పార్టీ అంటే నాకు పిచ్చి

Dec 6 2021 @ 02:23AM

ఎన్టీఆర్‌ పిలిచి సీటిచ్చారు

అందుకే పార్టీ అంటే అభిమానం

జగన్‌ ఇంత దుర్మార్గంగా పాలిస్తారని తెలుసుకోలేకపోయాం

‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో  అయ్యన్నపాత్రుడు, విజయ్‌


తెలుగుదేశం పార్టీ అంటే తనకు పిచ్చి అని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు నిర్వహించామని.. అది కష్టాల్లో ఉన్నప్పుడు దాని కోసం మాట్లాడాలని స్పష్టంచేశారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి దుర్మార్గుడని మండిపడ్డారు. వరదలతో ప్రజలు అల్లాడుతుంటే పబ్జీ ఆడుకుంటున్నారని విమర్శించారు. విశాఖను రాజధానిని చేయడం తమకూ  ఆనందమే అయినా.. రాజధాని అనేది రాష్ట్రానికి మధ్యలో ఉండాలన్నారు. ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ ఆదివారం నిర్వహించిన ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’ కార్యక్రమంలో వారిద్దరూ పాల్గొన్నారు. ముఖ్యాంశాలు ఇవీ..


నమస్తే అయ్యన్నపాత్రుడుగారు, విజయ్‌... ఎలా ఉన్నారు

అయ్యన్న: నమస్కారం సార్‌. బావున్నాం.

అజ్ఞాతవాసంలా తిరుగున్నారు.. ఎంతకాలం?

అయ్యన్న: దుర్మార్గుల రాజ్యం సర్‌. కొన్ని సార్లు తప్పదు. ప్రజల్లో కొంత మార్పు కనిపిస్తోంది. అయితే దుర్మార్గుడు కదా.. రకరకాల ఐడియాలు ప్రయోగిస్తాడు కదా!


సీఎం ఎలా ఉంటారనేది అంతకుముందు తెలియదా?

అయ్యన్న: తెలుసు కానీ.. ఇంత దుర్మార్గంగా, తుగ్లక్‌ మాదిరి పరిపాలిస్తారని తెలుసుకోలేకపోయాం. జనం తనతోటే ఉన్నారని నమ్మే వ్యక్తి.. ప్యాలెస్‌ వదిలి ఎందుకు బయటకు రాలేకపోతున్నారు. వరదలు వస్తే బయటకు రారా? జనం దగ్గరకు వెళ్లరా? ప్యాలె్‌సలో కూర్చుని అక్కడే అన్ని చూసుకోవడం.. అక్కడే పబ్జీ ఆడుకోవడం.. ఇంతేనా పదవి అంటే. ఎన్టీఆర్‌ దగ్గర నుంచి ఎందరో ముఖ్యమంత్రులను చూశాం. కానీ వరదలు వచ్చినా జనం దగ్గరకు వెళ్లి వారిని పలకరించాలన్న ఆలోచన లేని సీఎం ఈయనే.

2019లో టీడీపీ ఓడిపోయిన తర్వాత ఉత్తరాంధ్రలో వినిపించిన ఒకే ఒక గొంతు మీది. ఎందుకంత టెంపర్‌?

అయ్యన్న: పార్టీ అంటే నాకు పిచ్చి. ఎక్కడో పల్లెటూరులో చదువుకుంటున్న నన్ను పిలిచి సీటు ఇచ్చి చిన్న వయసులోనే ఎమ్మెల్యే చేసింది ఎన్టీఆర్‌ గారు. అందుకే ఆ పార్టీ అంటే అభిమానం. ఆ పార్టీలో పదవులు అనుభవించాం కాబట్టి పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు దానికోసం మాట్లాడాల్సిన బాధ్యత ఉంది. 

చంద్రబాబుపై అలిగి పార్టీ నుంచి వెళ్లిపోతానన్నారు కదా?

అయ్యన్న: పార్టీ నుంచి వెళ్లిపోతానని ఎప్పుడూ అనలేదు. కొన్ని సార్లు మీరు చేస్తోంది తప్పేనని చంద్రబాబుకే చెప్పాను. మీకంటే ముందు పార్టీలోకి వచ్చానని కూడా అన్నాను. పార్టీ నష్టపోతుంది కాబట్టి కొన్నిసార్లు అలా మాట్లాడాల్సి వచ్చింది. 

అయ్యన్నకు రాజకీయ వారసుడిగా వచ్చినట్లేనా?

విజయ్‌: వారసుడిగా అనను. 2009 ఎన్నికలకే నేను వచ్చాను. జనం అంగీకరించకుండా నేనేమీ చేయలేనని నాన్న అప్పుడే చెప్పారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా. చంద్రబాబు పాదయాత్రలో పాల్గొన్నాను.

విజయ్‌ కోసం నియోజకవర్గం ఎప్పుడు ఖాళీ చేస్తున్నారు?

అయ్యన్న: చంద్రబాబు గారు ఏమంటారో చూడాలి. విజయ్‌ పార్లమెంట్‌కే సూటవుతాడు. అనర్గళంగా మాట్లాడగలడు. అక్కడైతే రాజకీయంగా రాటుదేలతాడు అనుకుంటున్నా.

విజయ్‌: ఈ విషయంలో కొంత కాన్‌ఫ్లిక్ట్‌ ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు డిసైడ్‌ అవ్వాలని చెబుతాను. 

అయ్యన్న మీద కేసులు పెడుతుంటే భయం వేస్తుందా?

విజయ్‌: లేదు. నువ్వు ఒక విషయాన్ని నమ్మితే దానిపై గట్టిగా మాట్లాడు అని నాన్న చెబుతారు. అందుకే నేను ఇప్పుడు వాడిని సైకో అనగలుగుతున్నాను అంటే అతడిని విశ్లేషించాను కాబట్టే. రేపు వాదనకొస్తే నిలబడి మాట్లాడగలను. 

మీ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్ని కేసులు ఉన్నాయి?

అయ్యన్న: కేసులన్నీ ఇప్పుడు పెట్టినవే. ఈ ప్రభుత్వంలోనే 9కేసులు పెట్టారు. చివరకు 65 ఏళ్ల వయసులో నిర్భయ కేసు కూడా పెట్టారు. నేను ఎందరో నేతలను చూశాను. కానీ ఈ దుర్మార్గుడిని చూసినప్పుడు మనసు ఒప్పుకోవడం లేదు. 

విజయసాయికి, మీకు వ్యక్తిగత వైరం ఉందా?

అయ్యన్న: ఆయనెవరో నాకు తెలియదు. నేనెవరో ఆయనకు తెలియదు. చివరకు బ్రిటిష్‌ వాళ్లు కట్టిన విశాఖ కలెక్టరేట్‌ కూడా తాకట్టు పెట్టే ప్రయత్నం చేశారు.  

చంద్రబాబే బోరున ఏడ్చారు కదా!

అయ్యన్న: రాజకీయంగా ఏదైనా ఎదుర్కోవచ్చు. కానీ కుటుంబ సభ్యులను అంటే తట్టుకోలేం. 

విజయ్‌: ఆ సంఘటన తర్వాత పార్టీ కేడర్‌ ఇంకా పౌరుషంగా ముందుకొచ్చారు. ఎలాగైనా పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలన్న పట్టుదల పెరిగింది.

రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నావ్‌?

విజయ్‌: ఎమ్మెల్యే అవ్వాలనుకుంటే 25 ఏళ్లకే ఏదోకటి చేసేవాడిని. మొన్నటి ఎన్నికల్లో మీకు ఎంపీ ఇస్తామని వైసీపీ వాళ్లు నాకు ఫోన్‌ చేశారు. ఇంకోసారి ఇలాంటి ఫోన్లు చేయొద్దని చెప్పాం. సమాజంలో మార్పు కోసం పనిచేయాలి. ముందుగా ఈ నియంత పాలనకు చరమగీతం పాడాలి. 

మీరు బాధపడ్డ సందర్భాలు ఏమిటి?

అయ్యన్న: లక్ష్మీపార్వతి ఎపిసోడ్‌. నేను మంత్రిగా ఉంటే ఆమె ఫోన్‌ చేసి ఆ పని చేయి.. ఈ పని చేయి అని చెప్పేది. కుదరదు అంటే అన్నగారు చెప్పారని చెప్పేది. అన్నగారి దృష్టికి తీసుకెళ్తే ఆయన ఏమీ చెప్పలేకపోయారు. 

రాజకీయాల్లో మీరు ఎప్పుడు సంతృప్తిపడతారు?

అయ్యన్న: పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కార్యాయంలో పెద్దాయన పక్కన కూర్చుని పార్టీ వ్యవహారాలు చూసుకోవడం నాకు తృప్తి ఇస్తుంది. 

మైనింగ్‌లో మీపై ఆరోపణల సంగతేంటి?

అయ్యన్న: రెండున్నరేళ్లు అయింది కదా.. ఎందుకు తేల్చరంటే సమాధానం చెప్పరు. నా ప్రమేయం ఉంటే కేసులు పెట్టుకొమ్మని చెప్పాను.


మీకు, గంటాకు మధ్య గొడవలు ఎందుకు ?

అయ్యన్న: ఎప్పుడూ మా మధ్య గొడవలు లేవు. గంటా శ్రీనివాసరావుకు పదవి వచ్చింది అంటే మా పార్టీ వల్లనే. గంటా పార్టీని నాశం చేశాడని నేను అనను. కానీ అతని స్వభావం వేరు. నా స్వభావం వేరు. అయితే పార్టీలో గ్రూపులు రాకూడదు. మా వల్ల పార్టీ నష్టపోకూడదు. ఆ విషయంలో చిన్న చిన్న మనస్పర్థలు తప్పించి వేరే గొడవలు ఏమీ లేవు. ఎవరి పని వాళ్లు చేసుకుంటూ ఉంటాం. 

గంటా తెలుగుదేశంలో ఉన్నారా?

అయ్యన్న: లేరా అండీ! మీరు ఉన్నారా అంటే నాకూ అనుమానం వచ్చింది. ఈ మధ్యన ఆయన ఆరోగ్యం బాలేదు. హార్ట్‌ ఆపరేషన్‌ చేయించుకున్నాడు.  


విశాఖ రాజధానిని చేస్తామంటే మీరు ఎందుకు వ్యతిరేకించారు?

అయ్యన్న: విశాఖ రాజధాని కావడం ఇక్కడ పుట్టినవారిగా మాకు ఆనందమే. కానీ రాజధాని అంటే అందరికీ సెంటర్‌ ప్లేస్‌లో ఉండాలి. చంద్రబాబు చెప్పినట్లు విశాఖను ఫైనాన్షియల్‌ సిటీ చెయ్యి. అలాగే పర్యాటకంగా బాగా అభివృద్ధి చేయొచ్చు. ఇదే సీఎం అమరావతిలోనే రాజధాని ఉండాలని కూడా చెప్పాడు కదా! ఇప్పుడెందుకు మూడు రాజధానులు అంటున్నారు. ఇవాళ విశాఖలో రాజధానిపై ఓటింగ్‌ పెట్టండి.. జనం వద్దనే చెబుతారు. విజయసాయిరెడ్డి వచ్చి ఇక్కడ దందాలు చేస్తుండడం చూసి ఇక రాజధాని అయితే పరిస్థితి ఏమిటని జనం భయపడుతున్నారు. 

విజయసాయి ఒక్కరేనా.. ఇంకా ఎవరైనా ఉన్నారా?

అయ్యన్న: ఒక బ్యాచ్‌ ఉంది. ఆస్తులు బలవంతంగా లాగేసుకుంటున్నారు. నీ సైట్‌ నాకు నచ్చింది ఇచ్చేసెయ్‌ అంటూ విజయసాయి ఒకే మాట చెబుతున్నారు. అలా మాట విని ఇవ్వకుంటే ఆ ఆస్తులను 22ఏ కింద వివాదస్పద భూముల కింద పెట్టేస్తున్నారు. ఎన్‌ఆర్‌ఐలు ఇక్కడ భూములు కొని పెట్టుకున్నారు. ఇప్పుడవన్నీ లాగేసుకున్నారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆ భూముల వివాదాలపై సిట్‌ వేయించాను. అప్పుడు విజయసాయి సిట్‌ కాదు.. సీబీఐ కావాలన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మరో సిట్‌ వేశారు తప్పించి సీబీఐ గురించి అడగడం లేదు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.