చదువుకుంటాం.. వసతి మహాప్రభో..

ABN , First Publish Date - 2021-10-26T13:28:39+05:30 IST

చదువుకుంటాం..

చదువుకుంటాం.. వసతి మహాప్రభో..

ఇంకా తెరుచుకోని ప్రీమెట్రిక్‌ హాస్టళ్లు

లక్షల మంది విద్యార్థుల భవిత అగమ్యగోచరం..

పోస్ట్‌ మెట్రిక్‌లో పాతవారికే చోటు


హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): కరోనా నెమ్మదించింది. పాఠశాలలన్నీ తెరుచుకుంటున్నాయి. అయితే, ప్రీమెట్రిక్‌ వసతి గృహాల తలుపులు ఎప్పుడు తెరుచుకుంటాయా? అని.. పిల్లలు ఎదురుచూస్తున్నారు. పాఠశాలలు తెరిచి.. ఆన్‌లైన్‌ పాఠాలు మొదలై రెండు నెలలు గడుస్తున్నా.. ఆ హోస్టళ్ల తలుపులు మాత్రం ఇంకా తీయకపోవడంతో చాలా మంది చిన్నారులు విద్యకు దూరం అవుతున్నారు. ఇంటి వద్దే గడిపేస్తున్నారు. త్వరగా వాటిని తెరిచే విషయంలో సంక్షేమ శాఖ అధికారులు నిర్ణయం తీసుకోవాలని విద్యార్ధులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. పాలకులు విధిగా అందించాల్సిన విద్య కోసం కూడా అర్థిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా సుమారు వెయ్యి వరకు ప్రీమెట్రిక్‌ హాస్టళ్లు ఉన్నాయి. వాటిలో లక్షమందికిపైగా విద్యార్ధులు వసతి పొందుతున్నారు. కరోనా వల్ల గత ఏడాది మార్చిలో అవన్నీ మూతబడ్డాయి. ఈ ఫిబ్రవరిలో కొద్దిరోజులు తెరిచి మురిపించారు. మళ్లీ మూసేసి విద్యార్థులను అయోమయంలో నెట్టేశారు. 


ఈ విషయంలో అధికారులకూ స్పష్టమైన సమాచారం లేకపోవడంతో సుమారు లక్షకుపైగా పిల్లల విద్య ప్రశ్నార్థకమైంది. పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు, పరీక్షలు కొనసాగుతున్నాయి. ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించి పాఠ్యాంశాలు పూర్తి కావస్తున్నాయి. మరోవైపు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో ఎట్టకేలకు ప్రీప్రైమరీ హాస్టళ్లను తిరిగి తెరవడంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. రాష్ట్రంలో సుదీర్ఘ విరామం తర్వాత ప్రీమెట్రిక్‌ హాస్టళ్లు తెరవాల్సి రావడంతో ప్రస్తుతం అక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయనే సమాచారంపై ఇంకా అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీపావళి తర్వాతైనా హాస్టళ్లు తెరిచేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. మొదట పాత విద్యార్ధుల్ని అనుమతించి ఆ తర్వాత కొత్త వారిని చేర్చుకొనే అవకాశం ఉందని సమాచారం.


పోస్ట్‌మెట్రిక్‌ హాస్టళ్లు తెరిచి వారమైంది. పాత విద్యార్థుల్ని మాత్రమే అనుమతిస్తున్నారు. రోజులు గడుస్తున్నా కొత్త విద్యార్థుల ప్రవేశాల విషయంలో స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 550 పోస్ట్‌మెట్రిక్‌ హాస్టళ్లు ఉన్నాయి. వీటి పరిధిలో లక్షన్నర మంది వసతి పొందుతున్నారు. కొత్త వారికి అడ్మిషన్లు ఇస్తే 30వేల మందికిపైగా విద్యార్థులకు అవకాశం లభించే ఆవకాశం ఉంది.

Updated Date - 2021-10-26T13:28:39+05:30 IST