అయ్యో చెరవులు

ABN , First Publish Date - 2022-05-26T05:49:11+05:30 IST

ఇది కర్నూలు నగర శివారు తాండ్రపాడు వద్దనున్న గంగమ్మ చెరువు.

అయ్యో చెరవులు

  1.  అన్యాక్రాంతమవుతున్న  చెరువులు
  2.    రెండు వేల ఎకరాలకు  పైగా కబ్జా
  3.    నీటి వనరుల సంరక్షణలో   రెవెన్యూ, ఇరిగేషన  అధికారుల వైఫల్యం 
  4.    సరిహద్దు దిమ్మెలు   ఏర్పాటుకు నిధులు  ఇవ్వని ప్రభుత్వం 

  ఇది కర్నూలు నగర శివారు తాండ్రపాడు వద్దనున్న గంగమ్మ చెరువు. దీని ఫోర్‌షోర్‌ ఏరియా 112 ఎకరాలకు పైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. పంచాయతీ రాజ్‌ శాఖ పర్యవేక్షణలో ఉన్న ఈ చెరువును 2005లో మైనర్‌ ఇరిగేషన శాఖకు అప్పగించారు. ఇది ప్రభుత్వానికి చెందిన చెరువేనని ఎంఐ ఇంజనీర్లు రూ.కోట్లు ఖర్చు చేసి  అభివృద్ధి పనులు చేశారు. దీని కింద ఆయకట్టు కూడా ఉంది.  కలెక్టర్‌గా విజయమోహన ఉన్న సమయంలో హంద్రీనీవా కాలువ నుంచి ఈ చెరువులో కృష్ణా జలాలు నింపారు. తాజాగా ఈ చెరువు  తమదేనని... అన్ని రికార్డులు తమకే ఉన్నాయని కొందరు కొంత భాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాజకీయ అండతో కబ్జా చేస్తున్నారనే ఆరోపణలు రావడంతో రెవెన్యూ, మైనర్‌ ఇరిగేషన అధికారులు విచారణ చేస్తున్నారు. గ్రీన ట్రిబ్యునల్‌లో కేసు వేశారు. రూ.కోట్ల విలువ చేసే చెరువుల భూములు రక్షించాలని పలువురు కోరుతున్నారు. 

చెరువులు పల్లెలకు అందం.. తాగునీటికి ఆధారం. పర్యావరణ  రక్షణ వలయం.  అలాంటి చెరువులు కబ్జాదారుల కోరల్లో చిక్కుకుంటున్నాయి. చెరువు స్థలాలను సాధారణ భూములుగా చూపించి...కొంతమంది  పట్టాలు సృష్టిస్తున్నారు.  సాగు భూములుగా... ఇళ్ల స్థలాలుగా మార్చి విక్రయించుకుంటున్నారు. వీటిని సంరక్షించాల్సిన అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. 

(కర్నూలు-ఆంధ్రజ్యోతి)

గ్రామసీమల నీటి ఆధారం చెరువులు. వీటిని సంరక్షించాల్సిన రెవెన్యూ, జల వనరుల శాఖ అధికారుల వైఫల్యంతో అన్యాక్రాంతమవుతున్నాయి. రిజిసే్ట్రషన్లు చేస్తూ దస్తావేజులు మార్చేస్తున్నారు. నీటి నిల్వ విస్తీర్ణం తగ్గిపోతోంది. అక్రమార్కులకు రాజకీయ నేతలు, కీలక ప్రజాప్రతినిధుల అండదండలు ఉండడంతో అధికారులు గాంధారి పాత్ర పోషిస్తున్నారు. జిల్లాలో చిన్నాపెద్ద చెరువులు 310 ఉన్నాయి. దాదాపుగా 2 వేల ఎకరాలకు పైగా చెరువులో ఫోర్‌షోర్‌ భూములు ఆక్రమణదారుల చెరలో ఉన్నట్లు తెలుస్తోంది. రెవెన్యూ, ఇరిగేషన అధికారులు జాయింట్‌ సర్వే చేసి చెరువులను రక్షించాలని పలువురు కోరుతున్నారు. 

  కర్నూలు జిల్లా పరిధిలో

 చిన్న నీటి పారుదల శాఖ (మైనర్‌ ఇరిగేషన) పర్యవేక్షణలో వంద ఎకరాల ఆయకట్టు పైబడిన చెరువులు 60 ఉన్నాయి. వీటి పరిధిలో 24,266 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. వంద ఎకరాల కంటే తక్కువ ఉన్న పీఆర్‌ చెరువులు 250 ఉన్నాయి. వీటి కింద 8,847 ఎకరాల ఆయకట్టు ఉంది. నంద్యాల జిల్లా పరిధిలో 105 మైనర్‌ ఇరిగేషన్‌ (ఎంఐ) చెరువుల కింద 43,200.90 ఎకరాలు, 161 పీఆర్‌ చెరువుల కింద 5,396.10 ఎకరాల ఆయకట్టు ఉంది. ఉమ్మడి జిల్లాలో 576 చెరువుల్లో 9.22 టీఎంసీలు నిల్వ చేసి.. 81,710 ఎకరాలకు సాగునీరు అందించాలి. వర్షాభావ పరిస్థితులు తలెత్తినప్పుడు పల్లె  ప్రజల జీవనాధారమైన చెరువులు ఎక్కడికక్కడే అన్యాక్రాంతం అవుత ున్నాయి.  వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆక్రమణల జోరు మరింత పెరిగిందని... ప్రశ్నిస్తే బడా రాజకీయ నాయకుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని మైనర్‌ ఇరిగేషన ఇంజనీరు ఒకరు పేర్కొనడం కొసమెరుపు. 

  ఏం చేయాలంటే... 


రెవెన్యూ, మైనర్‌ ఇరిగేషన, డ్వామా అధికారులు సంయుక్తంగా ప్రతి చెరువు సర్వే చేయాలి. ఫోర్‌షోర్‌ ఏరియా సరిహద్దు గుర్తించాలి. ఆక్రమణలు ఉంటే నోటీసులు జారీ చేసి స్వాధీనం చేసుకోవాలి. ఎక్కడైనా రెవెన్యూ అధికారులు సాగు పట్టాలు ఇచ్చి ఉంటే వాటిని రద్దు చేయాలి. ఫోర్‌షోర్‌ సరిహద్దు గుర్తించి కాంటూర్‌ లెవల్‌లో ఉపాధి హామీ పథకం కందకాలు (ట్రెంచ) తవ్వి.. ఆ మట్టిని అడ్డుకట్టగా వేయాలి. అటవీ శాఖ తరహాలో సరిహద్దు దిమ్మెలు నిర్మించాలి. ఇందుకు పాలకుల్లో చిత్తశుద్ధి, జిల్లా యంత్రాంగంలో బాధ్యత, నిధులు కావాలి. ఇప్పటికే కర్నూలు మైనర్‌ ఇరిగేషన డివిజనలో కబ్జాకు గురవుతున్నాయనే ఆరోపణలు ఉన్న 48 చెరువుల సరిహద్దులు గుర్తించి ట్రెంచ తవ్వకాలు, సరిహద్దు రాళ్ల ఏర్పాటుకు రూ.5.27 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. ఏళ్లు గడిచినా ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు. దీన్ని బట్టి చెరువుల సంరక్షణలో పాలక పెద్దలకు ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.

 భారీగా ఆక్రమణలు

ఉమ్మడి జిల్లాలో చెరువుల నీటి నిల్వ ప్రాంతం (ఫోర్‌షోర్‌ ఏరియా) దాదాపు 25 వేల ఎకరాల విస్తీర్ణం ఉంటుందని మైనర్‌ ఇరిగేషన ఇంజనీర్లు చెబుతున్నారు. ఫోర్‌షోర్‌ సరిహద్దులు లేకపోవడంతో ఎక్కడికక్కడే చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయి. భూముల విలువ భారీగా పెరగడం... సగటున ఎకరం రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు పలుకుతుండడంతో అక్రమార్కుల కన్ను చెరువులపై పడింది. అధికార పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధుల అండదండలతో కబ్జా చేస్తున్నారు. కొన్ని గ్రామాలో రెవెన్యూ అధికారులు ఏకంగా సాగు పట్టాలు ఇచ్చారని తెలుస్తోంది. ఆ పట్టాల ఆధారంగా ఇతరులకు రిజిసే్ట్రషన్లు చేసి న్యాయ సమస్యలు రాకుండా పక్కాగా స్వాధీనం చేసుకుంటున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సుమారుగా 2 వేల ఎకరాలకు పైగా చెరువులు అన్యాక్రాంతమైనట్లు సమాచారం. ఏ చెరువు ఎంత విస్తీర్ణంలో ఉందో మైనర్‌ ఇరిగేషన అధికారుల వద్ద రికార్డులు లేవు. దీంతో చెరువుల ఆక్రమణ సులభమైంది. రికార్డుల్లోని అస్పష్టత అక్రమార్కులకు కలిసి వచ్చింది. రెవెన్యూ శాఖలో రికార్డులు ఉన్నా మైనర్‌ ఇరిగేషన అధికారులకు సహకరించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో చెరువుల ఆక్రమణలకు అడ్డుకట్ట పడడం లేదు. 

  - కల్లూరు మండలం ఉల్లిందకొండ, మద్దికెర మండలం పెరవలి, గూడూరు మండలం కె.నాగులాపురం మర్రిమాను చెరువు, నియోజకవర్గం కేంద్రం ఆలూరు చెరువులు సుమారు వంద ఎకరాలకు పైగా ఆక్రమణలకు గురైనట్లు ఇంజనీర్లు గుర్తించారు.

-  ఆదోని మండలం డాణాపురం చెరువు కింద 950 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరువు కట్ట గండి పడి కొన్నేళ్లు మరమ్మతులు చేయకపోవడంతో ఫోర్‌షోర్‌ ఏరియాలో నగరూరు గ్రామానికి చెందిన పలువురు ఆక్రమించి సాగు చేస్తున్నారు. చెరువు మరమ్మతులు చేసినా సాగు ఆగలేదని తెలుస్తోంది. ఎమ్మిగనూరు మండలం పెసలదిన్నె, బనవాసి, మంత్రాలయం మండలం కగ్గల్లు, కౌతాళం మండలం వల్లూరు చెరువులు అన్యాక్రాంతమయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. 

- నంద్యాల జిల్లాలోనూ ఇదే పరిస్థితి. జిల్లాలోని వివిధ మండలాల్లో తాగు, సాగునీటి అవసరాలు తీర్చుతున్న చెరువులు అన్యాక్రాంతమవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో మైనర్‌ ఇరిగేషన చెరువులు 105 ఉన్నాయి. వీటి నీటి నిలువ సామర్థ్యం  4,4200 ఎంసీఎఫ్‌టీలు. ఈ చెరువుల కింద సుమారు 43 వేల ఎకరాలకు పైగా ఆయకట్టు ఉంది. ఇంతగా ప్రజలకు ఉపయోగకరమైన చెరువులను కాపాడే విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారనే విమర్శలు ఉన్నాయి.  దీంతో రకరకాల సాకులతో అక్రమార్కులు చెరువు భూములను సొంతం  చేసుకుంటున్నారు. 

  సంరక్షణకు చర్యలు తీసుకుంటాం

 తాండ్రపాడు, పెరవలి, నాగులాపురం, ఉల్లిందకొండ చెరువులు కబ్జాకు గురయ్యాయనే ఫిర్యాదులు వచ్చాయి. రెవెన్యూ అధికారులతో చెరువుల భూములు రికార్డులు తీసుకొని విచారణ చేస్తున్నాం. ఎక్కడైనా కబ్జాకు గురైనట్లు ఫిర్యాదులు చేస్తే తక్షణమే సంరక్షణ చర్యలు తీసుకుంటాం. జిల్లాలో 48 చెరువుల సరిహద్దులు గుర్తించి రాళ్లు ఏర్పాటు చేసేందుకు రూ.5.27 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. 

 - శ్రీనివాసులు, ఈఈ, మైనర్‌ ఇగిరేషన, కర్నూలు:


Updated Date - 2022-05-26T05:49:11+05:30 IST