కనీసం.. మంత్రికి తన శాఖలోని అంశాలపై చర్చించడం, నిర్ణయం తీసుకునే అధికారాలు లేవు

Nov 8 2021 @ 02:58AM

ఈసారి మీరు కూడా డబ్బులు పంచారట కదా?

ఏం జరుగుతుందోనన్న భయంతో స్థానిక నాయకులు ఏదైనా చేశారేమో తెలియదు కానీ.. నా వద్ద అన్ని డబ్బులు లేవు. ప్రత్యర్థులు మాత్రం నా వెంట ఉండే వారందరినీ కొనుగోలు చేశారు. మూడు రకాల వ్యూహాలను నాపై ప్రయోగించారు. నాయకులందరినీ కొనుగోలు చేసి తీసుకెళ్లడం. కొనుగోలు చేసిన నాయకులను నావద్దనే పెట్టి.. వారికి నన్ను అడుగడుగునా నిరుత్సాహపరిచే పనిని అప్పగించడం. ఎవరిని చూసినా అపనమ్మకం కలిగేలా చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. ఇది మానవ సంబంధాలకు ఓ మరక లాంటిది. కానీ, ప్రజాస్వామ్యంలో ఇది కుదరదని, అధికారం తన తాత నుంచి, తండ్రి నుంచి వచ్చింది కాదనే విషయాన్ని కేసీఆర్‌ మరిచిపోయారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర ముఖ్యమంత్రులు, ఆంధ్ర కాంట్రాక్టర్లు డబ్బులు తెచ్చి పంచుతున్నారని, వాటిని తీసుకొని.. ఓటు మాత్రం మనకే వేయాలని కేసీఆర్‌ సూచించారు. కానీ, ఇప్పుడు ఆయనే అంతకన్నా ఎక్కువ డబ్బులు పంచారు. పైగా స్థానిక నాయకులతో కాకుండా సిద్దిపేట వంటి ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారితో పంపిణీ చేయించారు. స్థానిక నాయకులపైనే కాకుండా ప్రజలపైనా కేసీఆర్‌ నమ్మకం కోల్పోయారు. 

ప్రజలపై సీఎం నమ్మకం కోల్పోతే.. ప్రజలు కూడా సీఎంపై నమ్మకం కోల్పోతారు కదా?
ప్రజలు నమ్మకం కోల్పోయారు కాబట్టే ఈ తీర్పు వచ్చింది. నేను ముందునుంచీ ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికను ఎదుర్కోవాలని సవాల్‌ చేశాను. ప్రభుత్వ పరంగా వారు చేసిన మంచి పనులేవో, నేను పోటీ చేస్తున్న పార్టీ చేయనివేవో చెప్పేంతవరకే పరిమితమైతే టీఆర్‌ఎ్‌సకు డిపాజిట్‌ కూడా వచ్చేదికాదు. కానీ, కొన్ని వందల కోట్లు ఖర్చు చేశారు. 


టీఆర్‌ఎస్‌ ఎంత ఖర్చు చేసిందని మీ అంచనా?
అక్రమంగా సంపాదించిన సొమ్ము రూ.600 కోట్లను నేరుగా ఖర్చు పెట్టారు. దళిత బంధు పథకం పేరిట రూ.2500 కోట్లు ఖర్చు చేశారు. గతంలో నేను మంజూరు చేయించుకున్న  అభివృద్ధి పనులకు సంబంధించి రూ.500కోట్లు ఖర్చు చేశారు. మొత్తంగా ప్రపంచ చరిత్రలో ఏ ఎన్నికల్లోనూ లేనంత ఖర్చు చేశారు. భవిష్యత్తులోనూ ఇలాంటి ఎన్నికను ఊహించలేం. 

వీటిని చూసి మీ భార్య భయపడలేదా?

మేమిద్దరం వామపక్ష ఉద్యమం నుంచి వచ్చినవాళ్లం. ధైర్యమే మా ఆస్తి. నిజాయితీ, ఒళ్లు వంచి పనిచేయడమే మా తత్వం. ప్రజలను ప్రేమించేవాళ్లం. ప్రజాస్వామ్య ఆకాంక్షల కోసం ఆరాటపడే వాళ్లం. ఏదైతే అదే కానియ్యి అనుకున్నాం. అవసరమైతే ఆస్తులు మొత్తం అమ్మేయ్‌. అంతే తప్ప.. కేసీఆర్‌తో రాజీ పడొద్దని నా భార్య చెప్పింది. వ్యాపారాలన్నీ మూసేసుకొని నీ వెంటే ఉంటాను.. చస్తే ఇద్దరం కలిసి చద్దామని చెప్పింది. నాలుగు నెలలకుపైగా ప్రతి ఇంటికీ వెళ్లి బొట్టు పెట్టి ఓటు వేయాల్సిందిగా కోరింది. ఆమె అంకితభావం చూసి మహిళలంతా కన్నీరు పెట్టుకున్నారు. 


మీరు కూడా ఓ సందర్భంలో కన్నీరు పెట్టినట్టున్నారు?
మహిళలంతా అక్కలు, చెల్లెళ్లుగా తిలకం దిద్ది ధైర్యం చెప్పిన సందర్భమది. 20 ఏళ్లుగా ఒక సోదరుడిగా వారితో పెనవేసుకున్న అనుబంధం. 


Follow Us on:

రాజకీయ నేతలుమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.