ధవన్‌ ధనాధన్‌

ABN , First Publish Date - 2021-04-19T09:33:17+05:30 IST

ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ (49 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 92) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు.

ధవన్‌ ధనాధన్‌

పంజాబ్‌పై ఢిల్లీ గెలుపు

ముంబై: ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ (49 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 92) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. దీంతో పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 196 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్‌ మరో 10 బంతులుండగానే ఛేదించింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. ఓపెనర్లు మయాంక్‌ అగర్వాల్‌ (36 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 69), బర్త్‌డే బాయ్‌ కేఎల్‌ రాహుల్‌ (51 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 61) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. ఆ తర్వాత ఛేదనలో ఢిల్లీ 18.2 ఓవర్లలో 4 వికెట్లకు 198 పరుగులు చేసి ఆరు వికెట్లతో గెలిచింది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ధవన్‌ నిలిచాడు.


ఆది నుంచే జోరు:

భారీ ఛేదనలో ఢిల్లీ ఇన్నింగ్స్‌ కూడా జోరుగానే సాగింది. ఓపెనర్‌ పృథ్వీ షా (32) క్రీజులో ఉన్నంత సేపు వేగంగా ఆడి ఆరో ఓవర్‌లో అవుటయ్యాడు. ఆ తర్వాత ధవన్‌ వరుస బౌండరీలతో కదం తొక్కుతూ జట్టును లక్ష్యం వైపు నడిపించాడు. 31 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసిన అతడు 14వ ఓవర్‌లో హ్యాట్రిక్‌ ఫోర్లతో సెంచరీ వైపు కదిలాడు. కానీ 15వ ఓవర్‌లో స్వీప్‌ షాట్‌ ప్రయత్నంతో బౌల్డ్‌ అయ్యాడు. స్మిత్‌ (9), పంత్‌ (15) నిరాశపరిచినా.. 17వ ఓవర్‌లో స్టొయినిస్‌ (13 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 27 నాటౌట్‌) 20 రన్స్‌ రాబట్టడంతో ఛేదన 18 బంతుల్లో 16 రన్స్‌కు తగ్గింది. ఆ తర్వాత లలిత్‌ యాదవ్‌ (12 నాటౌట్‌) ఫోర్లతో ఢిల్లీ 18.2 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించింది.

ఓపెనర్ల హవా: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ ఆరంభం నుంచే పరుగుల మోత మోగించింది. 12 ఓవర్లలోనే జట్టు స్కోరు 120. ఈ సమయంలో సులువుగా 220 పరుగులు దాటిస్తుందనిపించింది. కానీ ఆట ముగిసేసరికి వారు ఆశించిన స్కోరును మాత్రం సాధించలేకపోయింది. అటు 9, 40, 50 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రాహుల్‌ ఇచ్చిన మూడు క్యాచ్‌లను ఢిల్లీ వదిలేయడం వారి ఫీల్డింగ్‌ వైఫల్యాన్ని చాటింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన మయాంక్‌ ఈసారి సత్తా చూపాడు.


రెండో ఓవర్‌లో అతడు 4,4,6,4తో 20 పరుగులు రాబట్టాడు. దీంతో పవర్‌ప్లేలో జట్టు 59 రన్స్‌ సాధించింది. 25 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన మయాంక్‌ 11వ ఓవర్‌లో రెండు వరుస సిక్సర్లతో ధాటిని కనబరిచాడు. కానీ 13వ ఓవర్‌ నుంచి ఢిల్లీ బౌలర్లు ప్రభావం చూపారు. మయాంక్‌ జోరుకు మెరివాలా బ్రేక్‌ వేశాడు. తొలి వికెట్‌కు 122 పరుగుల భాగస్వామ్యం సమకూరింది. 45 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన రాహుల్‌ ఆ తర్వాత వేగంగా ఆడే క్రమంలో 16వ ఓవర్‌లో అవుటయ్యాడు. చివర్లో క్రిస్‌ గేల్‌ (11), పూరన్‌ (9) నిరాశపరిచినా షారుక్‌ (15 నాటౌట్‌) 20వ ఓవర్‌లో 4,4,6తో 16 రన్స్‌ సాధించాడు.


శిఖర్‌ ధవన్‌

 (49 బంతుల్లో 92)

రాహుల్‌ (61)

మయాంక్‌ (69)

స్కోరుబోర్డు

పంజాబ్‌: కేఎల్‌ రాహుల్‌ (సి) స్టొయినిస్‌ (బి) రబాడ 61; మయాంక్‌ అగర్వాల్‌ (సి) ధవన్‌ (బి) మెరివాలా 69; గేల్‌ (సి) సబ్‌-ఆర్‌వి.పటేల్‌ (బి) వోక్స్‌ 11; దీపక్‌ హూడా (నాటౌట్‌) 22; పూరన్‌ (సి) రబాడ (బి) అవేశ్‌ 9; షారూక్‌ ఖాన్‌ (నాటౌట్‌) 15; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 195/4; వికెట్ల పతనం: 1-122, 2-141, 3-158, 4-179; బౌలింగ్‌: వోక్స్‌ 4-0-42-1; లుక్‌మన్‌ మెరివాలా 3-0-32-1; అశ్విన్‌ 4-0-28-0; రబాడ 4-0-43-1; లలిత్‌ యాదవ్‌ 1-0-11-0; అవేశ్‌ ఖాన్‌ 4-0-33-1. 


ఢిల్లీ: పృథ్వీ షా (సి) గేల్‌ (బి) అర్ష్‌దీప్‌ 32; ధవన్‌ (బి) రిచర్డ్‌సన్‌ 92; స్మిత్‌ (సి) రిచర్డ్‌సన్‌ (బి) మెరిడిత్‌ 9; పంత్‌ (సి) దీపక్‌ (బి) రిచర్డ్‌సన్‌ 15; స్టొయినిస్‌ (నాటౌట్‌) 27; లలిత్‌ (నాటౌట్‌) 12; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 18.2 ఓవర్లలో 198/4; వికెట్ల పతనం: 1-59, 2-107, 3-152, 4-180; బౌలింగ్‌: అర్ష్‌దీప్‌ 3-0-22-1; షమి 4-0-53-0; జలజ్‌ సక్సేనా 3-0-27-0; రిచర్డ్‌సన్‌ 4-0-41-2; దీపక్‌ 2-0-18-0; మెరిడిత్‌ 2.2-0-35-1. 

Updated Date - 2021-04-19T09:33:17+05:30 IST