ఆయుధాలపై అవగాహన..

ABN , First Publish Date - 2021-10-27T06:32:11+05:30 IST

పోలీసుల విధుల పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ అన్నారు.

ఆయుధాలపై అవగాహన..
విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న ఎస్పీ

పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఓపెన్‌ హౌస్‌

పోలీసు విధులపై విద్యార్థులకు వివరించిన ఎస్పీ

ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు

ఏలూరు క్రైం, అక్టోబరు 26 : పోలీసుల విధుల పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ అన్నారు. పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ఏలూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఓపెన్‌ హౌస్‌ ఎగ్జిబిషన్‌ను ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ ప్రారంభించి  మాట్లాడుతూ 1959 అక్టోబరు 21వ తేదీన సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు భారత చైనా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సమయంలో చైనా బలగాలు భారీగా వచ్చి భారత సరిహద్దులోకి చొరబడి ఒక్కసారిగా వారిపై విరుచుకుపడ్డారన్నారు. సంఖ్యా బలం తక్కువగా ఉన్నప్పటికీ భారత సైన్యం ఆత్మ స్థైర్యంతో చైనా బలగాలను ఎదిరిస్తూ చివరి రక్తపు బొట్టు వరకూ పోరాడి అసువులు బాశారన్నారు. అప్పటి నుంచి ఆ తేదీని పోలీసు అమరవీరుల దినోత్సవంగా పాటించడం జరుగుతుందన్నారు. దేశ వ్యాప్తంగా ఈ ఏడాది 370 మంది తమ ప్రాణాలు కోల్పోయారని  రాష్ట్రంలో 11 మంది కోల్పోయారన్నారు.  కరోనా సమయంలో విధులు నిర్వర్తిస్తూ కరోనా వైరస్‌ సోకి 11 మంది పోలీస్‌ సిబ్బంది మృత్యువాత పడ్డారని చెప్పారు. పోలీసు విధుల పట్ల, పోలీసులు ఉపయోగించే ఆయుధాలు, వాహనాల వినియోగం ఏవిధంగా చేస్తారో విద్యార్థులకు అవగాహన కల్పించారు.  మెటల్‌ డిటెక్టర్‌, బాంబ్‌ డిస్పోజబుల్‌ పరికరాలు, వివిధ రకాల తుపాకులు ప్రదర్శనలో ఉంచగా వాటి ఉపయోగాలను ఎస్పీ వివరించారు.  అనంతరం పోలీసు జాగిలాలు ఎస్పీకి గౌరవ వందనం చేశాయి. సురేష్‌ బహుగుణ పోలీసు పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలను నిర్వహిస్తున్నామని విజేతలకు బహుమతులు అందిస్తామన్నారు. ఏఎస్పీ సుబ్బరాజు, ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ జయరామరాజు, ఏలూరు డీఎస్పీ దిలీప్‌ కిరణ్‌, ఏఆర్‌ డీఎస్పీ కృష్ణంరాజు, ఎస్‌బీసీఐ కొండలరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-27T06:32:11+05:30 IST