మీరు ఇక్కడ చూస్తున్న ఫొటో.. శారదా స్కూల్లోనిది. వీరు రాస్తున్నది పరీక్షలండీ. అదేమిటి? అంత దగ్గరగా కూర్చుని చిన్న పిల్లల్లా రాస్తున్నారు అనుకుంటున్నారా..? వీరి మధ్య అడుగు కూడా దూరం లేదు. గదిలో మూడు వరుస బెంచీలున్నా...రెండు వరుసలను వదిలేసి ఒక్కో బెంచీపై ఇద్దరిని కూర్చోబెట్టి పరీక్షలు రాయించారు. పైగా సెంటర్లో మాస్ కాపీయింగ్ మైక్రో స్లిప్పులు కుప్పలు తెప్పలుగా కనిపించాయి.
డీఎడ్‌లో మాస్ కాపీయింగ్ ...!
శారదా స్కూల్ సెంటర్లో ఇష్టారాజ్యం
సెంటర్ నిండా మైక్రో స్లిప్పులే
లక్షలు చేతులు మారిన వైనం
అనంతపురం: జిల్లా కేంద్రంలోని పరీక్షా కేంద్రాల్లో బరితెగించారు. డీఎడ్ సెకెండ్ ఇయర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు తెగబడ్డారు. స్లిప్పులు పెట్టి, పుస్తకాలు పెట్టి రాసేశారు. శనివారం ‘ఆంధ్రజ్యోతి’ విజిట్‌లో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. 2018-20 బ్యాచ స్పాట్ అండ్ మేనేజ్మెంట్ విద్యార్థులకు, ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 925 మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే పరీక్షల్లో వ్యూహాత్మకంగా భారీ ఎత్తున మాస్ కాపీయింగ్‌కు పాల్పడ్డారు. విద్యాశాఖాధికారులు మౌనంగా ఉండటంపై విమర్శలు వస్తున్నాయి.
శారదా స్కూల్లో స్లిప్పులే..స్లిప్పులు..
అనంతపురం జిల్లా కేంద్రంలోని శారదా మున్సిపల్ స్కూల్లో డీఎడ్ పరీక్షల కేంద్రం ఏర్పాటుచేశారు. ఈ పరీక్షా కేంద్రంలో భారీగా అక్రమాలు జరిగాయి. ఇష్టారాజ్యంగా కాపీయింగ్ నిర్వహించారు. పరీక్షా కేంద్రంలో కింది గదుల్లోనూ, పై అంతస్తులోని గదుల్లో పరీక్షలు నిర్వహించారు. చాలా మంది విద్యార్థులు పుస్తకాలు పెట్టి, స్లిప్పులు పెట్టి రాశారు. సెంటర్లోని పరీక్షల గదుల్లో ఎటుచూసినా....స్లిప్పులు పడ్డాయి. మాస్ కాపీయింగ్ సమాచారం అందుకున్న ‘ఆంధ్రజ్యోతి’ బృందం ఉదయం 11.55 గంటలకు విజిట్ చేసింది. పరీక్షా కేంద్రంలోకి మీడియా ఎంటర్ కాగానే అలర్ట్ అయ్యారు. మాస్ కాపీయింగ్ స్లిప్పులను దూరంగా విసిరారు. గదుల వద్ద ఎక్కడ చూసినా కాపీయింగ్ మైక్రో స్లిప్పులు కట్టలు, కట్టలు దర్శనమిచ్చాయి.
మామూళ్ల మత్తులో విద్యాశాఖ...
ఈ నెల 20వ తేదీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. శనివారం ఆఖరి రోజు కావడంతో మరింత రెచ్చిపోయి కాపీయింగ్ నిర్వహించారు. ఐదు రోజులుగా సెంటర్లో మాస్ కాపీయింగ్ జరుగుతోంది. పక్కా వ్యూహాత్మకంగా నిర్వహిస్తున్నారు. ప్రధాన గేటు వద్ద స్కూల్ స్టాఫ్‌ను కొంత మందిని, పరీక్ష గదుల ముం దు భాగంలో కొంత మంది స్టాఫ్‌ను ఎవరైనా వస్తే అలర్ట్ చేయడానికి ఉంచి, మొత్తం కథ నడిపారు. 5 రోజులపాటు భారీగానే ఈ తంతు నడిపినట్లు సమాచారం. పరీక్షల స్టాఫ్, స్క్వాడ్, అధికారు లకు సైతం భారీగానే డబ్బు ముట్టిందనే ఆరోపణలున్నాయి.
నోటీసులిస్తాం: శామ్యూల్, డీఈఓ
జిల్లాలో ఏ పరీక్షలైనా చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. నిన్న వచ్చిన ఓపెన్ స్కూల్ టెన్త్ పరీక్షల్లో సైతం 6.60 శాతం ఫలితాలు రావడం ఇందుకు నిదర్శనం. మాస్ కాపీయింగ్ సహించే ప్రసక్తే లేదు. డీఎడ్ పరీక్షల స్టాఫ్‌కు నోటీసులిస్తాం. దీనిపై విచారణ చేయిస్తాం. అక్రమాలకు పాల్పడినట్లయితే...ఛార్జ్స్ ఫ్రేం చేస్తాం. చర్యలు తీసుకుంటాం.