కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే సీఎంగా తప్పుకోవాలి

Nov 8 2021 @ 02:39AM

నా గెలుపుతో ఆయన ఓడినట్లే ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో ఈటల రాజేందర్‌

కేసీఆర్‌తో విధానాలపరంగానే విభేదించాను

ప్రగతి భవన్‌ పేరును బానిసల నిలయంగా మార్చుకోవాలని చెప్పినప్పుడే మొదలైంది

2018 ఎన్నికల్లో నన్ను ఓడించాలని కాంగ్రెస్‌ అభ్యర్థికి కేసీఆర్‌ డబ్బులిచ్చారు

గెలిస్తే టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవాలనుకున్నారు.. హరీశ్‌ నాతో కలుస్తాడనే మంత్రి పదవి

అలసిపోయి సొలసిపోతున్నారా.. విజయం సాధించిన కిక్కుతో హుషారుగా ఉన్నారా?

ప్రజల తీర్పు ఉత్సాహాన్నిచ్చినా.. 6నెలల అలసట ముఖంపై కనిపిస్తుంది. కేసీఆర్‌ అన్ని రకాలుగా హింస పెట్టారు.


అధికారం లేనినాడు ప్రజాస్వామ్యం అనేవారు

అధికారం దక్కాక.. అన్నీ నేనే అంటున్నారు

ఎవరికీ తెలివి ఉన్నట్లుగా అంగీకరించరు 

అన్నీ తనకే తెలుసు అంటారు

నా వాళ్లను నాపైనే కోవర్టులుగా పెట్టారు

ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరిస్తే..

టీఆర్‌ఎస్‌కు డిపాజిట్‌ కూడా వచ్చేదికాదు

ప్రజలు ఆశించిన విధంగా పనిచేయాలంటే

సరైన వేదిక అవసరమనే బీజేపీలో చేరాను 

చావనైనా చస్తాగానీ మళ్లీ టీఆర్‌ఎస్‌కు వెళ్లను

కేసీఆర్‌ సౌధాలు ఇక ఉండవు

ఈ ప్రభుత్వం కొనసాగడం అరిష్టం

‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో ఈటల రాజేందర్‌


కేటీఆర్‌ సీఎం కాకుండా మీరు అడ్డొస్తారనుకున్నారేమో?

ఎవరు సీఎం అవుతారన్నది సమస్య కాదు. మా బాధల్లా.. మమ్మల్ని మంత్రిగా కాకపోయినా మనిషిగానైనా చూడాలని కోరుకున్నాం. 2016లో కరీంనగర్‌ జిల్లా నేతలతో కలిసి ప్రగతి భవన్‌ వద్దకు వెళితే కనీసం లోపలికి రానివ్వలేదు. ఎంతో బాధపడ్డాం.. ఏడ్చాం. ఆ రోజు కేసీఆర్‌ది అహంకారం, దొరతనం అన్న గంగుల కమలాకర్‌ ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. అప్పుడే దానికి ప్రగతిభవన్‌ కాకుండా బానిసల నిలయం అని పేరు మార్చుకొమ్మని అన్నాను. అప్పట్నుంచే నాపై దృష్టిపెట్టడం మొదలైంది తప్ప.. ఏ కాంట్రాక్టుల విషయంలోనో, పంపకాల విషయంలోనో వచ్చిన సమస్య కాదు. 


2023 ఎన్నికల్లోపు మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలేంటి?

తెలంగాణ గడ్డమీద టెంట్లు వేసుకొని సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేస్తున్న సంస్థలకు గొంతుక కావడం, ప్రభుత్వ దుర్మార్గమైన విధానాలపై పోరాడడం, బీజేపీని బలోపేతం చేయడం లక్ష్యాలు.


కామన్‌ పాయింట్‌ కేసీఆర్‌ను పదవీచ్యుతుణ్ని చేయడమేనా?

ప్రజలు చేస్తారు. నరకమేంటో ఆర్నెల్లుగా ఇక్కడే చూశాను. ఈటల రాజేందర్‌.. ఈ పేరును ఇక అసెంబ్లీలో వినిపించకుండా, ఆయన ముఖం కనిపించకుండా చేయాలని సీఎం కేసీఆర్‌ భావించారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఓడించి రాజకీయంగా భూస్థాపితం చేయాలనుకున్నారు. కానీ, కేసీఆర్‌ అంచనాలను తలకిందులు చేస్తూ, అధికార పార్టీ బలాన్ని, బలగాన్ని ఎదుర్కొని, వ్యూహాలను ఛేదించుకొని ఈటల విజయం సాధించారు. ఈ పోరాటంలో ఎదురైన సమస్యలను, ముఖ్యమంత్రితో విభేదాలకు కారణాలను, తన భవిష్యత్తు కార్యాచరణను ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’తో ఈటల పంచుకున్నారు. ఆ విశేషాలు.. 

టీఆర్‌ఎస్‌ వారు ఎవరైనా ఫోన్‌ చేసి అభినందించారా?

ఎవరూ చేయలేదు. వారి మనసులోనే అభినందించుకున్నారు. రాజేందరన్న గెలిస్తే ప్రగతి భవన్‌ గేట్లు తెరుచుకుంటాయని, తమకు గౌరవం పెరుగుతుందని, లేదంటే బానిసలం అవుతామని అనుకున్నారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లోలాగే మున్ముందు ఎక్కడ, ఎవరు బలంగా ఉంటే వారిని ప్రజలు గెలిపిస్తారు. 


ఏ రకంగా హింస పెట్టారు? మెంటల్‌ టార్చరే కదా!

వందల మంది మఫ్టీలో ఉన్న పోలీసులను దించి.. ఒక్కో కుటుంబం వద్దకు పంపించారు. వారు ప్రతి కుటుంబంలో ఏ సమస్య ఉన్నదో గుర్తించి ప్రభుత్వానికి సమాచారం అందించే పని చేపట్టారు. మొత్తంగా ప్రతి కుటుంబాన్నీ ఈటల రాజేందర్‌కు దూరం చేయడం ఎలా, ఈటల రాజేందర్‌ ముఖం అసెంబ్లీలో కనిపించకుండా ఉండాలంటే ఏం చేయాలి.. అన్న లక్ష్యంతో చేశారు. ఇంటెలిజెన్స్‌ పోలీసులు తమ విధులను పక్కనబెట్టి పూర్తిగా హుజూరాబాద్‌పైనే పడ్డారు. నా వెంట ఉన్న జడ్పీటీసీ/ఎంపీటీసీ సభ్యులను, సర్పంచ్‌లను, మాజీలను అందరినీ వెలకట్టి తీసుకెళ్లారు. అక్కడ నేను 20 ఏళ్లుగా ఉన్నాను. ఆరుసార్లు గెలిచాను. ప్రజలతో నాకు కుటుంబ సభ్యుడి లాంటి అనుబంధం ఉంది. పచ్చటి నియోజకవర్గంలో చిచ్చుపెట్టే పనులు చేశారు. వీటిని చూస్తే.. మనం ఇంకా ఇలాంటి సమాజంలో బతుకుతున్నామా.. అనిపిస్తోంది. 


గెలవగలనా అనే భయం ఏ దశలోనైనా కలిగిందా? 

2004 నుంచి ఇప్పటిదాకా ఏనాడూ ఓడిపోతామన్న భావన కలగలేదు. కేవలం నాయకులను మాత్రమే నమ్ముకున్న వాణ్ని కాదు. ప్రజలను నమ్ముకున్న వాణ్ని. ఏనాడూ ఎవరికీ ఒక్క రూపాయిగానీ, దావత్‌లు గానీ ఇవ్వలేదు. 

Follow Us on:

రాజకీయ నేతలుమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.