మంత్రి ఆదేశించినా 3 గంటల్లో ముగించేస్తున్నారు..

ABN , First Publish Date - 2022-06-15T17:04:56+05:30 IST

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సమయం తక్కువగా ఉండడంతో ఎక్కువ మంది రోగులు వైద్యసేవలు పొందలేకపోతున్నారు. సమయం పెంచాలని ఎప్పటి

మంత్రి ఆదేశించినా 3 గంటల్లో ముగించేస్తున్నారు..

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ తీరు 

సమయం దాటినా చాంతాడంత క్యూలు

సాయంత్రం వరకు ఉండాలంటున్న రోగులు


హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సమయం తక్కువగా ఉండడంతో ఎక్కువ మంది రోగులు వైద్యసేవలు పొందలేకపోతున్నారు. సమయం పెంచాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నప్పటికీ ఇప్పటివరకూ ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉదయం 8.30 నుంచి 11.30 వరకు మాత్రమే ఓపీ పనిచేస్తుంది. ఇటీవల సుల్తాన్‌బజార్‌ ప్రసూతి ఆస్పత్రిని సందర్శించిన మంత్రి హరీశ్‌రావు అక్కడి ఓపీని గమనించారు. చాలా మంది దూర ప్రాంతాల నుంచి వస్తుండడంతో సాయంత్రం 4 గంటల వరకు ఓపీ ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రుల్లో ఓపీ సమయం అయిపోయే 11.30 గంటలకు కూడా కొన్ని ఆస్పత్రుల్లో పెద్ద క్యూ ఉంటుంది. ఓపీ కేవలం మూడు గంటలు మాత్రమే ఉండడంతో ఆ సమయంలో 1000 నుంచి 1500 మంది వరకు చూడాల్సి వస్తోంది. సోమ, మంగళవారాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రసూతి ఆస్పత్రుల్లో అయితే క్యూలో రోగులు ఉన్నంత వరకు కూడా ఓపీ పనిచేయడం లేదు. కొన్ని చోట్ల సమయం అయిపోయిందని చెప్పి పంపిస్తున్నారు. ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉండడంతో మహిళలు ఉదయం ఏడు గంటలకే వచ్చి క్యూలో ఉంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కేవలం మూడు గంటలకు పరిమితం చేయడంపై రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమర్జెన్సీ బ్లాక్‌ మాదిరిగా ఓపీ బ్లాక్‌ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసేలా ఉండాలని. రోగికి అదే రోజు ల్యాబ్‌ పరీక్షలు కూడా పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు.


ఈవినింగ్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేయాలి

ప్రసూతి ఆస్పత్రుల్లో సాయంత్రం సమయంలో కూడా ఓపీ పనిచేసేలా చూడాలని వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు అధికారులను ఆదేశించారు. ఉదయం పూట సమయం తక్కువగా ఉండడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు వైద్యసేవలు పొందలేకపోతున్నారని, మరుసటి రోజు వరకు వారు వేచి చూడాల్సి వస్తుందని, అందరికీ చికిత్స అందించేందుకు వీలుగా సాయంత్రం క్లినిక్‌లు ఏర్పాటుచేయాలని మంత్రి సూచించారు. అయితే ఆ దిశగా అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.



Updated Date - 2022-06-15T17:04:56+05:30 IST