ఊటీలో వర్షబీభత్సం

ABN , First Publish Date - 2022-07-16T13:10:01+05:30 IST

నీలగిరి జిల్లాలో బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఈ కారణంగా మూడు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పదికిపైగా

ఊటీలో వర్షబీభత్సం

- విరిగిపడిన కొండచరియలు  

- పదిళ్లు ధ్వంసం 


అడయార్‌(చెన్నై), జూలై 15: నీలగిరి జిల్లాలో బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఈ కారణంగా మూడు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పదికిపైగా గృహాలు ధ్వంసమయ్యాయి. ఈ జిల్లాలో గత పది రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా, ఊటి, కుందా, గూడలూరు, పందలూరు తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు శుక్రవారం సెలవు ప్రకటించారు. అయితే ఏకధాటిగా వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలు కూడా చేపట్టలేని పరిస్థితి నెలకొంది.  వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా 12 ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకూలాయి. ఊటి - కూడలూరు రోడ్డు మార్గంలోని నడువట్టం అనే ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో పదికి పైగా గృహాలు దెబ్బతిన్నాయి.


కనుచూపు మేరలో నీరు

గత పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలో ఎటు చూసినా వర్షపునీరు నిలిచివుంది. ముఖ్యంగా జిల్లాలోని అన్ని చెరువులు, రిజర్వాయర్లు నిండుకుండల్లా ఉన్నాయి. ఈ రిజర్వాయర్ల నుంచి గురువారం ఒక్కరోజే ఏకంగా 10 వేల ఘనపుటడుగుల నీటిని ప్రజాపనుల శాఖ అధికారులు కిందికి విడుదల చేశారు. జిల్లాలోని బైక్కారా డ్యాం, బిల్లూరు, గెత్తై వంటి డ్యామ్‌లలో నీటి మట్టం పూర్తిస్థాయికి చేరుకుంది. 


సహాయక చర్యల కోసం కమిటీ 

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీట మునిగిన నీలగిరి జిల్లాలో సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు వీలుగా ముఖ్యమంత్రి స్టాలిన్‌ మంత్రులు, అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్ర రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి కేకేఎ్‌సఎస్ఆర్‌ రామచంద్రన్‌, విద్యుత్‌ మంత్రి సెంథిల్‌ బాలాజీ, అడిషినల్‌ చీఫ్‌ సెక్రటరీ, రెవెన్యూ కమిషనర్‌ ప్రభాకర్‌, ఇతర ఉన్నతాధికారులతో కూడిన బృందాన్ని పంపించారు. పైగా, రెండు స్టేట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ బృందాలను కూడా పంపించి, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచారు. 

Updated Date - 2022-07-16T13:10:01+05:30 IST