే ముఖ్యమంత్రులకు వాస్తవ పరిస్థితులను వివరించడంతోపాటు చట్టాలు, నిబంధనలు ఏమి చెబుతున్నాయో వివరించి చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ వంటి అఖిల భారత సర్వీసు అధికారులు ఎందుకుంటున్నారన్నది మరో ప్రశ్న! ముఖ్యమంత్రులు నియంతలుగా మారినంత మాత్రాన అఖిల భారత సర్వీసు అధికారులు నిమిత్త మాత్రులుగా మిగిలిపోవలసిందేనా? చట్టాలకు అనుగుణంగా వ్యవహరించవలసిన అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరించినప్పటికీ న్యాయస్థానం మౌనంగా ఉండిపోవాలా? ముఖ్యమంత్రులకు వివరించి చెప్పలేని నిస్సహాయతలో అధికారులు ఎందుకు ఉంటున్నారు? అంతమంది అధికారులకు శిక్షపడే పరిస్థితి ఉంటున్నప్పటికీ ఐఏఎస్‌ అధికారుల సంఘం ఎందుకు స్పందించడంలేదు? సచివాలయ బిజినెస్‌ రూల్స్‌ ఏం చెబుతున్నాయి? ఆచరణలో ఏం జరుగుతోంది? వంటి ప్రశ్నలకు సమాధానాలు లభించవలసి ఉంది. శిక్ష పడిన ఎనిమిది మంది అధికారులు బలిపశువులు అయ్యారా? లేక బరితెగించి న్యాయస్థానాలను ధిక్కరిస్తున్నారా? అన్నది కూడా స్పష్టం కావలసి ఉంది. న్యాయస్థానం ముందు చేతులు కట్టుకొని నిలబడవలసి రావడమే అవమానంగా అధికారులు ఫీలవుతున్నారు. కానీ... ఈ ఎనిమిది మందిలో, కొందరి ముఖాల్లో కనీస పశ్చాత్తాపం కూడా కనిపించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఒక అధికారి అయితే కోర్టు హాలు నుంచి వెలుపలికి వచ్చి... హైకోర్టు ఆదేశించిన విధంగా మనం సర్వీస్‌ చేయకపోతే ఎవరికి తెలుస్తుంది? అని వ్యాఖ్యానించారు. ఇది కచ్చితంగా బరితెగింపే అవుతుంది. తాజా వ్యవహారంలో అమలులో ఉన్న చట్టాలు, నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలల ఆవరణలో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు నిర్మించడంవల్లనే అధికారులు దోషులుగా నిలబడవలసి వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను తొలగించాలని హైకోర్టు ఆదేశించినా... ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన న్యాయమూర్తి బట్టు దేవానంద్‌ వివిధ శాఖలకు చెందిన ఎనిమిది మంది అధికారులకు తొలుత రెండు వారాలు జైలు శిక్ష విధించారు. ఆ తర్వాత అధికారులు క్షమాపణ చెప్పి వేడుకోవడంతో శిక్షను మార్చి ఏడాదిపాటు నెలకు ఒకరోజు సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు సొంత ఖర్చుతో ఒకపూట భోజనం పెట్టి వారితో గడపాలని తీర్పు ఇచ్చారు. ఇంతమంది అధికారులకు ఒకేసారి శిక్ష పడటం ఐఏఎస్‌ వ్యవస్థకే అవమానం. శిక్షపడిన అధికారుల పరిస్థితికి జాలిపడాలా? లేక అధికారానికి గులాములుగా మారినందుకు బాధపడాలా? ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ అన్న పదాన్ని ఉచ్చరించినప్పుడు ఒక విధమైన వైబ్రేషన్‌ కలుగుతుంది. అలాంటి సర్వీసుకు చెందిన అధికారులకు ఈ దుస్థితి ఏర్పడటం స్వయంకృతమే. పాఠశాలల ఆవరణలో సచివాలయ కార్యాలయాలను, రైతు భరోసా కేంద్రాలను నిర్మించాలని పాలకులు ఆదేశించినప్పుడే సంబంధిత శాఖల అధికారులు ‘కుదరదు’ అని స్పష్టం చేసి ఉండాలి కదా? మంత్రి లేదా ముఖ్యమంత్రి చెప్పినంత మాత్రాన అడ్డమైన పనులు చేయడానికి ఐఏఎస్‌ అధికారులు ఎందుకు?


అలవాటుగా... పరిపాటిగా...

ఆంధ్రప్రదేశ్‌లో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు హైకోర్టుకు వెళ్లి న్యాయమూర్తుల ముందు చేతులు కట్టుకొని నిలబడటం పరిపాటి అయింది. అయినా నిబంధనలకు కట్టుబడి ఉండాలన్న స్పృహ అధికారులలో రాకపోవడం వింతగా ఉంది. గతంలో కోర్టు ధిక్కార నోటీసులు జారీ అయినప్పుడు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమయ్యేది. న్యాయస్థానం ఆదేశాల అమలుకు పూనుకునేవారు. చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు శేషాచలం అడవుల్లో ఎర్రచందనం దొంగలను ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపిన ఘటనపై ఉన్నతాధికారుల అభీష్టానికి విరుద్ధంగా ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించారు. ప్రభుత్వం ఆ పని చేసి ఉండకపోతే న్యాయస్థానమే విచారణకు ఆదేశించి ఉండేది. అమరావతిలో భూములను అభివృద్ధి చేసే విషయమై సింగపూర్‌ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని కొంతమంది హైకోర్టులో చాలెంజ్‌ చేయగా... న్యాయస్థానం మనోగతాన్ని గమనించిన చంద్రబాబు ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకుంది. ఈ రెండు సందర్భాలలో అధికారులతోపాటు అప్పటి అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ చొరవ తీసుకొని పరిస్థితి తీవ్రతను ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. దీంతో కోర్టు ధిక్కారాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడలేదు. ఇప్పుడు జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందుకు విరుద్ధంగా జరుతుండటానికి కారణం ఏమిటి? ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి పరిస్థితి వివరించి ఒప్పించడంలో అధికారులతోపాటు అడ్వకేట్‌ జనరల్‌ కూడా విఫలమవుతున్నారు. తోటకూర దొంగిలించిన నాడే అన్నట్టుగా అధికారులు మొదట్లోనే అభ్యంతరాలు చెప్పి ఉంటే అధికారులకు ప్రస్తుత దుస్థితి దాపురించి ఉండేది కాదు. ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్యంగా సచివాలయ భవనాలకు వైసీపీ రంగులు వేయాలని జగన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. రాజకీయ పార్టీల రంగులు ప్రభుత్వ భవనాలకు వేయడం చట్టవిరుద్ధం. అయినా అధికారులు అవేవీ పట్టించుకోకుండా ఉత్తర్వులు జారీచేశారు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టింది. వెయ్యి కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి వేసిన రంగులను తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రజాధనం ఈ విధంగా దుర్వినియోగం కావడానికి కారణం ఎవరు? ఈ వివాదంలో పలువురు అధికారులు న్యాయస్థానం ముందు చేతులు కట్టుకొని నిలబడవలసి వచ్చింది. అమలులో ఉన్న నిబంధనల ప్రకారం ప్రభుత్వాలు చేసే తప్పొప్పులకు సంబంధిత శాఖల కార్యదర్శులే బాధ్యత వహించవలసి ఉంటుంది. అందుకే నిర్ణయం ఎవరిదైనా అధికారులే శిక్షలు అనుభవించవలసి వస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయాలని పాలకులు ఆదేశించినప్పుడే సంబంధిత ఫైలుపై కుదరదు అని అధికారులు స్పష్టం చేశారో లేదో తెలియదు. అలా చేసివుండకపోతే ఏ అధికారి అయినా శిక్షార్హుడే. బిజినెస్‌ రూల్స్‌ ప్రకారం ప్రభుత్వ ప్రతిపాదనలు నిబంధనలకు విరుద్ధంగా ఉంటే వాటిని తిరస్కరించే అధికారం సంబంధిత శాఖల కార్యదర్శులకు ఉంటుంది. అయినా సంబంధిత మంత్రి లేదా ముఖ్యమంత్రి తమ ప్రతిపాదనలనే అమలు చేయాలని పట్టుబట్టే పక్షంలో నిబంధనలను మళ్లీ ప్రస్తావిస్తూ సదరు ప్రతిపాదన అమలు చేయడానికి వీలులేదని స్పష్టం చేస్తూ ఫైలును మళ్లీ మంత్రి లేదా ముఖ్యమంత్రికి పంపే వెసులుబాటు కార్యదర్శులకు ఉంటుంది. అలాంటి సందర్భాలలో ప్రభుత్వం అధికారుల అభ్యంతరాలను పట్టించుకోకుండా తన నిర్ణయం తాను తీసుకోవచ్చు. అలాంటప్పుడు తుది బాధ్యత ముఖ్యమంత్రిదే అవుతుంది. అధికారులు సేఫ్‌గా ఉంటారు. ప్రస్తుత వివాదంలో అధికారులు నోట్‌ ఫైల్‌లో ఏమి రాశారో తెలియదు. మంత్రి లేదా ముఖ్యమంత్రి మౌఖికంగా ఇచ్చిన ఆదేశాలను అమలుచేసి ఉంటే శిక్షపడిన అధికారుల పట్ల జాలి పడవలసిన అవసరం లేదు.


అప్పటి భయం నేడేదీ?

గతంతో పోల్చితే ప్రస్తుత ముఖ్యమంత్రులకు కోర్టులంటే లెక్కలేకుండా పోయింది. హైకోర్టు తీర్పులు, వ్యాఖ్యల వల్ల ముఖ్యమంత్రులుగా ఉండిన నీలం సంజీవరెడ్డి, నేదురుమల్లి జనార్దన్‌ రెడ్డి తమ పదవులకు రాజీనామా చేసిన ఉదంతాలను తెలుగునాట చూశాం. ఇప్పటి ముఖ్యమంత్రులు న్యాయస్థానం తీర్పులు, ఆదేశాలను అమలు చేయవలసిన అవసరం లేదన్న ధోరణి ప్రదర్శించడం విషాదం. ప్రభుత్వం ఎవరిదైనా న్యాయస్థానం ఆదేశాలను అమలుచేసి తీరాల్సిందే. అయితే... ఇక్కడ న్యాయస్థానం ఆదేశాలను అధికారులు ధిక్కరిస్తున్నారా? పాలకులు ధిక్కరిస్తున్నారా? అన్నది తేలాల్సి ఉన్నది. ఈ సందర్భంగా న్యాయస్థానాలకు ఒక విన్నపం! కోర్టు ధిక్కార కేసులలో తమ ఆదేశాలు అమలు కాకపోవడానికి కారకులు ఎవరో తెలుసుకొనే ప్రయత్నం న్యాయస్థానం చేస్తే మంచిది. ఎనిమిది మంది అధికారులకు శిక్ష విధించిన న్యాయమూర్తి తన ఆదేశాలు అమలు కాకపోవడానికి కారకులు ఎవరో తెలుసుకోవడానికై నోట్‌ ఫైల్‌ను పరిశీలించి ఉండాల్సింది. ఏ కేసులో అయినా నోట్‌ ఫైల్‌ను న్యాయస్థానం పరిశీలిస్తే ధిక్కార ధోరణులు తగ్గుతాయి. పాఠశాల ఆవరణలో ఇతర భవనాలు నిర్మించిన విషయమై నోట్‌ ఫైల్‌లో అధికారులు నిబంధనలను పేర్కొన్నారా? పేర్కొన్నప్పటికీ సదరు అభ్యంతరాలను ముఖ్యమంత్రి తోసిపుచ్చారా? అన్నది తెలియవలసి ఉంది. అధికారులు నిబంధనల ప్రకారం వ్యవహరించి ఉంటే శిక్ష పడాల్సింది అధికారులకు కాదు, ముఖ్యమంత్రికి! ఉన్నత న్యాయస్థానాలు ఇకనైనా ఈ అంశంపై దృష్టి పెడితే దోషులు ఎవరో తేలిపోతుంది. ముఖ్యమంత్రి స్థాయిలో తప్పు జరిగినప్పుడు అధికారులను శిక్షించి ప్రయోజనం ఉండదు. అఖిల భారత సర్వీసు అధికారులకు ఎన్నో రక్షణలు కల్పించారు. అధికార జులుంకు తలొగ్గి అడ్డమైన పనులు చేయవలసిన అవసరం వారికి లేదు. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించినంత మాత్రాన వారిని ఏ ముఖ్యమంత్రి కూడా ఉద్యోగం నుంచి తొలగించలేరు. ఐఏఎస్‌ సర్వీసుకే ఎంతో వన్నె తెచ్చిన అధికారులను మనం చూశాం. ఇప్పటికీ అలాంటి వారి గురించి చెప్పుకుంటున్నాం. అలాంటి సర్వీసుకు చెందిన అధికారులు ఇప్పుడు ఎందుకిలా తలవంపులు కొనితెచ్చుకుంటున్నారు? పోస్టింగుల కోసం అధికారానికి దాసోహం అని ఎందుకంటున్నారు? ఆంధ్రప్రదేశ్‌ విషయమే తీసుకుందాం, కొంతమంది అధికారులు మితిమీరిన స్వామిభక్తిని చాటుకుంటున్నారు. గతంలో ఎదురైన చేదు అనుభవాలను మరచిపోయి మరీ జగన్‌రెడ్డి సేవలో తరించడానికి ఆరాటపడుతున్నారు. ఇలాంటి వారిలో సీనియర్‌ అధికారిణి శ్రీలక్ష్మి మొదటి వరుసలో ఉంటారు. అవినీతి కేసులలో జగన్‌తోపాటు శ్రీలక్ష్మి కూడా జైలు జీవితం గడిపారు. అయినా ఆమెలో మార్పు రాకపోవడం ఆశ్చర్యంగా ఉంది. తెలంగాణకు కేటాయించబడిన ఆమె ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసి మరీ ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ అయ్యారు. ఇప్పుడు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆమెకు కూడా తాజా కేసులలో శిక్ష పడింది. అంతకు ముందు కూడా ఆమెకు హైకోర్టు పలుమార్లు చివాట్లు పెట్టింది. శ్రీలక్ష్మి బాటలోనే మరికొంత మంది అధికారులు స్వామిభక్తి ప్రదర్శిస్తున్నారు. శిక్ష పడిన ఎనిమిది మందిలో వారు కూడా ఉన్నారు. ఈ జాబితాలో ఉన్న గోపాలకృష్ణ ద్వివేదికి న్యాయస్థానంతో చివాట్లు తినడం అలవాటు అయిపోయినట్టుంది. తలెత్తుకొని పనిచేయాల్సిన అధికారులు ‘అయామ్‌ షేమ్‌లెస్‌ ఐఏఎస్‌’ అన్నట్టుగా వ్యవహరించడం శోచనీయం. ముఖ్యమంత్రులు కన్నెర్రజేస్తే ప్రాణం పోతుందన్నంత భయంతో ఎందుకు బతుకుతున్నారో తెలియదు. జగన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొంత కాలానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంను అవమానకర రీతిలో బదిలీ చేశారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో ఇదే సుబ్రమణ్యంను ఉద్దేశించి ‘ఎల్వీ అన్నా. నా చేయి పట్టుకొని నడిపించండి’ అని జగన్‌రెడ్డి అనేవారు. అయితే ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలను ఎల్వీ సమర్థించేవారు కాదు. దీంతో ఆగ్రహించిన జగన్‌రెడ్డి ఆయనను అవమానించారు. బహుశా ఈ సంఘటనతో ఐఏఎస్‌ అధికారుల వెన్నులో వణుకు పుట్టినట్టుంది. కొంతమంది ముఖ్యమంత్రికి పాదాక్రాంతులు కూడా అవుతున్నారు. ప్రధాన కార్యదర్శి పోస్టు నుంచి అప్రధాన పోస్టుకు బదిలీ అయినంత మాత్రాన ఎల్వీ సుబ్రమణ్యం కుంగిపోలేదు. నిజానికి ఆయన ఔన్నత్యం పెరిగింది. చట్టాలు, నిబంధనలను పాటించకుండా ముఖ్యమంత్రి మెప్పుకోసం మాత్రమే పనిచేసే అధికారులకు తాము ఐఏఎస్‌ అని చెప్పుకొనే అర్హత ఉండదు. ఇప్పటికైనా అఖిల భారత సర్వీసు అధికారులు ఆత్మగౌరవంతో బతకడానికి అలవాటుపడాలి. తప్పు జరిగితే ముఖ్యమంత్రి బాగానే ఉంటారు, ఫలితం అనుభవించాల్సింది వారే! దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ర్టాలలో అఖిల భారత సర్వీసు అధికారుల స్థాయి నానాటికీ దిగజారుతోంది. ఒకప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంటే పాలనా యంత్రాంగం హడలిపోయేది. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ అంటే ఆ శాఖ వణికిపోయేది. ఇప్పుడు తెలుగు రాష్ర్టాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయిని హెడ్‌ గుమస్తాగా, డీజీపీ స్థాయిని హోం గార్డు స్థాయికి కొంచెం ఎక్కువగా దిగజార్చారు. సీఎస్‌, డీజీపీ అంటే కింది స్థాయి అధికారులకు లెక్కలేకుండా పోతోంది. తాము ప్రధాన కార్యదర్శిగా, డీజీపీగా నియమితులైతే చాలు ఆత్మగౌరవం లేకపోయినా ఫర్వాలేదు, బతికేయవచ్చు అని కొంతమంది భావించడం వల్లనే ఈ దుస్థితి దాపురించింది.


తెలంగాణలో ఇలా... 

ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు తెలంగాణలో కూడా పరిస్థితులు మెరుగ్గా ఏమీ లేవు. రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై ఉగాది ఉత్సవాలను రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసి, ముఖ్యమంత్రితోపాటు అధికారులను కూడా ఆహ్వానించారు. అయితే గవర్నర్‌తో ఇటీవలి కాలంలో విభేదిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజ్‌భవన్‌కు వెళ్లలేదు. గవర్నర్‌ పట్ల ముఖ్యమంత్రి ఆగ్రహంగా ఉన్నందున రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ఉత్సవాలలో పాల్గొనకుండా అధికారులు కూడా ముఖం చాటేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సైతం గవర్నర్‌ ఆహ్వానాన్ని తిరస్కరించడం ఆశ్చర్యంగా ఉంది. రాష్ర్టాలకు సంబంధించినంత వరకు గవర్నర్లు రాజ్యాంగ అధినేతలుగా ఉంటారు. అధికారాలు అన్నీ ముఖ్యమంత్రుల వద్దే ఉండవచ్చును గానీ, రాజ్యాంగ అధిపతి అయిన గవర్నర్‌ను అవమానించడం అధికారులకు శోభనివ్వదు. రాజ్‌భవన్‌ కార్యక్రమానికి వెళ్లకపోవడం ద్వారా సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి రాజ్యాంగ వ్యవస్థను అగౌరవపరచినట్టే! ముఖ్యమంత్రికి, గవర్నర్‌కు మధ్య రాజకీయ విభేదాలు ఉంటే ఉండవచ్చుగానీ అధికారులు రాజకీయాలలో భాగం కాకూడదు కదా! ముఖ్యమంత్రి వెళ్లకుండా తాము వెళితే కేసీఆర్‌ ఆగ్రహానికి గురికావలసి వస్తుందన్న భయంతో అధికారులు రాజ్‌భవన్‌కు వెళ్లకుండా డుమ్మా కొట్టి ఉంటారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుగ్రహం, ఆగ్రహం రెండూ కూడా విపరీత స్థాయిలో ఉంటాయి. నరసింహన్‌ గవర్నర్‌గా ఉన్నప్పుడు తరచూ రాజ్‌భవన్‌కు వెళ్లి మంతనాలు జరిపిన కేసీఆర్‌, తమిళిసై గవర్నర్‌గా నియమితులైన తర్వాత ఒకటి రెండు పర్యాయాలు మాత్రమే రాజ్‌భవన్‌కు వెళ్లారు. నరసింహన్‌ దంపతులను రాజ్‌భవన్‌కు వెళ్లినప్పుడల్లా పట్టు వస్ర్తాలు, పూలు, పండ్లతో సత్కరించిన కేసీఆర్‌ నుంచి తమిళిసైకి అంటువంటి సత్కారాలు లభించకపోవడం గమనార్హం. ప్రస్తుతం రాజ్‌ భవన్‌పై ఆయన ఆగ్రహంగా ఉన్నారు. అందుకే అటువైపు తొంగిచూడ్డంలేదు. మంత్రులు, అధికారులు కూడా అదే బాటలో నడుస్తున్నారు. ఈ క్రమంలో ప్రొటోకాల్‌ను కూడా పాటించకపోవడం వివాదాస్పదం అవుతోంది. చిన జీయర్‌ విషయంలో కూడా కేసీఆర్‌ ఇలాగే వ్యవహరిస్తున్నారు. నిన్నటి వరకూ ఆయనను నెత్తికి ఎత్తుకొని కుటుంబ సమేతంగా దర్శనం చేసుకొని పాదాభివందనం చేసిన కేసీఆర్‌, ఇప్పుడు చినజీయర్‌ ముఖం చూడ్డానికి కూడా ఇష్టపడటంలేదు. యాదాద్రి నిర్మాణం ప్రారంభ దశలో పదే పదే చినజీయర్‌ను వెంటపెట్టుకొని యాదగిరిగుట్టకు వెళ్లిన కేసీఆర్‌ ఇప్పుడు నిర్మాణం పూర్తయిన తర్వాత కనీసం ఆహ్వానించలేదు. ఒకప్పుడు జీయర్‌ ఆదేశాల ప్రకారమే నిర్మాణాలు జరగాలని ఇదే ముఖ్యమంత్రి ఆదేశించారు. నిజానికి యాదగిరిగుట్టకు యాదాద్రి అన్న నామకరణం చేసింది కూడా చిన జీయరే. కేసీఆర్‌లోని ఈ విపరీత పోకడలవల్ల వ్యక్తులు మాత్రమే కాదు ప్రజలు కూడా ఇబ్బందిపడుతున్నారు.


ధాన్యం వెనుక దైన్యం

ఇటీవలి కాలంలో కేసీఆర్‌ భారతీయ జనతాపార్టీతో లడాయికి దిగారు. మిత్రత్వం అయినా శత్రుత్వం అయినా తీవ్రంగా ఉంటాయి కనుక బీజేపీపై ఆయన బుసకొడుతున్నారు. తెలంగాణ ప్రజల ముందు... ముఖ్యంగా రైతుల ముందు బీజేపీని దోషిగా నిలబెట్టడానికై కేసీఆర్‌ వడ్ల కొనుగోలు వివాదాన్ని తెరపైకి తెచ్చారు. దేశంలో ఇన్ని రాష్ర్టాలు ఉండగా తెలంగాణలో మాత్రమే ప్రతీ సీజన్‌లో ధాన్యం కొనుగోలు అంశం ఎందుకు వివాదం అవుతున్నదో తెలియవలసి ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతాన్ని ‘రైస్‌ బౌల్‌’గా పిలిచేవారు. తెలంగాణలో ఇటీవల ధాన్యం ఉత్పత్తి పెరిగింది. ‘రైస్‌ బౌల్‌’గా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం కొనుగోలు వివాదం కావడంలేదు. తెలంగాణలో మాత్రమే రైతులు నలిగిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సాలీనా 115-120 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతోంది. తెలంగాణలో కూడా ఇంచుమించుగా ఇంతే ఉత్పత్తి అవుతోంది. అయినా ధాన్యం అమ్ముకోవడంలో ఏపీ రైతులకు ఎదురవ్వని ఇబ్బందులు తెలంగాణ రైతులకే ఎందుకు ఎదురవుతున్నాయన్నది తెలియవలసి ఉంది. నిపుణులు చెబుతున్న దాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్‌లో 80 శాతం వరకు సన్నాలు పండిస్తున్నారు. ఈ కారణంగా 20 లక్షల టన్నుల బియ్యాన్ని ప్రతి ఏటా ఎగుమతి చేస్తున్నారు. తెలంగాణలో 80 శాతం వరకు దొడ్డు బియ్యం ఉత్పత్తి చేస్తున్నారు. ఉప్పుడు బియ్యం తినే అలవాటు నుంచి కేరళ వాసులు దూరమవడంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గత ఆరేడు ఏళ్ల నుంచి రైతులతో సన్న బియ్యం పండించే దిశగా చర్యలు తీసుకుంది. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోగా సన్నాలు పండిస్తే నష్టపోతారు అని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొంత కాలం క్రితం ప్రకటించారు. దీంతో రైతులు దొడ్డు బియ్యం పండించడానికే మొగ్గు చూపుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రైతుల బాటలో తెలంగాణ రైతులు కూడా నాణ్యమైన రకాల ధాన్యాన్ని మాత్రమే పండిస్తే విదేశాలకు ఎగుమతి చేసుకొనే అవకాశం ఉంటుంది. అదే జరిగితే ధాన్యం కొనుగోలుపై ఎటువంటి వివాదం ఏర్పడదని నిపుణులు చెబుతున్నారు. సన్నాల వైపు రైతులను ప్రోత్సహించవలసిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటే ఏ వివాదమూ ఉండదు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా పండించిన ధాన్యంలో సగం మాత్రమే కేంద్రం కొంటోంది. మిగతా సగంలో కొంత స్థానిక అవసరాలకు వినియోగించి మిగతా బియ్యాన్ని ఎగుమతి చేసుకుంటున్నారు. వాస్తవ పరిస్థితులను రైతులకు వివరించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లడాయికి దిగితే గోసపడేది రైతులే. పాలకులకు రాజకీయాలే ప్రాధాన్యం అయినప్పుడు నలిగిపోయేది ప్రజలే. అధికారులు కూడా ప్రజలలో భాగమే కనుక, ఏదో ఒక దశలో వారు కూడా నలిగిపోక తప్పదు. పాలకులకు తలొగ్గి విధి నిర్వహణలో అడ్డదిడ్డంగా వ్యవహరిస్తే, ఆ తర్వాత కాలంలో అంతకు అంతా అనుభవించవలసి ఉంటుందని పోలీసు అధికారులను ఉద్దేశించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ తాజాగా హెచ్చరించారు. ఈ హెచ్చరిక పోలీసులకు మాత్రమే కాదు. ఐఏఎస్‌లకు కూడా వర్తిస్తుంది. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో ఎనిమిది మంది ఐఏఎస్‌లు కోర్టు ధిక్కారం కింద శిక్ష అనుభవించవలసి వచ్చింది. అఖిల భారత సర్వీసు ఔన్నత్యాన్ని కాపాడలేని వారు ఈ సర్వీసులోకి రాకపోవడం ఉత్తమం. ముఖ్యమంత్రులు వస్తుంటారు పోతుంటారు కానీ అఖిల భారత సర్వీసు అధికారులు కనీసం 30 ఏళ్లపాటు సర్వీసులో ఉంటారు. ప్రజలకు తమపై ఉన్న నమ్మకాన్ని, గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంటుంది.

ఆర్కే

అయ్యో... ఐఏఎస్‌లు!

యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.