ltrScrptTheme3

నేను టీ-కాంగ్రెస్ ప్రెసిడెంట్ కావడానికి కేసీఆరే కారణం: రేవంత్ రెడ్డి

Oct 25 2021 @ 02:38AM

కేసీఆర్‌ను ఓడించడమే తన జీవితాశయమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాహుల్‌గాంధీ తనకు అవకాశం ఇవ్వడం కాంగ్రెస్‌ అధిష్ఠానం వైఖరిలో మార్పునకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ మేరకు ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’ కార్యక్రమంలో రేవంత్‌ తన అభిప్రాయాలను పంచుకున్నారు. 


వందల మంది బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్‌ తన రాచరిక పోకడలతో నాశనం చేస్తున్నారు. కేసీఆర్‌ను ఓడించి.. ఆయన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించడమే నా ఆశయం. కాంగ్రెస్‌ తరఫున నేనే ముఖ్యమంత్రిని కావాలని అనుకోవడంలేదు. 

- టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి


ఆర్కే: చాలా రోజుల తరువాత కలుస్తున్నాం. టెన్షనా? సాధించానన్న సంతోషం ఉందా?

రేవంత్‌: దీనిని (పీసీసీ అధ్యక్షుడు కావడాన్ని) రెండు రకాలుగా చూడొచ్చు. కాంగ్రెస్‌ పార్టీ పరంగా అత్యంత పెద్ద విజయం. రాష్ట్రాలకు సీఎంలు కావడమైనా సులభమేమో కానీ, కాంగ్రె్‌సలో ఒక రాష్ట్రానికి పార్టీ అధ్యక్షుడు కావడం ఆషామాషీ కాదు.


ఆర్కే: చాలా స్వల్ప కాలంలోనే కాంగ్రెస్‌ వ్యవహారాలను అర్థం చేసుకొని, హేమాహేమీలను కాదని అధ్యక్ష పదవి సాధించారు కదా?

రేవంత్‌: అది నా శక్తి అని నేను అనుకోవడంలేదు. రాహుల్‌గాంధీ ప్రత్యేకమైన ఆలోచనతో సోనియాగాంధీని కన్విన్స్‌ చేసి, ప్రస్తుతం తెలంగాణ పరిస్థితుల్లో బోల్డ్‌ డెసిషన్‌ తీసుకోవాలని చెప్పి ఒప్పించారు. ఆయన వ్యక్తిగతంగా చొరవ చూపి ముందుకు తీసుకెళ్లారు. ఇందులో నా ప్రయత్నం చాలా తక్కువ. ఇక్కడ కేసీఆర్‌ సృష్టించిన అగాధం, కాంగ్రెస్‌లోని అగ్ర నాయకత్వాన్నంతా తీసుకెళ్లి దొడ్లో కట్టేయడంతో ఇక్కడ వ్యాక్యూమ్‌ వచ్చింది. ఒకరకంగా నాకు ఈ అవకాశం రావడానికి పరోక్షంగా కేసీఆరే కారణం. ప్రశ్నించేవారే ఉండొద్దన్న పరిస్థితిని కేసీఆర్‌ తీసుకొచ్చారు. ప్రత్యామ్నాయం లేకుండా, ప్రశ్నించేవారు లేకుండా చేయడం, పెద్ద నాయకులను ఓడగొట్టడం, కేసులతో బెదిరించడంతో.. ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా? అన్న ఉద్దేశంతో కొందరు హుందాగా పక్కకు తప్పుకొన్నారు. దీంతో ప్రశ్నించేవారు ఎవరో ఒకరు ఉండాలన్న పరిస్థితి ఏర్పడింది. కేసీఆర్‌ నా మీద మరీ కసితో వ్యవహరించి, ఇంట్లో పడుకున్నా లాక్కెళ్లి బజారున పడేసి, జైల్లో పెట్టించి, రోడ్లమీద పడేసి.. 108 కేసులు పెట్టారు. 


ఆర్కే: రోజూ పొద్దున కేసీఆర్‌కు దండం పెట్టుకుంటున్నారా?

రేవంత్‌: నేనేమో కానీ, నావల్ల వీడొకడు వచ్చాడని ఆయనకు ఆయనే చెంపలు వేసుకోవాల్సి ఉంటుంది. రాహుల్‌గాంధీ ఒక గొప్ప నమ్మకంతో నాకు అవకాశం ఇవ్వడం కాంగ్రెస్‌ అధిష్ఠానం మారిన వైఖరికి నిదర్శనం. కాంగ్రెస్‌ నిర్ణయాల్లో గుణాత్మకమైన మార్పు వచ్చింది. అవసరమైతే సంప్రదాయాలకు భిన్నంగా కూడా వెళతామని చాటినట్లయింది. పంజాబ్‌లో ఒక మహారాజును తప్పించి దళితుణ్ని సీఎంను చేయడం గొప్ప నిర్ణయం. అణగారిన వర్గాలు, పేదల పట్ల నాయకుడిగా రాహుల్‌గాంధీ నిబద్ధతకు ఇది నిదర్శనం. అరాచకం పెరిగిపోయినప్పుడు పార్టీలో కొట్లాడడానికి ఎటువంటి వెసులుబాటు కల్పించాలన్న ఆయన నిర్ణయాల్లో గొప్పతనం. ఇవి ఆషామాషీ పరిణామాలేమీ కాదు. కేసీఆర్‌కు సంబంధించినంత వరకు స్వయంకృతాపరాధం.


ఆర్కే: అందరూ చంద్రబాబు ఇప్పించారని అంటున్నారు.. కానీ, కేసీఆర్‌ పుణ్యానే వచ్చినట్లుంది!

రేవంత్‌: కేసీఆర్‌ సృష్టించిన వాతావరణం ఇందుకు కారణం. ఈ విషయంలో ఏకీభవిస్తాను.


అందుకే ఏనాడూ చంద్రబాబును తిట్టలేదు: రేవంత్ రెడ్డి (part 2)

Follow Us on:

రాజకీయ నేతలుమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.