అయ్యో.. పాపం!

ABN , First Publish Date - 2021-11-06T06:03:54+05:30 IST

పేద కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకుంది. మూడేళ్ల క్రితం అనారోగ్యంతో తల్లి కన్నుమూసింది.

అయ్యో.. పాపం!
అనాథలైన చిన్నారులు

  1. మూడేళ్ల క్రితం తల్లి మృతి 
  2. మద్యానికి బానిసై.. తండ్రి మృతి 
  3. అనాథలుగా నలుగురు చిన్నారులు


మంత్రాలయం, నవంబరు 5: పేద కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకుంది. మూడేళ్ల క్రితం అనారోగ్యంతో తల్లి కన్నుమూసింది. ఆ తరువాత మద్యానికి బానిస అయిన తండ్రి బుధవారం మృతి చెందాడు. దీంతో నలుగురు చిన్నారులు దిక్కులేనివారు అయ్యారు. మంత్రాలయం మండలం వి.తిమ్మాపురం గ్రామానికి చెందిన దాసరి తిక్కరాముడు (35), దాసరి లక్ష్మి (28) దంపతులకు నలుగురు సంతానం. ఇద్దరు కూతుళ్లు దేవి (13), రాజేశ్వరి (11), ఇద్దరు కుమారులు శ్రీనివాసులు(9), భీమయ్య (6). వీరి కుటుంబానికి అర ఎకరం పొలం ఉంది. దీన్ని సాగు చేసుకుంటూ, కూలి పనులకు వెళుతూ బిడ్డలను పోషించేవారు. ఇంతటి పేద కుటుంబంలో మూడేళ్ల క్రితం విషాద ఘటన చోటు చేసుకుంది. తిక్క రాముడు భార్య లక్ష్మి అనారోగ్యంతో మృతి చెందింది. ఆ తరువాత బిడ్డల ఆలనాపాలన తానే చూసుకునేవాడు. కూతుళ్లు ఇద్దరినీ తనతోపాటు కూలి పనులకు తీసుకువెళ్లేవాడు. కొడుకులు ఇద్దరూ బడికి వెళుతున్నారు. భార్య మరణించిన తరువాత తిక్కరాముడు కుంగిపోయి, మద్యానికి బానిస అయ్యాడు. దీంతో ఆరోగ్యం దెబ్బతింది. తను బుధవారం మృతిచెందాడు. దీంతో నలుగురు పిల్లలు దిక్కులేని వారయ్యారు. మూడేళ్ల క్రితం తల్లి, ఇప్పుడు తండ్రి మరణించడంతో భోరున విలపించారు. ‘ఇక మాకు దిక్కెవరు..? మేమూ మీదగ్గరకే వస్తాం..’ అని పసివారు ఏడుస్తుంటే ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. అందరూ అయ్యోపాపం అనేవారేగానీ, వారిని అక్కున చేర్చుకునేవారు కనిపించలేదు. రేపటి నుంచి ఆ పసివారి భవితవ్యం ఏమిటన్నది అర్థంగాని పరిస్థితి. అధికారులు స్పందించి వీరి భవిష్యత్తుకు మార్గం చూపించాల్సిన అవసరం ఉంది.

Updated Date - 2021-11-06T06:03:54+05:30 IST